Friday, January 31, 2025

అభివృద్ధి నమూనా కేజ్రీవాల్‌ను గెలిపిస్తుందా?

- Advertisement -
- Advertisement -

ఇవ్వాళ యావత్తు దేశం ప్రజల దృష్టి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ఉంది. అవినీతి వ్యతిరేక పోరాటం ద్వారా అధికారంలోకి వచ్చి, ప్రత్యర్థి బిజెపి చేతిలో అవినీతి మచ్చను పెట్టించుకొని నాల్గవసారి ముఖ్యమంత్రి పీఠం కోసం పోరాడుతున్న కేజ్రీవాల్ విజయం సాధిస్తారా? మరోసారి సిఎంగా ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్‌ను ఎన్నుకోవడానికి ఆయన అభివృద్ధి నమూనా తోడ్పడుతుందా? అంటే నిజమేనని ఢిల్లీ ప్రజల ప్రతిస్పందన కొంతవరకు మీడియా సర్వేలో ద్వారా వ్యక్తం అవుతోంది. నాల్గవసారి ఎన్నికల్లో గెలవడంఅనేది ఏ రాజకీయ పక్షానికైనా కష్టమైనపనే! అయితే, కేజ్రీవాల్ మాత్రం ఇప్పటి ఢిల్లీ ఎన్నికలను చావోరేవో అన్నరీతిలో తనదైన శైలితో పోరాడుతున్నారు. చాలా మందికి కేజ్రీవాల్ 2013లో అన్నాహజారే ద్వారా ఉద్యమం లో వచ్చి ఢిల్లీ ముఖ్యమంత్రిగా సంకీర్ణంలో వచ్చిన రాజకీయ నేపథ్యాన్నే చూస్తారు.

వాస్తవంగా కేజ్రీవాల్ 2013 కంటే ముందే తన సివిల్ సర్వీసు ఉద్యోగాన్ని తృణప్రాయంగా త్యజించి పరివర్తన్ పేరుతో ఢిల్లీలోని 70 మురికివాడల్లో ప్రజలకు తన అనుచర బృందంతో కలిసి ఎనిమిది ఏళ్లు స్వచ్ఛంద సేవలు అందించారు. ఆ నిజాయితీ, పునాదే ఢిల్లీ రాజకీయాల్లో తిరుగులేనిశక్తిగా కేజ్రీవాల్‌ను నిలబెట్టింది. ఆనాటి స్వచ్ఛంద ఉద్యమంలో భాగస్వాములైన మిత్రులే దశాబ్దకాలంగా ఢిల్లీ కేబినెట్‌లో కేజ్రీవాల్ సహచరులుగా ఉన్నారు. తద్వారా ఓ నమ్మకమైన నాయకత్వ బృందం కేజ్రీవాల్‌కు ఢిల్లీ రాజకీయాల్లో కలిసివచ్చింది. కేంద్రంలో అధికారంలో ఉండి అన్ని రకాలుగా నియంత్రణ చేయగల మంత్రాంగం బిజెపి చేతిలో ఉన్నా ఢిల్లీలో కేజ్రీవాల్ నిలదొక్కుగలిగాడంటే తన ఉద్యమ సహచరుల నిస్వార్థ అండదండలే అనడంలో సందేహం లేదు! ఢిల్లీ ఎన్నికలలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ప్రచార బరిలో బిజెపితో అమీతుమీ తేల్చుకోవడానికి కేజ్రీవాల్ సిద్ధమయ్యారు. ఈ దశలో కేజ్రీవాల్ రాజకీయంగా ఓ మెట్టు ఎక్కగలిగారు. దేశంలో తానే ఇండియా కూటమికి పెద్ద దిక్కు అన్నభావం ఉన్న కాంగ్రెస్‌ను కాదని, ఆ కూటమిలోని ప్రధాన పక్షాలైన సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, శివసేన, శరద్ పవార్ లాంటి వారి మద్దతు కొంత ఆయనకు నైతిక బలాన్ని చేకూర్చింది. తద్వారా కేంద్రంలో బిజెపికి ప్రత్యామ్నాయంగా తానూ నిలవగలమనే రాజకీయ సంకేతాలు కేజ్రీవాల్ ఇవ్వగలిగారు.

