Friday, January 31, 2025

ఎపి శకటానికి కేంద్ర ప్రభుత్వ పురస్కారం

- Advertisement -
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగిన 76వ గణతంత్ర దినోత్సవం పెరేడ్‌లో భాగంగా ప్రదర్శించిన శకటాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ శకనికి కేంద్ర ప్రభుత్వం జ్యూరీ అవార్డు ప్రకటించింది. ప్రభుత్వం రాష్ట్రంలోని చేతి వృత్తుల కళలకు ప్రాముఖ్యత చాటుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారసత్వ సంప్రదాయానికి ప్రతీకగా ఉన్న ఏటి కొప్పాక బొమ్మలతో రూపొందించి, ప్రదర్శించిన శకటం రిపబ్లిక్ డే పెరేడ్ ఉత్సవానికే హైలెట్‌గా నిలిచి యావత్ దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షించింది. సామాజిక మాధ్యమాల్లో సైతం లక్షలాది మంది ఈ శకటానికి మంత్రముగ్ధులై ప్రశంసలతో ముంచెత్తారు. రాష్ట్రంలో చేతివృత్తులు, హస్తకళలకు జాతీయ స్థాయిలో,

అంతర్జాతీయ స్థాయిలో విస్తృత ప్రచారం తీసుకురావాల్నే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఈ శకటాన్ని రూపొందించింది. శకటం ముందు వినాయకుడు, చివరలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి ఎత్తయిన రూపాలతో ఇరువైపులా బొబ్బిలి వీణలు, తెలుగువారి కట్టుబొట్టు ప్రతిబింబించేలా అమర్చిన ఏటికొప్పాక బొమ్మల కొలువుతో శకటం కట్టుకుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు సైతం ఈ శకటం రూపాన్ని చూసి పులకించిపోయారు. ఏటికొప్పాక శకటానికి బహుమతి రావడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్‌కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News