Tuesday, March 4, 2025

కెసిఆర్ అసెంబ్లీకి రా… నువ్వో…నేనో తేల్చుకుందాం

- Advertisement -
- Advertisement -

ఫౌమ్‌హౌస్‌లో ఉండి స్టోరీలు చెప్పడం కాదు ఏ
తండాలో, ఏ గూడెంలో ఎంత రుణమాఫీ చేశామో
చూపిస్తాం కెసిఆర్ రద్దైన వెయ్యి రూపాయల
నోట్‌లాంటోడు బిఆర్‌ఎస్ ఎగవేసిన రైతుబంధును
మేమే జమ చేశాం కెసిఆర్ చేసిన రుణమాఫీ
మిత్తికే సరిపోలేదు నువ్వు పదేళ్లలో ఇవ్వలేని
ఉద్యోగాలు..మేము పది నెలల్లోనే ఇచ్చాం నువ్వు
బలంగా కొట్టుడుకాదు..సక్రమంగా నిలబడడం
నేర్చుకో.. రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవంలో
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్/షాద్‌నగర్ : కెసిఆర్ బలంగా కొట్టడం కాదు, ముందు సరిగ్గా నిలబడడం నేర్చుకోవాలని సిఎం రేవంత్‌రెడ్డి ఎ ద్దేవా చేశారు. అసలు కెసిఆర్ ఊగుతున్నావా, తూలుతున్నావా అని సి ఎం రేవంత్ అన్నారు. నాకు, కెసిఆర్‌కు పోల్ పెడితే (సోషల్‌మీడియా) లో ఆయనకే ఎక్కువ ఓట్లు వచ్చాయంటా. సల్మాన్‌ఖాన్, రాఖీ సావంత్ కు పోల్ పెడితే రాఖీకే ఎక్కువ ఓట్లు వస్తాయి. అంతమాత్రాన సల్మాన్‌ఖాన్ స్టార్ కాకుండా పోతారా అని సిఎం రేవంత్ ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పా ఠశాల 150 వార్షికోత్సవం కార్యక్రమానికి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఓడించి ఫాంహౌజ్‌కు పరిమితం చేసినా కెసిఆర్‌లో అహంకారం తగ్గలేదని ఆ యన మండిపడ్డారు. ఫాంహౌజ్‌లో ఉండి స్టోరీలు చెప్పొద్దని సిఎం ఆగ్ర హం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి వస్తే  ప్రభుత్వం ఏం చేస్తుందో చెబుతామని ఆయన అన్నారు.నువ్వో, నేనో తేల్చుకుందాం రా అని సిఎం సవాల్ చేశారు. ప్రజలు పదేళ్లు అధికారం ఇస్తే గుమ్మికింద పందికొక్కుల్లా మిగులు బడ్జెట్‌ను మింగేశారని సిఎం ఆరోపించారు.

సోషల్ మీడియాలో వచ్చిన లైకులు చూసి కెసిఆర్‌కు సంతోషం….
అబద్ధాల వల్లనే గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఓడిపోయిందని, పార్లమెంట్ లో గుండు సున్నా వచ్చిందని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. అయినా మళ్లీ ఫాంహౌజ్‌లో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని సిఎం అన్నారు. రైతులకు రైతుభరోసా, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులకు ఉచిత కరెంట్, మహిళలకు ఉచిత బస్సు, రూ.500లకే గ్యాస్ సిలిండర్స్, యువతకు 50 వేల ఉద్యోగాలతో పాటు అనేక పథకాలను విజయవంతంగా అమలు చేశామన్నారు. బిఆర్‌ఎస్ హయాంలో మాదిరిగా రాష్ట్రాన్ని తాము దోచుకోవడం లేదన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన లైకులు చూసి కెసిఆర్ సంతోష పడుతున్నారని సిఎం రేవంత్ మండిపడ్డారు. రాఖీసావంత్‌కు కూడా టిక్‌టాక్‌లో లైకులు బాగానే వస్తాయని, అదే మాదిరిగా బిఆర్‌ఎస్‌కు వచ్చాయని సిఎం కౌంటర్ ఇచ్చారు.

కెసిఆర్ కాలం చెల్లిన రూ.1,000ల నోటుతో సమానం
కెసిఆర్ కాలం చెల్లిన రూ.1,000ల నోటుతో సమానం అని, ఆ నోటు దగ్గరుంటే జైలుకే తప్ప ఉపయోగం లేదని సిఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం పోగానే ఫాంహౌజ్‌కు పరిమితం అయిన కెసిఆర్‌కు తెలంగాణ ప్రజలతో సంబంధాలు తెగిపోయాయన్నారు. కెసిఆర్ సరిగ్గా నిలబడే పరిస్థితే లేదని, ఇక బలంగా కొట్టే దమ్ము ఉందా?” అని రేవంత్ రెడ్డి విమర్శించారు. దమ్ముంటే అసెంబ్లీకి కెసిఆర్ రావాలని ఆయన సవాల్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో టీచర్ నియామకాలు జరగలేదని, తమ ప్రభుత్వం రాగానే 11వేల టీచర్ పోస్టులు భర్తీ చేశామని ఆయన అన్నారు.

గతంలో నోటిఫికేషన్లు ఇస్తే సంవత్సరాల తరబడి నియామక ప్రక్రియ జరిగేదన్నారు. తమ ప్రభుత్వం 55 రోజుల్లోనే డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తి చేసిందన్నారు. గత ప్రభుత్వం వర్సిటీలను నిర్లక్ష్యం చేసిందన్నారు. బిఆర్‌ఎస్ హయాంలో వర్సిటీలు పునరావాస కేంద్రాలుగా మారాయని, తమ ప్రభుత్వం రాగానే విసిలను నియమించామని, ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచామని, 21వేల మంది టీచర్లకు పదోన్నతులు కల్పించామని, ఎలాంటి వివాదం లేకుండా 35 వేల మంది ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ చేపట్టినట్లు సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

మేధావులను అందించింది ఈ పాఠశాల
మొగిలిగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బూర్గుల రామకృష్ణారావు, సత్యనారాయణ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి పెద్దలు చదివారని, ఈ పాఠశాలకు ఎంతో విశిష్టత ఉందని సిఎం అన్నారు. అలాంటి పెద్దలు చదివిన పాఠశాలకు 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ పాఠశాల ఈ సమాజానికి మేధో సంపదను అందిస్తూనే ఉందని అన్నారు. ఈ గ్రామంలో పోలీస్‌స్టేషన్, గ్రంథాలయం ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఈ గ్రామంలో 16 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులను చేపడతామని సిఎం రేవంత్ తెలిపారు

. అదే విధంగా అడ్వానస్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేస్తామని రేవంత్ పేర్కొన్నారు. రాష్ట్ర, దేశ భవిష్యత్ తరగతి గదుల్లో ఉందని, విద్యార్థులకు చేసేది ఖర్చు కాదని పెట్టుబడిని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విద్యాశాఖను నిర్వీర్యం కాకుండా అభివృద్ధి చేయడానికి సంకల్పించామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలలోనే 11 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని, 21 వేల మంది టీచర్లకు పదోన్నతులు, 35 వేల మంది టీచర్లకు బదిలీలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరాం, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, స్థానిక శాసనసభ్యుడు వీర్లపల్లి శంకర్, ప్రొఫెసర్ హరగోపాల్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News