Friday, January 31, 2025

అప్పులు, అద్దెబస్సులతో ఆర్‌టిసి రూట్ ఎటు?

- Advertisement -
- Advertisement -

పీకల లోతు అప్పులతో కొట్టుమిట్టాడుతున్న టిఎస్‌ఆర్‌టిసి అద్దె బస్సులు గుదిబండగా మారాయి. సొమ్ము ఆర్‌టిసిది.. డబ్బు ప్రైవేట్ వాహనాల యాజమానులకు అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నది.అప్పులు తీర్చలేక, ఆదాయం లేక ఆర్‌టిసి ఇక్కట్లు ఎదుర్కొంటే అద్దె బస్సులతో ఆర్‌టిసి మనగడ ప్రమాదంలో చిక్కుకుంది. ఒక్క పక్క ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మీ, ఉచిత ఆర్‌టిసి ప్రయాణంతో టియస్‌ఆర్‌టిసి ఆర్థికంగా కుదేలు అవుతోంది. ప్రగతి కోసం ప్రజల కోసం ఆర్‌టిసి బస్సు చక్రం ప్రగతి చిహ్నం అంటూ నినాదం వల్లిస్తున్నా ఆర్‌టిసి రూటు… ఎటూ అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ప్రజారవాణ వ్యవస్థ నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తున్న తెలంగాణ రోడ్డు రవాణ సంస్థ (టియస్‌ఆర్‌టిసి)కు ప్రభుత్వం నుంచి ఆర్థికంగా చేయూత అందుతుందా? ప్రశ్నలు వెలుగు చూస్తున్నాయి.

అద్దె బస్సుల వల్ల ఆర్‌టిసి మనుగడకు ప్రమాదం పొంచి ఉంది. ఆర్‌టిసిలో డీజిల్, ఇతర బస్సులు ప్రజలకు సేవలు అందిస్తుండగా కొత్తగా ప్రైవేట్ పెట్టుబడిదారులు ఎలెక్ట్రికల్ బస్సులు తయారు చేయించి ఆర్‌టిసి వివిధ డిపోల్లో నడిపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్‌టిసి అనుమతించకుండా ప్రైవేట్ సంస్థలకు ఎలెక్ట్రికల్ బస్సులు తయారీ చేసి ఆయా రాష్ట్రాలోని ఆర్‌టిసి సంస్థలో బస్సులు నడిపించుకోవాలన్న నిర్ణయం తెలంగాణ ఆర్‌టిసికి ప్రమాదం పొంచి వుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 97 బస్సు డిపోలు, మొత్తం 9 వేల 800 బస్సులు ప్రజలకు రవాణా సేవలు అందిస్తున్నాయి. టిఎస్‌ఆర్‌టిసిలో వివిధ విభాగాల్లో మొత్తం రమారమి 40 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. తెలంగాణలోని 33 జిల్లాలు 10 రీజినల్ కార్యాలయాలు, 3 జోనల్ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. అంటే ఒక లక్ష 20 వేల కోట్ల ఆస్తులు కలిగి ఉంది. ఆస్తుల మాట అలా వుంటే అప్పులు, బకాయిలు అక్షరాల రూ. 6 వేల 322 కోట్లు అని చెప్పాలి.

ఆర్‌టిసికి పెద్దఎత్తున రుణభారం బకాయిలతో కుదేలు అవుతోంది. గత సంవత్సరం రుణబకాయిలు చెల్లింపుల కోసం రూ. 6,322 కోట్లు కావాలని టియస్‌ఆర్‌టిసి రాష్ట్ర ప్రభుత్వానికి మొరపెట్టుకుంది. ఆర్‌టిసి చాలా నిరాశగా నష్టాల బాటలో పయనించడంవల్ల బ్యాంకుల నుంచి రూ. 3 వేల కోట్లకు పైగా రుణం తీసుకొంది. అప్పులు పుట్టకపోవడంతో కార్మికుల సొమ్మును టియస్‌ఆర్‌టిసి యాజమాన్యం వాడుకుంది. ఆర్‌టిసి నియమ నిబంధనల ప్రకారం కార్మికులకు చెల్లించాల్సిన “లీనిన్ కాల్సఞమెంట్‌”ను రూల్డు చేయడం వల్ల కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశ్రాంత ఉద్యోగులకు సకాలంలో చెల్లింపులు చేయడం కోసం, ఇతర అవసరాల కోసం టిఎస్‌ఆర్‌టిసి తక్షణం దాదాపుగా రూ. 2500 కోట్లు కావాలని అభ్యర్థించింది. కార్మికులు క్రెడిట్ సొసైటినుంచి యాజమాన్యం డబ్బులు వాడుకొందని కార్మికుల్లో ఆక్రోశం నెలకొంది. గతంలో టియస్‌ఆర్‌టిసిలో మెగా సంస్థకు చెందిన ప్రైవేట్ ఎలెక్ట్రికల్ బస్సులకు గత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

