2025 -26 బడ్జెట్ తన రాజకీయ అవసరాలే ఉపయోగించుకున్నది తప్ప, దేశ సమ్మిళిత వృద్ధిని ఏమాత్రం పట్టించుకున్నట్లు లేదని మాజీ ఆర్ధిక మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పదే పదే వల్లెవేస్తున్న వికసిత్ భారత్ ఇలాంటి వైఖరితో సాధ్యమవుతుందా..? అని పునర్ సమీక్షించుకోవాలని ఎక్స్ వేదికగా కోరారు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో వరాలు ప్రకటించి, ఎన్నికలు లేని రాష్ట్రాల పట్ల వివక్ష చూపడం సరికాదని సూచించారు. దేశమంటే మట్టి కాదోయో దేశమంటే మనుషులోయ్ అంటూ ప్రసంగించిన నిర్మల సీతారామన్, దేశమంటే కొన్ని రాష్ట్రాలే అన్నట్లు బడ్జెట్ ప్రవేశ పెట్టడం బాధాకరమని వ్యాఖ్యానించారు. మొదటి నుంచి ఇదే దోరణిని ప్రదర్శిస్తూ రాజకీయ అవసరాలు తీర్చుకుంటున్నది కేంద్ర ప్రభుత్వం అని పేర్కొన్నారు.
2024 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, 2025 ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల కోసం బడ్జెట్ పెట్టారని, 2026 యూపీ బడ్జెట్, 2027 గుజరాత్ కోసం బడ్జెట్ పెడుతారా..? అని అడిగారు. యావత్ దేశానికి సరిపోయే బడ్జెట్ ఎప్పుడు పెడతారు..? అని ప్రశ్నించారు. బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి చోటు లేదా..?.. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు విలువ లేదా..?..ఇది కేంద్ర బడ్జెట్‌లా లేదు, కేవలం మూడు, నాలుగు రాష్ట్రాల బడ్జెట్‌లాగా ఉందని విమర్శించారు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉండి తెలంగాణ రాష్ట్రానికి ఏం సాధించినట్లు..? అని నిలదీశారు. తెలంగాణతో తమకు బంధం లేదని బడ్జెట్ ద్వారా మరోసారి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిరూపించిందని వ్యాఖ్యానించారు. తెలంగాణకు ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రజల కోసం ఎప్పటికైనా పోరాడేది బిఆర్‌ఎస్ పార్టీయేనని మరోసారి రుజువైందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడటంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు వైఫల్యం చెందుతున్నాయన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.