లాస్ఏంజెలెస్లో గత కొన్నివారాల పాటు కార్చిచ్చు చెలరేగి ఇళ్లు, తోటలు, పంటలు సర్వం బూడిద కుప్పలుగా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాలన్నీ ఈ వైపరీత్యానికి ఉలిక్కిపడుతున్న తరుణంలో జమ్ముకశ్మీర్ ప్రాంతంలో కార్చిచ్చు ప్రమాదం ముంచుకువస్తోందని అధికారులు హెచ్చరించడం గమనార్హం. ఉత్తరాఖండ్ లోని అల్మోరా అడవిలో కూడా ఈనెల మొదట్లో కిలోమీటరు పొడవునా మంటలు వ్యాపించి అడవులను దహించి వేశాయి. ఉత్తరాఖండ్‌లో సాధారణంగా ఫిబ్రవరి 15 నుంచి అగ్రిప్రమాదాల సీజన్ ప్రారంభమవుతుంది. కానీ ఈ ఏడాది జనవరిలోనే అగ్నిప్రమాదాల సీజన్ ప్రారంభం కావడం గమనార్హం. ఉత్తరాఖండ్ ప్రభుత్వం కార్చిచ్చును నివారించడానికి ప్రతి ఇంటిని అప్రమత్తం చేయడానికి 5000 మంది వాలంటీర్లను నియమించింది. ఇదిలా ఉండగా అడవుల్లో కార్చిచ్చు వ్యాపించకుండా రెండు అటవీ విభాగాల మధ్య ఫైర్‌లైన్ (అగ్నిరేఖ)లను గీసే విధానం బ్రిటిష్ కాలంలో ప్రారంభమైంది.
అంటే రెండు అటవీ డివిజన్ల మధ్య 100 అడుగుల ఫైర్‌లైన్ , రేంజ్‌ల మధ్య 50అడుగుల ఫైర్‌లైన్ నిర్వహిస్తుంటారు. ఈ ఫైర్లైన్లలో పెరిగిన చెట్లను చివరిసారిగా 1996 లో తొలగించారు. ఇప్పుడు 28 సంవత్సరాల తరువాత మళ్లీ తొలగించడం ప్రారంభించారు. ఈ ఫైర్లైన్లో పెరిగిన దాదాపు 5 లక్షల చెట్లను నిర్మూలిస్తారు. దీనివల్ల కొంతవరకైనా కార్చిచ్చు ప్రమాదాలను నివారించవచ్చని అధికారులు చెబుతున్నారు. గత సంవత్సరం కార్చిచ్చులకు 12 మంది ప్రాణాలు కోల్పోగా, 1270 వరకు కార్చిచ్చులు సంభవించాయి. ఈమేరకు గత ఐదు ఫైర్సీజన్లలో భారతదేశంలో 11,09,588 కార్చిచ్చులు సంభవించాయని డేటా చెబుతోంది. పర్యావరణ వ్యవస్థకు, వన్యప్రాణులకు, ప్రజల జీవితాలకు ముప్పుగా కార్చిచ్చులు వ్యాపిస్తుంటాయి. గత అయిదు ఫారెస్ట్ ఫైర్ సీజన్లలో ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో ఏటా లక్షకు పైగా కార్చిచ్చు ప్రమాదాలు సంభవించాయని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ రాజ్యసభలో వెల్లడించింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో మొత్తం 4,73,834 కార్చిచ్చుల ప్రమాదాలు సంభవించాయి.
దేశం లోని మొత్తం కార్చిచ్చు ప్రమాదాల్లో పై నాలుగు రాష్ట్రాల ప్రమాదాలు దాదాపు 43 శాతం వరకు ఉంటున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 81,003 కార్చిచ్చులు జరగ్గా, దేశం మొత్తం మీద కార్చిచ్చుల్లో 50 శాతం కార్చిచ్చులు గత ఐదు సీజన్లలో ఈ ఐదు రాష్ట్రాల్లో జరిగాయని తేలింది. ఇవే కాకుండా తెలంగాణ, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, రాష్ట్రాల్లో 50,000 కన్నా ఎక్కువ కార్చిచ్చు ప్రమాదాలు జరిగాయని రికార్డు అయ్యాయి. ప్రస్తుత సమీక్ష ప్రకారం దేశంలో ్ల మొత్తం అడవులు, చెట్లు 8,27,357 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నాయి. అంటే దేశంలో 25.17 శాతం భౌగోళిక ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. మొత్తం మడ అడవులు 4992 చదరపు కిలోమీటర్ల పరిధిలో వ్యాపించాయి.
