మనతెలంగాణ/హైదరాబాద్ : విద్యార్థుల ఫోన్లకే ఈ ఏడాది ఇంటర్మీడియేట్ హాల్ టికెట్లు రానున్నాయి. గతంలో కేవలం కళాశాలలకు హాల్ టికెట్లు పంపించడంతో పాటు వెబ్సైట్లో పెట్టి డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించేవారు. కానీ ఈ సారి ఇంటర్ బోర్డు అధికారులు విద్యార్థులు ఇచ్చిన మొబైల్ ఫోన్ నెంబర్లకు లింకు పంపిస్తున్నారు. ఆ లింకుపై క్లిక్ చేసి మొదటి ఏడాది విద్యార్థులు ఎస్ఎస్సి హాల్‌టికెట్ నెంబర్, రెండో ఏడాది విద్యార్థులు మొదటి ఏడాది హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే వారి హాల్‌టికెట్ వస్తుందని, ఆ హాల్‌టికెట్‌తో విద్యార్థులు పరీక్షలకు హాజరు కావచ్చని అధికారులు తెలిపారు. బుధవారం నుంచి ప్రథమ సంవత్సరం
విద్యార్థులకు ఇంటర్నల్ పరీక్షలు ఉన్నందున ఇప్పటికే వారికి లింకు పంపించామని పేర్కొన్నారు. ఇంటర్నల్ పరీక్షలకు హాల్ టికెట్ లేకున్నా విద్యార్థులను పరీక్షలకు అనుమతించినట్లు చెప్పారు. గురువారం జరిగిన పర్యావరణ పరీక్షకు 128 మంది విద్యార్థులను హాల్ టికెట్ లేకున్నా పరీక్ష రాయడానికి అనుమతించామని తెలిపారు. ద్వీతీయ సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ఉన్నందున త్వరలో పంపిస్తామని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 9.50 లక్షల మంది మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వార్షిక పరీక్షలకు హాజరుకానున్నారు.