Friday, January 31, 2025

ఫోన్‌ట్యాపింగ్ నిందితులకు బెయిల్

- Advertisement -
- Advertisement -

భుజంగరావు, రాధాకిషన్‌లకు
బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
పాస్‌పోర్టులు, పూచీకత్తులు
సమర్పించాలని న్యాయస్థానం
ఆదేశం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న మాజీ అదనపు ఎస్‌పి భుజంగరావు, మాజీ డిసిపి రాధాకిషన్‌రావుకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయలతో కూడిన 2 షూరిటీలూ సమర్పించాలని న్యాయస్థానం షరతు విధించింది. అలాగే వ్యక్తిగతమైన పాస్ పోర్టులు సమర్పించాలని ఇద్దరికీ ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని, ఎక్కడా కూడా సాక్షులను ప్రభావితం చేయవద్దని భుజంగరావు, రాధాకిషన్ రావుకు హైకోర్టు పేర్కొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను ఆధారంగా చేసుకుని చాలా కీలకమైన అంశాలు బయటపడ్డ విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో రాజకీయ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేయడంలో టాస్క్‌ఫోర్స్ డిసిపి రాధాకిషన్ రావు పాత్ర ఉందని దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. నాంపల్లి కోర్టు వీరి బెయిల్ పిటిషన్‌ను రెండు సార్లు తిరస్కరించింది.

దీంతో హైకోర్టును ఇద్దరు ఆశ్రయించారు. ఈ కేసులో పదినెలలకు పైగా జైలులో ఉన్నామని, అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని ఇరువురు హైకోర్టును కోరారు. వారి ఆరోగ్య పరిస్థితిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ఇద్దరికీ బెయిల్ మంజూరు చేసింది. అలాగే ఈకేసులో ఇంకా విచారణ సాగుతోందని, ఎక్కడా కూడా సాక్షులను ప్రభావితం చేయవద్దని, దర్యాప్తు అధికారులను కూడా ప్రభావితం చేసేలా ప్రయత్నిస్తే చర్యలు తప్పవని హైకోర్టు స్పష్టం చేసింది. విదేశాలకు పారిపోయేందుకు అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించడంతో వారి వ్యక్తిగతమైన పాస్ట్‌పోర్టులను సమర్పించాలని ఆదేశించింది. పోలీసులు ఎప్పుడు పిలిచినా వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీచేసింది. శుక్రవారం ఉదయం బెయిల్‌పై విడుదలయ్యే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News