న్యూఢిల్లీ : ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు కొన్ని రోజులకు ముందు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను బుధవారం విడుదల చేసింది. రాజధానిలో అధికారంలోకి వచ్చినట్లయితే, కుల గణన నిర్వహిస్తామని, పూర్వాంచలీలకు ఒక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేస్తామన కాంగ్రెస్ వాగ్దానం చేసింది. 2013లో ఆప్ చేతిలో అధికార చ్యుతి పొందిన కాంగ్రెస్ మహిళలకు నెలకు రూ. 2500 గ్రాంట్ ఇస్తామని, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని, రూ. 500 ధరకు ఎల్పిజి సిలిండర్లు సమకూరుస్తామని కూడా వాగ్దానం చేసింది. పార్టీ గ్యారంటీల్లో రూ. 25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా సదుపాయం, ఉచిత రేషన్ కిట్లు పంపిణీ కూడా ఉన్నాయి.
మేనిఫెస్టోను 22 ప్రధాన దృష్టి రంగాలుగా విభజించడమైంది. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ మేనిఫెస్టోను విడుదల చేశారు. కాంగ్రెస్ కమ్యూనికేషన్ల ఇన్చార్జి జైరామ్ రమేష్ ఆయన వెంట ఉన్నారు. విద్యాధిక నిరుద్యోగ యువతకు ఒక సంవత్సరానికి నెలకు రూ. 8500 ఆర్థిక సహాయాన్ని కూడా మేనిఫెస్టో వాగ్దానం చేస్తోంది. రూ. 5 ధరకు భోజనం సరఫరా చేసే 100 ఇందిరా క్యాంటీన్లను నగర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తామని కూడా పార్టీ ప్రతిపాదించింది. కాలుష్యం విషయంలో బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని, ఆప్ నాయకత్వంలోని ఢిల్లీ ప్రభుత్వాన్ని జైరామ్ రమేష్ తూర్పారబట్టారు. సంక్షోభం పరిష్కారంలో అవి విఫలమయ్యాయని రమేష్ ఆరోపించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్నాయి. ఫలితాలను 8న ప్రకటిస్తారు.