Friday, January 31, 2025

ఎసిబి దాడుల్లో పట్టుబడ్డ డాక్టర్, ఎస్‌ఐ

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల్లో బుధవారం పశువైద్యాధికారి, ఎస్‌ఐ ఎసిబి వలలో చిక్కుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉట్నూర్ ఏజన్సీలోని శ్యాంపూర్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (పశువైద్యాధికారి) రమేష్ రాథోడ్ ఎసిబి అధికారులకు చిక్కాడు. బుధవారం రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు అతనిని రెడ్‌హాండెడ్‌గా పట్టుకున్నారు. అధికారుల వివరాల ప్రకారం … ఉట్నూర్ మండలం, ఉదయనాయక్ తండాలో పశుసంవర్ధకశాఖ అసిస్టెంట్ ఉద్యోగిగా పనిచేసిన జుగ్నాక్ మాధవ్ ఇటీవల బదిలీ అయ్యాడు. తన ఉద్యోగ విధులకు సంబంధించి రెండు నెలల డ్యూటీ సర్టిఫికెట్ జారీ కోసం వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ రాథోడ్ రమేష్‌ను ఆయన సంప్రదించారు. ఇందుకు రూ.15 వేల లంచం ఇస్తేనే సర్టిఫికెట్ జారీ చేస్తానని చెప్పడంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు.

తన కుమారుడు జుగ్నాక్ గంగాధర్ ద్వారా రూ. 15 వేలు లంచం ఇస్తుండగా అసిస్టెంట్ సర్జన్ రాథోడ్ రమేష్‌ను ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదేవిధంగా కామారెడ్డి జిల్లా, లింగంపేట ఎస్‌ఐ సుధాకర్ ఒక కేసు విషయంలో లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే.. లింగంపేట్‌కు చెందిన కొండేష్ తన వద్ద ఉన్న మారుతీ కారును నవీన్ గౌడ్‌కు విక్రయించారు. నవీన్ గౌడ్ అదే కారును కామారెడ్డికి చెందిన కారు కన్సల్టెంట్ స్వామికి విక్రయించగా, స్వామి నిజామాబాద్‌కు చెందిన చిరంజీవికి విక్రయించాడు. కారుపై ఫైనాన్స్ ఉండటంతో ఫైనాన్స్ కంపెనీవారు మొదటి యజమాని అయిన కొండేష్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. కొండేష్ నుంచి కారును కొనుగోలు చేసిన నవీన్ గౌడ్‌కు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుని ఫైనాన్స్ క్లియర్ చేసుకోవాలని తెలిపారు. కొండేష్, నవీన్ గౌడ్‌పై లింగంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో లింగంపేట ఎస్‌ఐ కంది సుధాకర్, కారు చివరి కొనుగోలుదారు అయిన చిరంజీవి నుంచి కారు తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్‌లో ఉంచారు.

సదరు ఎస్‌ఐ సుధాకర్ కారు చివరి కొనుగోలుదారు చిరంజీవితో బేరం మొదలు పెట్టాడు. మొత్తానికి రూ.20,000కు బేరం కుదిరింది. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు బుధవారం మధ్యాహ్నం ఎస్‌ఐ రూ.12,500 లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి నాంపల్లి కోర్డులో హాజరుపరిచారు. కాగా, గత ఏడాది డిసెంబర్‌లో స్టేషన్ బెయిల్ కోసం లంచం తీసుకుంటూ అప్పటి ఎస్‌ఐ అరుణ్ కుమార్ ఎసిబికి పట్టుబడ్డాడు. ఆయన స్థానంలో వచ్చిన ఎస్‌ఐ సుధాకర్ 40 రోజుల వ్యవధిలోనే అవినీతి నిరోధక శాఖ అధికారులను చిక్కాడు. మూడు మాసాల్లో ఒకే పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇద్దరు ఎస్‌ఐలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటం సర్వత్రా చర్చనీయాంశమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News