మేము ఎక్కడైనా విఫలమవుతామేమోనని ఆశపడ్డారు
హైదరాబాద్‌లో వ్యాపారంపై కొందరు దుష్ప్రచారం చేశారు
అయినా..రూ.1.80లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు
చేసుకున్నాం మేం భారీగా పెట్టుబడులు తేవడం చూసి
కొందరికి కడుపుమంటగా ఉంది చాలా సంస్థలు
తెలంగాణ పెవిలియన్‌కు వచ్చి ఒప్పందాలు చేసుకున్నాయి
విదేశాలతో పోటీ పడే స్థితిలో హైదరాబాద్ ఉంది ఈ
ప్రభుత్వం తెచ్చిన ఎనర్జీ పాలసీతోనే పెట్టుబడులు వచ్చాయి
గత ప్రభుత్వ నేతలు ఇక్కడ కొల్లగొట్టి.. విదేశాలకు నిధులు
తరలించారు దావోస్‌లో వాటినే తెలంగాణలో పెట్టుబడులుగా
చూపించారు మీడియా సమావేశంలో సిఎం రేవంత్‌రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : గత ప్రభుత్వంలో ఇక్కడి నుంచి విదేశాలకు నిధులు తరలించారని సిఎం రేవంత్ ఆరోపించారు. ఇక్కడ కొల్లగొట్టిన సొమ్మునే విదేశీ పెట్టుబడులుగా చూపారని ఆయన విమర్శించారు. తాము విఫలమైతే పైశాచిక ఆనందం పొందాలని కొందరు చూశారని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రా ష్ట్రంలో పెట్టుబడులు రాకుండా కొందరు కుట్రలు చేశారని, వాటిని తాము చేధించామని ఆయన పేర్కొన్నారు. బిఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టి లండన్‌లో పెట్టుబడులు పెడితే తాము ప్రజల కోసం విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకు వచ్చామని సిఎం చెప్పారు. ఫార్ము లా ఈ కార్ రేసు కేసులో ప్రజల సొమ్మును కొల్లగొట్టారని వారిపై కేసులు పెట్టారని, ప్రజల కోసం పెట్టుబడులు తెచ్చినందుకు
ప్రజలు మమ్మల్ని అభినందిస్తున్నారని సిఎం చెప్పారు. తాము దావోస్‌కు వెళ్లింది పెట్టుబడులు తీసుకురావడానికని, వాళ్లకు తమకు ఉన్న తేడా ఇదేనని ఆయన తెలిపారు. సంస్థలు ఎక్కడివైనా వారి దగ్గర ఉన్న డబ్బులను మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా అంతిమంగా రాష్ట్రంలో పరిశ్రమలు, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలన్నది తమ ఉద్దేశమని సిఎం అన్నారు. దావోస్ పెట్టుబడులకు సంబంధించి సిఎం రేవంత్‌రెడ్డి సచివాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ పెట్టుబడులు పెట్టే సంస్థలకు అవసరమైన భూ కేటాయింపులు చేసి అన్ని రకాలుగా ఆ సంస్థలను ప్రోత్సహిస్తామన్నారు. మనందరం కలిసి కష్టపడితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆయన చెప్పారు.
విదేశాల్లో పెట్టుబడులపై వివరాలు ఇస్తా…
రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజల సొమ్ముతో విదేశాల్లో పెట్టుబడులు పెట్టారని, ఏ సంస్థల్లో ఆ పెట్టుబడులు పెట్టారో వాటి వివరాలు ఇస్తామని ఆయన సిఎం పేర్కొన్నారు. తాము కంపెనీల కార్యాలయాల వద్దకు వెళ్లలేదని ముఖ్యమంత్రి తెలిపారు. కంపెనీల యాజమాన్యాలే దావోస్‌కు వచ్చి ఈ ఒప్పందాలు కుదుర్చుకున్నాయని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తాము ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీల జాబితా ఇస్తామని ఆయన పేర్కొన్నారు. కంపెనీల వద్దకు వెళ్లి ఎవరైనా చెక్ చేసుకోవచ్చని, పెట్టుబడులు స్వాగతించక పోయినా అక్కసు ఎందుకని ప్రతిపక్షాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి సంస్థలను విదేశాలకు తీసుకువెళ్లి పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకొని ప్రచారం చేసుకుంటున్నారని కిషన్ రెడ్డి, కెటిఆర్ చేసిన విమర్శలపై సిఎం స్పందిస్తూ మహారాష్ట్రకు చెందిన రిలయన్స్ సంస్థతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దావోస్‌లో మూడు లక్షల కోట్లతో ఒప్పందం చేసుకున్నారని దీనిపై కిషన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని సిఎం ప్రశ్నించారు.