తాజాగా జెబిఎం సంస్థకు చెందిన అనేక ఎలెక్ట్రికల్ అద్దె బస్సులు టిఎస్‌ఆర్‌టిసి నడుస్తున్నాయి. ప్రధాన మంత్రి పథకం క్రింద ఒక్కొక్క ఎలెక్ట్రికల్ బస్సుకు రూ. 35 లక్షలు సబ్సిడీ రావడంతో ప్రైవేట్ పెట్టుబడిదారులు ఎలెక్ట్రికల్ బస్సులు తయారు చేయించి టియస్‌ఆర్‌టిసి ద్వారా నడిపిస్తూ సంస్థ మనుగడకు గండికొడుతున్నారు. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ టిఎస్‌ఆర్‌టిసి స్వయంగా ఎలెక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేసి రవాణా వ్యవస్థను మెరుగుపర్చాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ ఎలెక్ట్రికల్ బస్సులకు టిఎస్‌ఆర్‌టిసి ఆధ్వర్యంలో నడిపించడం వెనుక సూత్రధారులు, పాత్రదారులు ఎవరు ఉన్నారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రజా రవాణా వ్యవస్థను బతికించుకోకపోతే పేదవర్గాలకు రవాణా వ్యవస్థ అందనంత దూరంలో ఉంటుంది. మరో ప్రధాన అంశం గమనంలోకి తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా టియస్‌ఆర్‌టిసికి రూ. 14 కోట్లు వస్తున్నది.

ఉచిత ప్రయాణం వల్ల ప్రతి రోజు రూ. 4 కోట్లు మాత్రమే వస్తున్నాయి. గడిచిన సంవత్సరకాలంలో ఆర్‌టిసికి రూ. 3600 కోట్ల నష్టం వాటిల్లింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం క్రింది టిఎస్‌ఆర్‌టిసికి రూ. 2 వేల 800 కోట్లు చెల్లించినట్లుగా తెలుస్తున్నది. కాగా మరో రూ. 800 కోట్లు పైగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌టిసికి చెల్లించాల్సి వుంది. గతంలో ఆర్‌టిసి ఉద్యోగులకు నెలలోని 15, 16 తేదీల్లో వేతనాలు అందేవి. యూనియన్ బ్యాంక్ ఇండియాలో టియస్‌ఆర్‌టిసి ఒప్పందం కుదుర్చుకోవడంవల్ల ప్రతి నెల 1, 2 తేదీల్లో వేతనాలు పొందుతున్నారు. ఆర్థికంగా టియస్‌ఆర్‌టిసి కష్టాల కడలిలో వున్నా ఒడి తీసుకొని కార్మికులకు వేతనాలు యూనియన్ బ్యాంక్ ఇస్తున్నది. 9800 బస్సులు ప్రస్తుతం ఉండగా, 3000 వేల అద్దె బస్సులు వివిధ డిపోలో నుంచి వివిధ మార్గాల్లో నడుస్తున్నాయి. అద్దె బస్సుతో ఆర్‌టిసి మనుగడ కొనసాగుతుందా లేదా! అటూ కార్మికులు, ఇటు ప్రయాణికులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అద్దె బస్సులకు స్వస్తి చెప్పి టియస్‌ఆర్‌టిసి స్వయంగా ఎలెక్ట్రికల్ బస్సులను, ఇతర బస్సులను తయారు చేయించి ప్రయాణికులకు అందుబాటులో తేవాలని ఆర్‌టిసి కార్మిక జెఎసి సమ్మె సైరన్ మోగించేందుకు సన్నద్ధం అవుతున్నది. ఆర్‌టిసి యాజమాన్యం ఒక అడుగు ముందుకు వేసి ఆశాజనకమైన నిర్ణయం తీసుకొని ఆర్‌టిసిని రక్షించాల్సిన బాధ్యత వుంది.

గుర్రం రాంమోహన్ రెడ్డి
79810 18644

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News