Thursday, January 30, 2025

అవును నిజం.. చేదు నిజం!

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల చివర్లో ప్రారంభమవుతున్నాయి. జనవరి 31న మొదలయ్యే తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి 13 వరకు కొనసాగుతాయి. రెండవ విడత సమావేశాలు ఇంచుమించుగా నెల రోజుల తర్వాత మార్చి 10 మొదలై ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి. తొలి విడత సమావేశాలు ప్రారంభం రోజున, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసగిస్తారు. మర్నాడు, ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2025- 26 కు వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెడతారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది కావడం ఒక విశేషం అయితే, ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో ఎన్‌డిఎ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ 0.3 ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి తొలి బడ్జెట్ కావడం మరో విశేషం.

బాగుంది. అయితే, ఇలాంటి విశేషాలు ఎన్నున్నా, పార్లమెంట్’ సమావేశాల పనితీరు, ‘నానాటికీ తీసికట్టు నాగం భోట్లు’ అన్నట్లుగా దిగజారుతోంది. అందుకే, పార్లమెంట్ సమావేశాల పట్ల రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాన్యులలో కూడా ఆసక్తి సన్నగిల్లుతోంది. ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలను చర్చించి, పరిష్కార మార్గాలు చూపించవలసిన పార్లమెంట్’ సమావేశాలు, తెల్ల ఏనుగులను తలపిస్తున్నాయనే విమర్శలను ఎదుర్కొంటున్నాయి.
నిజానికి రంగులతో సంబంధం లేకుండా అధికార ప్రతిపక్షాలు రెండూ కూడా పార్లమెంట్‌కు ఇవ్వవలసిన గౌరవం ఇవ్వడం లేదు. ఏదో మొక్కుబడి తంతుగా, సమావేశాలు నిర్వహించడమే కానీ, పద్ధతిగా, ప్రజాస్వామ్య బద్ధంగా సభను నిర్వహించాలనే ఆలోచన, అటూ ఇటూ ఎటు కనిపించడం లేదు. అందుకే, ఎవరికీ వారు, సమావేశాల క్రతువను ‘మమ’ అనిపించి, ఓ పనైపోయింది అని అనుకుంటున్నారు. అందుకే, ప్రజల్లోనూ పార్లమెంట్, సమావేశాల పట్ల ముందున్న ఆసక్తి ఇప్పడు కనిపించడం లేదు.
సహజంగా పార్లమెంట్ సమావేశాలు, ప్రారంభమవుతున్నాయి అంటే, సమావేశాల్లో ఏయే అంశాలు చర్చకు వస్తాయి, ప్రజాసమస్యలు ఏ మేరకు చర్చకు వస్తాయి, అనే చర్చ జరుగుతుంది. ఇక బడ్జెట్ సమావేశాలు అంటే, వేరే చెప్పనక్కర లేదు. ప్రజలు ఏవేవో ఉహించుకుంటారు, ధరలు, పన్నులు, మౌలిక వసతులు, రాయితీలు ఇలా చాలా చాలా విషయాల్లో చాలా చాలా చర్చ జరురుగుతుంది.

నిజానికి, ఇప్పుడు కూడా అలాంటి చర్చ జరుగుతూనే వుంది. అయితే, ఆ చర్చకు విలువ వుందా? గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రజల గళం వినిపించుకుంటారా? ప్రజా సమస్యలను చర్చించి, పరిష్కారాలు చూపుతారా, అసలు పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగుతాయా అంటే, అనుమానం అక్కర లేదు. అందుకే, దేశంలో రాజకీయ విలువలు దినదిన ప్రవర్థమానంగా దిగజారుతున్నాయి’…అనే మాట తరచు వినవలసి వస్తోంది. అవును. ఇది చాలా కాలంగా జరుగుతున్నదే, సర్వత్రా వినిపిస్తున్నదే. అందులో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. అటు రాజకీయ నాయకులు, ఇటు రాజ్యాంగా నిపుణులు, చివరకు సర్వోన్నత న్యాయస్థానం మొదలు సామాన్య మానవుల వరకు అందరిదీ అదే మాట, అదే అభిప్రాయం. నెహ్రూ నుంచి మోడీ వరకు పాలనా పగ్గాలు ఎవరి చేతిలో ఉన్నా, దేశంలో రాజకీయాలు, రాజకీయ విలువల ఏటికేడాది దిగజారుతూనే ఉన్నాయి. గత సంవత్సరం చివర్లో జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు, ఎంత సుందర ముదనష్టంగా సాగాయో, ఏ స్థాయికి దిగజరాయో, వేరే చెప్పనక్కరలేదు. మన మీద మనకే అసహ్యం కలిగే స్థాయిలో పార్లమెంట్, పార్లమెంట్ ప్రాంగణం వేదికగా అనేక జుగుత్సాకర సంఘటనలు చోటు చేసుకున్నాయి. గౌరవ ఎంపిలు ఒకరిని ఒకరు తోసుకుని, కొట్టుకుని పార్లమెంట్ ప్రాంగణాన్ని ‘పవిత్రం’ చేశారు. ఇంత చేసి, చివరకు పార్లమెంట్, శీతాకాల సమావేశాలు ఏమైనా సాధించాయా అంటే. హళ్లికి హళ్లి సున్నకు సున్న.