రాష్ట్ర అభివృద్ధిపై దుష్ప్రచారం చేస్తున్నారు….
రాష్ట్ర అభివృద్ధిపై దుష్ప్రచారం చేస్తున్నారని సిఎం రేవంత్ మండిపడ్డారు. విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకురావాలన్నదే తమ ప్రయత్నమని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. దావోస్ పర్యటనతో రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులను పెట్టేలా మన రాష్ట్రం ఆకర్షించగలిగిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇది నిరంతర ప్రక్రియగా ఆయన అభివర్ణించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంస్థలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇది తమ ప్రభుత్వం సాధించిన కీలక విజయమని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రాజకీయంగా విభేదించినా రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాజకీయ వివాదాలకు వెళ్లొద్దని ఆయన హితవు పలికారు.
ఎనర్జీ పాలసీతోనే రాష్ట్రంలో పెట్టుబడులు
ఇతర రాష్ట్రాల కంటే గొప్పగా పెట్టుబడులు సాధించామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అసూయతోనే వారు మమ్మల్ని అభినందించడం లేదన్నారు. భారీ పెట్టుబడులు తీసుకురావడం చూసి కొందరికి కడుపుమంటగా ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న ఓ నేత అటెన్షన్ డిజార్డర్‌తో బాధపడుతున్నారని సిఎం రేవంత్ ఎద్దేవా చేశారు. చాలా సంస్థలు మన పెవిలియన్‌కు వచ్చి ఒప్పందాలు చేసుకున్నాయన్నారు. కెసిఆర్ ప్రభుత్వంలో ఈ స్థాయిలో పెట్టుబడులు రాలేదన్న అక్కసుతో ఉన్నారని సిఎం రేవంత్ తెలిపారు. ఎనర్జీ పాలసీతోనే రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగాయన్నారు. అంతర్జాతీయ సంస్థలను హైదరాబాద్‌కు తీసుకువచ్చేందుకు దావోస్ వెళ్లామని, ప్రపంచ ఆర్థిక సదస్సులో భారీగా పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకున్నామన్నారు. తెలంగాణలో పెట్టుబడులపై కొందరు దుష్ప్రచారం చేశారని,
కానీ, ఇన్వెస్టర్లు తమపై పూర్తి విశ్వాసం ఉంచారన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం ఉంచుతూ భారీ పెట్టుబడులతో వ్యాపారవేత్తలు ముందుకు వచ్చారని ఆయన తెలిపారు. తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి రికార్డు స్థాయిలో పెట్టుబడులు రావడం తమ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అతిపెద్ద విజయమన్నారు. పెట్టుబడులు తీసుకురావడం కొత్తేమీ కాదని గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాల్లో కూడా భారీగా పెట్టుబడులు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. 2004- నుంచి 2014 వరకు అప్పుడు తీసుకున్న నిర్ణయాల మేరకు పెట్టుబడులు వచ్చాయన్నారు. నాడు ప్రధాని పివి సరళీకృత ఆర్థిక విధానాలు తీసుకువచ్చారని, ప్రపంచానికి ఒక బలమైన విశ్వాసాన్ని కాంగ్రెస్ నాయకత్వం చూపిందని సిఎం రేవంత్ తెలిపారు. రాజకీయంగా విధానాలను విభేదించినా సరే కానీ, రాష్ట్ర ప్రజయోనాల విషయంలో రాజకీయాలు చేస్తే ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు.