భారీ ఎత్తున అడవులు విస్తరించిన రాష్ట్రాల్లో టాప్ మూడింటిలో మధ్యప్రదేశ్ (77,073 చదరపు కిలోమీటర్లు ),అరుణాచల్ ప్రదేశ్ (65,882చదరపు కిలో మీటర్లు ) ,ఛత్తీస్‌గఢ్ (55,812 చదరపు కిలోమీటర్లు ) ఉన్నాయి. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు (ఐఎస్ఎఫ్ఆర్)2021 ప్రకారం దేశంలోని అడవుల్లో 36 శాతం తరచుగా కార్చిచ్చు ప్రమాదాలు జరగడానికి అనువుగా ఉన్నాయని వెల్లడైంది. ఇందులో 2.81 శాతం తీవ్ర మైన కార్చిచ్చులు ప్రాంతంగా ఉంటోంది.మరో 7.85 శాతం చాలా ఎక్కువ కార్చిచ్చు కేటగిరి జోన్‌గా ఉంటోంది. దేశం లోని అడవులు ఎదుర్కొంటున్న పెద్ద రిస్కుగా ఈ జోన్ లోని అడవులు ఉన్నాయి. ప్రజాజీవన ఆధారంగా అడవులు కీలక పాత్ర వహిస్తున్నాయి. దాదాపు 275 మిలియన్ గ్రామీణ ప్రజలు అడవులపై ఆధారపడి బతుకుతున్నారని ఐఎస్ఎఫ్ఆర్ 2023 డేటా వెల్లడించింది.
అడవులకు చేరువగా నివసిస్తున్న సమాజాలు అడవుల్లోని కలపేతర ఉత్పతులపై అంటే కాయలు, గింజలు, పుట్టగొడుగులు వంటి ఉత్పత్తులపై , పర్యావరణ సేవలపైన ఆధారపడి బతుకుతున్నాయి. అయితే అటవీ వనరుల నిలువు దోపిడీ, మానవ స్వప్రయోజన అక్రమాలు రానురాను విచ్చలవిడిగా సాగుతుండటంతో అటవీ పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది.మధ్య, ఉత్తర, తూర్పు భారత ప్రాంతాల్లో ముఖ్యంగా తునికాకు, ఇప్పపూవుల సేకరణ కార్చిచ్చు ప్రమాదాలకు ప్రధాన కారణాలు అవుతున్నాయి. తేనె వేటగాళ్లు అడవుల్లో ఎండుగడ్డిని తగుల బెట్టడం కూడా కార్చిచ్చుకు దారి తీసిన సంఘటనలు ఉన్నాయి. గోవా, అస్సాం, మణిపూర్ అడవుల్లో ఈ చర్యలవల్లనే అడవులు అంటుకున్నాయని పోలీసులు తెలుసుకుని కొందరిని అరెస్టు చేశారు. దీనికి తోడు స్థానిక రైతులు తమ సాగులో పంటల మార్పిడి విధానాలు 4.35 మిలియన్ హెక్టార్ల అడవులపై విపరీత ప్రభావం చూపించి కార్చిచ్చులకు దారి తీస్తున్నాయి.
ఈ కార్చిచ్చులన్నీ సహజమైనవి కావనీ, రైతులు తమ పొలాలన్నీ ఖాళీ చేయడానికి పంటకోతల తరువాత మిగిలిన గడ్డిని, ఇతర వ్యర్థాలను తగులబెడుతున్నారని ఉపగ్రహాల ద్వారా కనుగొన్నట్టు గతంలో ఒడిశా అటవీ మంత్రిత్వశాఖ బయటపెట్టడం ఈ సందర్భంగా ప్రస్తావించవలసి ఉంది. సహజమైన అడవుల పర్యావరణ వ్యవస్థలో , తిరిగి నేలను సాగుకు అనువుగా వెసులుబాటు కల్పించడంలో సేంద్రియ వ్యర్థాలను తొలగించడంలో కార్చిచ్చులు కీలక పాత్ర వహిస్తున్నప్పటికీ, వీటి వ్యతిరేక ప్రభావాలు అడవులకు దక్కవలసిన ప్రయోజనాలను దూరం చేస్తున్నాయి. ఈ పరిణామాలు చివరకు జీవితాలను బలిగొంటున్నాయి. నివాసాలను విధ్వంసం చేస్తున్నాయి. అందుకనే కార్చిచ్చుల నివారణకు ఆయా ప్రభుత్వాలు నిరంతరం అప్రమత్తంగా ఉండక తప్పదు.