కాంగ్రెస్‌ను కాదని ఇండియా కూటమిలోని ప్రాంతీయ పార్టీల మద్దతు కేజ్రీవాల్ సాధించడం భవిష్యత్ రాజకీయ వ్యూహంలో కీలక సంకేతమే! ఇకపోతే ఢిల్లీ ఎన్నికలలో నాల్గవ సారి విజయం సాధించడమనేది ప్రజల్లో కేజ్రీవాల్ అభివృద్ధి నమూనాపై ఉన్న స్థిరమైన నమ్మకంపైనే ఆప్ ఆశలు పెట్టుకొని ప్రస్తుతం పోరాడుతున్నది. 2013లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదకొండేడ్ల కాలంలో ఢిల్లీ అభివృద్ధిలో కేజ్రీవాల్ పాత్ర, ముద్ర తక్కువేంకాదు! తొలి దశలో ప్రజల గడప ముందుకు పౌరసేవలు అందించిన విషయం నుండి మానవ వనరుల అబివృద్ధికి కీలకమైన విద్య, వైద్యం ఒక అభివృద్ధి నమూనాగా తీసుకొని ఉన్నత ప్రమాణాలు నెలకొల్పకోగలిగారు. దేశం మొత్తం మీద కునారిల్లుతున్న విద్యావ్యవస్థను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళి, ప్రభుత్వబడులను ప్రైవేటు విద్యావ్యవస్థకు దీటుగా మలచగలిగారు. అమెరికా అధ్యక్షుడి భార్య ఢిల్లీ పర్యటనలో విద్యాలయాల సందర్శనకు ఆసక్తి చూపడం ఢిల్లీ విద్యారంగం విశిష్ట నమూనాగా తేల్చింది. ఇక విద్య, వైద్యం అనబడే రెండు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించగల అంశాలకు బడ్జెట్‌లో ధైర్యంగా 50శాతం నిధులు కేటాయించిన చరిత్ర ఒక్క కేజ్రీవాల్‌కే ఉంది.

దేశాన్ని ఓ కుదుపు కుదిపిన అభయ సంఘటన తర్వాత మహిళలకు బస్‌లు, మెట్రో రైళ్ళలో ఉచిత ప్రయాణ సౌకర్యం కలిగించడంతో పాటు, భద్రతకోసం మార్షల్స్‌ను నియమించిన ఆలోచన ఆయనదే! మధ్యతరగతికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ రాయితీ, ఆటో కార్మికులకు ఆర్థిక వనరులు సహకారం, మహిళా సాధికారితకోసం వ్యక్తిగత ఆర్థిక పథకం రూపశిల్పి. ఇప్పుడు బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కూడా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అమలు జరుపుతున్న పథకాలకు, ఎన్నికల వాగ్దానాలకు పునాది కూడా కేజ్రీవాల్ అభివృద్ధి నమూనా అనడంలో సందేహంలేదు! ఢిల్లీలో రోడ్లు, ప్లై ఓవర్ల నిర్మాణం, శాశ్వత మంచినీటి పథకం కోసం కేజ్రీవాల్ దశాబ్దకాలంగా కేజ్రీవాల్ వేసిన ముద్ర విశిష్టత సంతరించుకున్నదే! ఢిల్లీలో రాజకీయంగా కేజ్రీవాల్ బలం ఏమంటే, విశ్వాసపాత్రమైన అనుచరులు, కార్యకర్తల బలం దండిగా ఉంది. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు బలంగానే ఉన్నప్పటికీ ఆప్ స్థాయిలో గుర్తింపు ఉన్న నేతలు లేకపోవడం, కేజ్రీవాల్‌కు దీటైన ముఖ్యమంత్రి అభ్యర్థి కనిపించకపోవడం ప్రతిపక్ష పార్టీల బలహీనతగా ఉంది. గత దశాబ్ద కాలంగా విద్య, వైద్య ఫలితాలు అందుకున్న కొత్త ఓటర్లు ఏకపక్షంగా కేజ్రీవాల్ వైపు మొగ్గుతారనే ఆశలు ఆప్‌కి ఉన్నాయి.

బిజెపి మాత్రం తనకున్న అంగ, అర్థబలాలతో నిష్కర్షగా మాట్లాడగలిగే కేజ్రీవాల్ అనబడే ప్రత్యామ్నాయం లేకుండా చూడాలని ఉవ్విళ్ళూరుతున్నది. ఆ మేరకు పార్లమెంటు ఎన్నికల్లో వచ్చిన 53 శాతం ఓట్ల విజయం ధీమాతో బిజెపి ఆప్‌తో అమీతుమీకి సిద్ధం అయింది. ఢిల్లీ ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ పార్టీ పోరాటం గౌరవప్రదమైన స్థానమే! ఇక ఎంఐఎం, బిఎస్‌పి లాంటి చిన్న, చితక పార్టీలు సైతం ఎన్నికల గోదాలో దిగుతున్నట్లు ప్రకటించాయి? అయితే ఇది కేజ్రీవాల్‌కు ఏమేరకు నష్టం చేస్తుంది? బిజెపికి ఏ మేరకు సహాయపడుతుంది అనేది చెప్పలేని స్థితి. సాఫ్ట్ హిందూత్వ ఓట్లు పొందడం ద్వారా బిజెపి బలం ఎంతోకొంత తగ్గించడం, బలమైన బిజెపి వ్యతిరేక ఓటును పొందడం ద్వారా కాంగ్రెస్‌ను కనీస ఓట్లకు పరిమితం చేయడం. తమ అభివృద్ధి నమూనాతో ప్రజల్లో విశ్వాసం పాదుకొల్పడం అనే త్రిముఖ వ్యూహం తో తలపడి, మళ్ళీ అధికారంలోకి రావడం ద్వారా దేశంలో జాతీయ పార్టీగా, బిజెపి ప్రత్యామ్నాయ శక్తిగా ఆప్‌ని నిలబెట్టాలనేది కేజ్రీవాల్ కల! అది ఏమేరకు నెరవేరుతుందో చూడాలి!?.

ఎన్. తిర్మల్, 94418 64514

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News