స్కిల్ డెవలప్మెంట్ కోసం సింగపూర్ ప్రభుత్వంతో ఎంఓయూ
స్కిల్ డెవలప్మెంట్ వర్సిటీ కోసం సింగపూర్ ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్నామని, ఇదో అద్భుత పరిణామమని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. యువతలో సాంకేతిక నైపుణ్యాలు పెంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని సిఎం హామీ ఇచ్చారు. సింగపూర్ ఆధ్వర్యంలో నడుస్తుస్తున్న ఐటీఈ సంస్థతో ఒప్పందాలు చేసుకున్నామని ఆయన తెలిపారు. ఇది భవిష్యత్‌లో మన సాంకేతికను పెంపొందించడానికి ఉపయోగపడుతుందని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆ బానిస సంకెళ్లను తెంచుకోవాలి…
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో సిఎం రేవంత్ రెడ్డి అనాలోచిత చర్యల వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని సిఎంపై కేసు నమోదు చేసి విచారించాలని బిఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి బానిస మనస్తత్వం, ఆలోచన విధానం అందరికీ తెలుసన్నారు. ఏదో ఒక రోజు ఆ బానిస సంకెళ్లను తెంచుకోవాలని కోరుకుంటున్నానని సిఎం రేవంత్ తెలిపారు.
రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు: మంత్రి దుద్దిళ్ల
దావోస్ పర్యటనలో గతేడాది కంటే నాలుగు రేట్లు ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. రాష్ట్ర ప్రజలు, యువతకు మేలు చేయాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచన అని ఆయన చెప్పారు. ఎన్ని విమర్శలు చేసినా వాటిని సలహా లాగే తీసుకున్నామన్నారు. సింగపూర్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని నిర్ణయించామన్నారు. సాంకేతిక నైపుణ్యం, విద్యార్థుల బదిలీ బరిగేలా ఒప్పందం చేసుకున్నామని ఆయన చెప్పారు. రూ.450 కోట్లతో స్కిల్ సెంటర్ ఏర్పాటుకు క్యాపిటలాండ్ ముందుకు వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. స్విట్జర్లాండ్‌కు చెందిన యూబిఎస్, మల్టీవాక్ గ్రూప్‌తో ఒప్పందాలు చేసుకున్నామని ఆయన వివరించారు. దావోస్ పర్యటనలో రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబ డులు సాధించామని ఆయన ఉద్ఘాటించారు. వన్ ట్రిలియన్ ఎకానమీ దిశగా అడుగుపడిందన్నారు. మూసీ పునరుజ్జీవం, యువతకు ఉపాధిపై దృష్టి పెట్టామని ఆయన తెలిపారు. మూసీని ప్రక్షాళన చేసి ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందిస్తామన్నారు. హైదరాబాద్ అంటేనే బిజినెస్ అనే బ్రాండ్ ఏర్పడిందని ఆయన చెప్పుకొచ్చారు. సాంకేతిక నైపుణ్యాలకు హైదరాబాద్‌ను కేంద్రంగా మారుస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.
సింగపూర్ సంస్థలతో చేసిన చర్చలు
సింగపూర్‌కు చెందిన ఇద్దరు మంత్రులను కలిశామని, మూసీ ప్రక్షాళన, నిరుద్యోగుల నైపుణ్యం పెంచే అంశాలపై ముఖ్యమంత్రి సింగపూర్ మంత్రులతో చర్చించారని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. సింగపూర్ మంత్రులు కూడా తమ సహకారం అందిస్తామన్నారని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. సింగపూర్ రివర్ చిన్నదే కానీ, నదిని ప్రక్షాళన చేస్తే అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేశారని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు క్వాలిటీ లైఫ్ అందించాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశ్యమని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. దావోస్‌లో రూ.1,79,950 కోట్లు, జురిక్‌లో సుమారుగా రూ.3వేల కోట్ల పైచిలుకు పెట్టుబడులు వచ్చాయని, మొత్తంగా రూ. 1,82,800 కోట్ల పెట్టుబడులు రాగా, 51,400 కొత్త ఉద్యోగాలు ఈ పెట్టుబడుల వల్ల వస్తాయని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.