Sunday, February 2, 2025

ఇది రాష్ట్ర బడ్జెట్ కాదు..కేంద్ర బడ్జెట్:మంత్రి కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

‘ఇది రాష్ట్ర బడ్జెట్ కాదు, కేంద్ర బడ్జెట్ ’ అని ప్రతిపక్ష పార్టీలకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి చురకలు వేశారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌లో అన్యాయం జరిగిందంటూ వస్తున్న విమర్శలపై ఆయన స్పందిస్తూ కేంద్రం అన్ని రాష్ట్రాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌ను రూపొందిస్తుందని, ఏదో ఒక రాష్ట్రం కోసం బడ్జెట్ ప్రవేశపెట్టదని గుర్తించాలని హితవు పలికారు. 2025-.26 కేంద్ర బడ్జెట్‌పై కిషన్‌రెడ్డి శనివారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకునేలా రూపొందించిన బడ్జెట్ అని అన్నారు. మధ్యతరగతి ప్రజలకు ఈ బడ్జెట్ అంకితమని ప్రకటించారు.

వ్యక్తిగత ఆదాయ పరిమితి పరిధిని రూ.12 లక్షలకు పెంచడం చాలా పెద్ద నిర్ణయమని పేర్కొన్నారు. ఇతర అతిపెద్ద ఆర్థికవ్యవస్థలన్నిటితో పోలిస్తే భారత ఆర్థికవ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని కొనియాడారు. గత 10 సంవత్సరాల కాలంలో రికార్డు స్థాయిలో జరిగిన మన అభివృద్ధి, నిర్మాణాత్మక సంస్కరణలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయని తెలిపారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు, రైతుల సంక్షేమానికి బాటలు వేస్తూనే అన్ని వర్గాలకు సమన్యాయం చేసే ‘డ్రీమ్ బడ్జెట్’ కిషన్‌రెడ్డి అభివర్ణించారు. ఇంత గొప్ప బడ్జెట్‌ను అందించిన ప్రధానమంత్రి మోడీకి, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఈ బడ్జెట్ చిన్న పరిశ్రమలకు ఆపన్నహస్తం
ఎంఎస్‌ఎంఈలు, చిన్న పరిశ్రమలకు ఆపన్నహస్తాన్ని అందించే బడ్జెట్ అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ సహకార సమాఖ్య స్ఫూర్తిని గౌరవించిన బడ్జెట్ అని పేర్కొన్నారు. అన్ని సంక్షేమ పథకాలకు నిధులను పెంచడం అభినందనీయమని కొనియాడారు. కేంద్రం ఏ సంస్కరణ తీసుకువచ్చినా తెలంగాణకు భాగస్వామ్యం ఉంటుందని అన్నారు. తెలంగాణలో పది లక్షలకుపైగా ఎంఎస్‌ఎంఈలు ఉన్నాయని, స్టార్టప్ కంపెనీలకు కూడా లబ్ధి జరుగుతుందని చెప్పారు. ఐదేళ్లలో తెలంగాణ ఎంఎస్‌ఎంఈలకు రూ.1.50 లక్షల కోట్లు రాబోతున్నాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. అర్బన్ ప్రాంతాలకు రూ.10 వేల కోట్లు రాబోతున్నాయని తెలిపారు. తెలంగాణలో అమృత్ పథకం ద్వారా 125 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు లబ్ధి చేకూరుతుందని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News