సమావేశాలు ప్రజాధనం వృథా కావడం మినహా మరో ప్రయోజనం జరిగింది లేదు. అవును, గత సంవత్సరం చివర్లో నవంబర్ 25 డిసెంబర్ 20 వరకు జరిగిన పార్లమెంటు శీతాకాల సమావేశాలు, సదరు సంవత్సరంలో జరిగిన సమావేశాల్లో అత్యంత అనుత్పాదక’ సమావేశాలుగా ముగిసిపోయాయి. ప్రముఖ వ్యాపారవేత్త అదానీ అస్తుల వివాదంతో మొదలైన శీతాకాల సమావేశాలు, చివరకు రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్’పై హోం మంత్రి అమిత షా చేసిన వ్యాఖ్యల వివాదంతో ముగిసిపోయాయి. ఇక్కడ ఎవరి వాదన ఏమిటి? ఏది మంచి, ఏది చెడు? అనే విషయాన్ని పక్కనపెడితే, దినదిన ప్రవర్థమానంగా దిగజారుతున్న పార్లమెంట్’ పని తీరుకు శీతాకాల సమావేశాలు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచాయి. ఈ సమావేశాలు, మరో మైలు రాయిని కూడా దాటాయి. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా అధికార, ప్రతిపక్ష సభ్యులు పార్లమెంట్ ప్రాంగణంలో, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్’ పై తమకు గల గౌరవాన్ని చాటుకునేందుకు పోటాపోటీగా ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించారు. ఒకరి నొకరు తోసుకున్నారు. ఒక మాజీ మంత్రి సహా ఇద్దరు అధికార బిజెపి సభ్యులు గాయాలతో ఆసుపత్రికి చేరారు. ఆ విధంగానూ 2024 పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మరో మలిన చరిత్ర సృష్టించాయి.

అదలా ఉంటే, పార్లమెంట్ సమావేశాల సమయం వృథా కారణంగా కోట్ల రూపాయల ప్రజాధనం వృథాగా కొట్టుకుపోతోంది. పార్లమెంట్ ఉభయ సభల నిర్వహణకు నిమిషానికి రెండున్నర లక్షల రూపాయలు ఖర్చవుతాయని ప్రజాస్వామ్య పరిరక్షణ సంస్థల లెక్కలు చెపుతున్నాయి. మొన్నటి శీతాకాల సమావేశాల్లో మొత్తం 65 గంటల 15 నిముషాల సమయం వృథా అయింది. అంటే రూ. 97,87,50,000 వృథా అయింది. నిజానికి, గత సంవత్సరం ఆఖర్లో జరిగిన శీతాకాల సమావేశాలు మాత్రమే, కాదు, అంతకు ముందు జరిగిన పార్లమెంట్ సమావేశాలు ఏవీ కూడా సజావుగా సాగిన సందర్భం ఏదీ లేదు. అంతే కాదు, రేపటి బడ్జెట్ సమావేశాలు సహా, భవిష్యత్ సమావేశాలు అయినా సజావుగా జరగాలని కోరుకోవచ్చును గానీ, అలాంటి సంకేతాలు అయితే, కనిపించడం లేదు. అందుకే, నిజానికి ముందు ముందు మన ప్రజాస్వామ్యం, మరింత అధ్వాన స్థితికి దిగజారినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. అలాగే, రాను రాను రాజు గుర్రం అన్నట్లు రాను రాను మన ప్రజాసామ్యం ప్రశ్నార్ధకంగా మారుతోంది. ఇది నిజం. చేదు నిజం.

రాజనాల బాలకృష్ణ
9985229722

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News