Saturday, February 1, 2025

ఎన్నికల కోడ్ సాకుతో రైతుల పొట్టకొట్టొద్దు:మంత్రి బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సాకుతో రైతు భరోసా పథకాన్ని నిలిపివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. రైతు భరోసా పథకం కొనసాగుతున్న పథకమే అయినందున ఎన్నికల సంఘం నుండి ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు పట్టభద్రులు, ఉపాధ్యాయులకు సంబంధించినవి అయినందును ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశాలు కూడా లేవని తెలిపారు. అవసరమైతే బీజేపీ పక్షాన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ద్వారా ఎన్నికల సంఘానికి లేఖ పంపిందుకు కూడా సిద్ధమని పేర్కొన్నారు. ఈ మేరకు బండి సంజయ్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తక్షణమే అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించి రైతు భరోసా సహా ఇటీవల ప్రారంభించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇండ్ల నిర్మాణ లబ్దిదారులను వెంటనే ఎంపిక చేసి మంజూరు చేయాలని కోరారు. ఒకవేళ ఎన్నికల సంఘం కోడ్ సాకుతో ఆయా పథకాలను నిలిపివేయాలని చూస్తే తాము ఊరుకోబోమని ఆ ప్రకటనలో బండి హెచ్చరించారు.

 

ఎన్నికల సంఘం అభ్యంతరం చెబితే అఖిల పక్షంతో కలుద్దాం
ఒకవేళ ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తే అఖిలపక్షంతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి రైతుల ఖాతాల్లో రైతు భరోసా పైసలు జమ చేసేందుకు అనుమతి తీసుకుందామని తెలిపారు. ఇప్పటికే ఏడాది పాటు రైతు భరోసా నిధులు అందక రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ నెలలోనైనా ప్రస్తుతం గిట్టుబాటు ధర రాక, పంట పెట్టుబడులు పెరిగి రైతులు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారని, ఈ తరుణంలో చేతికందే సొమ్మును కూడా ఆపేస్తే రైతు నోట్లో మట్టికొట్టినట్లే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల మంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారని, వీరిలో 40 వేల మందికి మాత్రమే మంజూరు చేసి మిగిలిన 99 శాతం మంది పేదల కడుపు కొట్టడం అమానవీయమని ఆ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.

రైతు భరోసా మంజూరులోనూ ఇబ్బంది పెట్టారు
అలాగే వ్యవసాయ భూమిలేని 10 లక్షల మంది కూలీల కుటుంబాలకు వారి బ్యాంకు ఖాతాల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఎకరాకు రూ.6 వేల చొప్పున డబ్బులు జమ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం కేవలం 20,336 మంది ఖాతాల్లోనే డబ్బులు జమ చేసి, మిగిలిన 9,79,000 మందికిపైగా కూలీలకు జమ చేయకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇండ్ల కోసం అందిన 70 లక్షలకు పైగా దరఖాస్తుల్లో దాదాపు 40 లక్షల మంది పేదలు ఇండ్లకు అర్హులని తేలితే ఇప్పటి వరకు 72 వేల 406 మందికి మాత్రమే ఇండ్ల మంజూరు పత్రాలను అందజేసి, మిగిలిన వారిని ఎంపిక చేయకపోవడం దుర్మార్గమని అన్నారు. తక్షణమే ప్రతి ఒక్క లబ్దిదారుడికి రైతు భరోసా సొమ్ము వేయడంతోపాటు మిగిలిన మూడు పథకాలకు సంబంధించి లబ్ది చేకూర్చే ప్రక్రియను కొనసాగించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News