Friday, January 31, 2025

అమెరికా మేడిపండు!

- Advertisement -
- Advertisement -

ఈ అప్పుల ఫలితంగా అమెరికాలోని ప్రతి పౌరునిపైనా 91 లక్షల రూపాయల అప్పు ఉంది. కొన్ని దశాబ్దాలుగా అమెరికా అప్పులు పెరుగుతూనే ఉన్నాయి. 2000 సంవత్సరం నాటికి 5.7 ట్రిలియన్ డాలర్ల అప్పు ఉండగా, 2024 నాటికి 36 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. ప్రపంచంలోని అనేక దేశాల ఆర్థిక వ్యవస్థల మొత్తం విలువ కన్నా అమెరికా అప్పులే ఎక్కువ. మేడి పండు విప్పిచూస్తే దాని నిండా పురుగులు కన్పిస్తాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా అలాంటిదే. ఆయుధ బలంతో వెనుకబడిన దేశాల సహజ వనరులను, సంపదలను లూటీ చేయటం ద్వారా దాని ఆర్థిక మనుగడ కొనసాగిస్తున్నది. వెనుకబడిన దేశాలు, ప్రజలు అమెరికా కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే దాని ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది.

ఆకాశాన్నంటే భవనాలు, బహుళ జాతి సంస్థలు, మంచి ఉద్యోగాలు, భారీ వేతనాలు, అద్భుతమైన జీవితంగా అమెరికా గురించి మధ్యతరగతి జీవుల ఊహలు. అక్కడి పరిస్థితులు ఈ ఊహలకు భిన్నంగా ఉన్నాయి. అక్కడి పేదరికం, సంపద కేంద్రీకరణ, అప్పులు, ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఉద్యోగాల తొలగింపు ఆ దేశ వాస్తవ పరిస్థితులకు అద్దంపడుతూ దాని మేడిపండు స్వభావాన్ని వెల్లడి చేస్తున్నాయి.
సంపద కేంద్రీకరణ

భూతల స్వర్గంగా ప్రచారం చేయబడుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇతర దేశాలపై ఆధారపడి కొనసాగుతున్నది. ప్రపంచంలో ఏ దేశంలో లేని సంపద అసమానతలు అమెరికాలో ఉన్నాయి. ఇది 1920 నుండి ఎన్నడూ లేనంత స్థాయిలో నేడు ఉంది. గత 30 సంవత్సరాల్లో అగ్రశ్రేణి 1 శాతం ప్రజల సంపదలో 21 ట్రిలియన్ల (1 ట్రిలియన్ లక్ష కోట్లు) డాలర్లు పెరిగితే, దిగువ సగం మంది ప్రజలు 9 వందల బిలియన్ల డాలర్ల సంపదను కోల్పోయారు. ఐరోపా కన్నా అమెరికాలో ధనిక, పేదల మధ్య అంతరం వేగంగా పెరిగిందని ఇంపీరియల్ కాలేజీ బిజినెస్ స్కూల్లో ఫైనాన్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్, అధ్యయనం ప్రధాన రచయితలలో ఒకరైన డాక్టర్ క్లారా మార్పినెజ్-టోలెనాడో అన్నారు.

1980 నుండి సంపద అంతరం గురించి చూస్తున్నాము. అమెరికాలోని అగ్రశ్రేణి 1% వారి సంపద ఐరోపా కంటే ఎక్కువ పెరిగింది. ఒక మాటలో చెప్పాలంటే అమెరికాలో ధనవంతుల పేదల మధ్య అంతరం చాలా ఎక్కువైంది. అమెరికాలో ధనవంతుల- పేదల మధ్య సంపద అంతరాన్ని తెలియ చేసే మరో అంశం కార్మిక అసమానత. శ్రామికవర్గ వేతనాలు తక్కువగా, శ్రమతో సంబంధం లేని వేతనాలు ఎక్కువగా ఉండటం.
పేదరికం
2019 లెక్కల ప్రకారం అమెరికాలో 10.5% మంది పేదలు ఉన్నారు. ది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోషియేషన్ ప్రచురించిన 2023 అధ్యయనం ప్రకారం అమెరికాలో మరణాలకు పేదరికం ప్రధాన కారణంగా ఉంది. ప్రతి సంవత్సరం దాదాపు 3 లక్షల మంది మరణిస్తున్నారు. పేదరికంలో ఉన్న పిల్లలు యుక్త వయస్సులో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ఆహార సమస్య

అమెరికా ఆహార ధాన్యాలను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నా, ఆ దేశంలో ప్రజలు ఆహార సమస్యను ఎదుర్కొంటున్నారు. 2023లో దాదాపు 13.5% కుటుంబాలు ఆహార అభద్రతలో ఉన్నాయి. 2019లో జరిగిన అధ్యయనంలో గ్రాడ్యుయేట్ లోపు విద్యార్థులలో 40% మంది ఆహార అభద్రతలో ఉన్నారు. కోవిడ్- 19 సమయంలో అమెరికా కుటుంబాలకు ఆహార అభద్రత రెట్టింపు అయ్యింది. ఇది చిన్నపిల్లలు ఉన్న కుటుంబాల్లో అధికంగా ఉంది. 2020 నవంబర్ సేకరించిన హౌస్ హాల్ సర్వే డేటా ప్రకారం 2.6 కోట్ల మంది వయోజనులు (అంటే వయోజన జనాభాలో 12%) వారం రోజులుగా ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. కొన్ని సంస్థలు అభద్రతలో ఉన్న కుటుంబాలకు ఆహారాన్ని అందిస్తున్నాయి అంటే ఏ స్థాయిలో ఆహార సమస్య ఉందో అర్థమవుతుంది.
నిరుద్యోగం

అమెరికాలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. 2023లో నిరుద్యోగ రేటు 3.9% ఉంటే 2024లో 4.1 శాతానికి పెరిగింది. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉద్యోగుల తొలగింపు స్థిరంగా కొనసాగుతున్నది. 2001 నుండి 2019 వరకు ప్రతి సంవత్సరం 2 కోట్లకు పైగా ఉద్యోగులు తొలగించబడ్డాయి. 2020 మార్చి, ఏప్రిల్ నెలల్లో కోవిడ్ కారణంగా రికార్డు స్థాయిలో తొలగింపులు జరిగాయి. 2024 జనవరి నుండి అక్టోబర్ వరకు కోటి 60 లక్షల, 40 వేల మంది ఉద్యోగుల తొలగింపు జరిగింది. ప్రస్తుతం అమెరికాలో నిరుద్యోగ భృతి ప్రయోజనం పొందుతున్నవారు 18 లక్షల, 70 వేల మంది. 2024 డిసెంబర్ లో కొత్తగా నిరుద్యోగ భృతి కోరుతూ 2 లక్షల, 20 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.
ధరల పెరుగుదల

అమెరికా వ్యవసాయ నివేదిక ప్రకారం 2022తో పోలిస్తే నిత్యావసర వస్తువుల ధరలు 11% పైగా పెరిగాయి. కొన్ని వస్తువుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గుడ్డు ధర 4.8%, బీఫ్ మాంసం 3% కంటే ఎక్కువ పెరిగాయని చెబుతున్నారు. అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ దిగుమతులపై 25% టారిఫ్ విధిస్తానంటున్నారు. ఇదే జరిగితే ధరల పెరుగుదల ఇంకా ఎక్కువగా ఉంటుందని ప్రజలు భయపడుతున్నారు. వాటర్ గైడ్స్ చేపట్టిన సర్వేలో నిత్యావసరాల కోసం అవుతున్న ఖర్చులు తమ జీవితాలను తారుమారు చేస్తున్నట్లు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాల తొలగింపు, కొత్త ఉద్యోగాలు రాకపోవడంతో చేతిలో చిల్లిగవ్వ ఉండటం లేదని, ఆర్థిక ఒత్తిడి వల్ల మానసిక వేదనకు గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఆర్థిక అంశాల ఒత్తిడికి ప్రధాన కారణంగా ఉంది. యువకుల్లో ఈ ఒత్తిడి తీవ్రస్థాయిలో ఉంది.

దేశ అప్పులు

అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎంత డొల్లతనమో దాని అప్పులే తెలియజేస్తున్నాయి. తాజా లెక్కల (27 సెప్టెంబర్ 20-24 వరకు) ప్రకారం అమెరికా చేసిన అప్పులు 36 ట్రిలియన్ (36 లక్షల కోట్ల డాలర్లు) డాలర్లు. భారత కరెన్సీలో 3,035 లక్షల కోట్ల రూపాయలు. 2024లోనే 2 లక్షల డాలర్ల అప్పు చేసింది. ఈ అప్పుల ఫలితంగా అమెరికాలోని ప్రతి పౌరునిపైనా 91 లక్షల రూపాయల అప్పు ఉంది. కొన్ని దశాబ్దాలుగా అమెరికా అప్పులు పెరుగుతూనే ఉన్నాయి. 2000 సంవత్సరం నాటికి 5.7 ట్రిలియన్ డాలర్ల అప్పు ఉండగా, 2024 నాటికి 36 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. ప్రపంచంలోని అనేక దేశాల ఆర్థిక వ్యవస్థల మొత్తం విలువ కన్నా అమెరికా అప్పులే ఎక్కువ.

మేడి పండు విప్పిచూస్తే దాని నిండా పురుగులు కన్పిస్తాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా అలాంటిదే. ఆయుధ బలంతో వెనుకబడిన దేశాల సహజ వనరులను, సంపదలను లూటీ చేయటం ద్వారా దాని ఆర్థిక మనుగడ కొనసాగిస్తున్నది. వెనుకబడిన దేశాలు, ప్రజలు అమెరికా కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే దాని ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. రిపబ్లిక్ పార్టీ లేక డెమొక్రాటిక్ పార్టీ అయినా దేశ గుత్తపెట్టుబడిదారుల, సంపన్న వర్గాల ప్రయోజనాలను కాపాడుతున్నాయి. దాని ఫలితమే అమెరికాలో సంపద వ్యత్యాసాలకు, పేదరికానికి, నిరుద్యోగానికి, అధిక ధరలు, అప్పులకు కారణంగా ఉంది. వీటికి పరిష్కారం అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, ఆ దేశ, వెనుకబడిన దేశాల ప్రజలు ఉద్యమించటమే.

బొల్లిముంత
సాంబశివరావు
9885983526

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News