Friday, January 31, 2025

బిఆర్‌ఎస్ రైతు మహా ధర్నా ఓ డ్రామా:మంత్రి కోమటిరెడ్డి

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మళ్లీ ఏం మొహం పెటుకొని నల్గొండకు వచ్చారంటూ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ రైతు మహా ధర్నా ఓ డ్రామా అని, ఆ పార్టీని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని, ఈ మహా ధర్నా అట్టర్ ప్లాప్ అయ్యిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శిం చారు. బుధవారం మంత్రి కోమటిరెడ్డి మంత్రులతో ముఖాముఖీ కార్యక్రమంలో భాగంగా గాంధీభవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బిఆర్‌ఎస్ రైతు మహా ధర్నాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ సభల్లో పల్లీలు, ఐస్‌క్రీములు అమ్ముకునే అంత జనం కూడా కెటిఆర్ రైతు మహాధర్నాకు హాజరు కాలేదని మంత్రి సెటైర్లు వేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తాను ఎక్కడ నిలబడినా గంటలో 5 వేల మంది గుమిగూడుతారని ఆయన పేర్కొన్నారు.

జిల్లాలో ఫ్లోరైడ్ మహమ్మారిని పెంచి పోషించింది బిఆర్‌ఎస్ పార్టీ కాదా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా లో కాంగ్రెస్ 11 సీట్లలో విజయం సాధించిందని, ఆ దెబ్బతో ప్రజల్లో బిఆర్‌ఎస్ పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకత బయటకు వచ్చిందన్నారు. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా బిఆర్‌ఎస్ ఉమ్మడి జిల్లాలో ఒకే ఒక్క సీటుకు పరిమితమైందని ఆయన ఎద్దేవా చేశారు. గంధమల్ల బస్వాపూర్ ప్రాజెక్టులను పడావు పెట్టి పైన కొండపోచమ్మ, మల్లన్న సాగర్ ప్రాజెక్టులను కట్టి కిందకు కాలువను కూడా వదలని మానవత్వం లేని మనిషి రూపంలో ఉన్న మృగాలు బిఆర్‌ఎస్ నాయకులని మంత్రి కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. 300 ఎకరాల్లో నల్లగొండ జిల్లాలో మహాత్మాగాంధీ యూనివర్శిటీని తాను ఏర్పాటు చేయించానని మంత్రి తెలిపారు. పదేళ్ల పాలనలో ఏనాడు మహాత్మ గాంధీ యూనివర్శిటీని చూడని కెటిఆర్‌కు అధికారం పోయాక గుర్తు వచ్చిందని ఆయన విమర్శించారు.

కెసిఆర్ ఫ్యామిలీ అవినీతిలో మునిగిపోయింది
అమెరికా నుంచి వచ్చి డైరెక్ట్ ఎమ్మెల్యే అయిన కెటిఆర్ ప్రత్యేక తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన తనను విమర్శిస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. తండ్రి చాటు కొడుకుగా కెటిఆర్, అల్లుడిగా హరీష్ రావు రాజకీయాల్లోకి వచ్చారని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. కెటిఆర్, హరీష్ రావులకు తనను విమర్శించే స్థాయి లేదని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. కెసిఆర్ ఫ్యామిలీ అవినీతిలో మునిగిపోయిందని, ఇన్నేళ్ల రాజ కీయ జీవితంలో తన మీద ఒక్క అవినీతి మరక లేదన్నారు. పదేళ్లు అధికారం అనుభవించిన పాపానికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బిఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు కేవలం ఒక్క సీటు మాత్రమే ఇచ్చి తగిన బుద్ధి చెప్పారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేత పదవి కోసం కెటిఆర్, హరీష్ రావులు కొట్లాడు కుంటున్నారని ఇద్దరు కలిసి ముందు కెసిఆర్‌ను  అసెంబ్లీకి తీసుకురావాలని ఆయన సూచించారు.

మూసీ ప్రక్షాళనను బిజెపి ఎందుకు అడ్డుకుంటోందని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు. అలాగే ప్రజా యుద్ధనౌక గద్దర్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఖండించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన వ్యక్తి గద్దర్ అని మంత్రి కోమటిరెడ్డి గుర్తు చేశారు. చనిపోయే వరకు ప్రజా సమస్యలపైనే పోరాటం చేసిన వ్యక్తి చనిపోతే కనీసం ప్రధాని నరేంద్ర మోడీ నివాళులు అర్పించకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాల్గొన్నారని అప్పుడు బండి సంజయ్ ఎక్కడున్నారని ఆయన ధ్వజమెత్తారు. బాధ్యతాయు తమైన కేంద్ర మంత్రి పదవిలో ఉండి ఓ మహోన్నత వ్యక్తిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని మంత్రి కోమటి రెడ్డి ఫైర్ అయ్యారు.

అక్షర చిట్ ఫండ్ స్కాంలో రూ.500 కోట్ల కుంభకోణం
అక్షర చిట్ ఫండ్ స్కాం అగ్రిగోల్డ్ వ్యవహారం లాంటిదేనని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. కెసిఆర్ ఇప్పటి వరకు అక్షర శ్రీనివాస్‌ను కాపాడుకుంటూ వచ్చారని, అక్షర చిట్ ఫండ్ స్కాం పై విచారణ జరపాలని డిజిపిని ఆదేశించామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. సిఎం తో మాట్లాడి అక్షర చిట్ ఫండ్స్ స్కాంకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. పేరాల శ్రీనివాస్ రావు అనే వ్యక్తి ఎర్రబెల్లి దయాకర్ రావుకు, కెసిఆర్‌కు చుట్టం కావడం వల్లే ఇన్నాళ్లు కాపాడారని, రూ. 500 కోట్ల స్కాంకు పాల్పడ్డారని మంత్రి ఆరోపించారు.

మరుగుజ్జు కుటుంబానికి మంత్రి భరోసా….
మరుగుజ్జు కుటుంబానికి మంత్రి కోమటిరెడ్డి భరోసా ఇచ్చారు. రేషన్‌కార్డు, ఇందిరమ్మ ఇళ్లు కావాలని మలక్‌పేట్‌కు చెందిన మరుగుజ్జు కుటుంబం దరఖాస్తు చేసుకుంది. గతంలో దరఖాస్తు చేసినా ఏ ఒక్క పథకం రాలేదని వారు వాపోయారు. న్యాయం చేయాలని వారు మంత్రిని వేడుకున్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కోమటిరెడ్డి వారికి న్యాయం చేస్తామని హామీనిచ్చారు. మంత్రులతో ముఖాముఖీ కార్యక్రమంలో భాగంగా మొత్తం 799 దరఖాస్తులు వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News