తెలంగాణకు ఇద్దరు కేంద్ర మంత్రులున్నా స్వరాష్ట్రానికి నిధులు సున్నా వచ్చాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ తప్పుడు నివేదికలే తెలంగాణకు శాపంగా మారాయని మండిపడ్డారు. బడ్జెట్ ను సవరించి తెలంగాణకు ప్రత్యేక నిధులు కేటాయించాని మంత్రి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఈ మేరకు మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. నూతన రాష్ట్రమైన తెలంగాణపై కేంద్రం పక్షపాత వైఖరితో కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని గౌరవిస్తూ ఏపీకి బడ్జెట్‌లో నిధులు కేటాయించిన కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం మర్చిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలను, ఇద్దరు కేంద్ర మంత్రులను గెలిపిస్తే తెలంగాణకు కేంద్రం గుండు సున్నా ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి ఒక రూపాయి వెళితే 42 పైసలే తెలంగాణకు తిరిగి వస్తున్నాయని, అలాంటప్పుడు తెలంగాణ అభివృద్దికి ప్రత్యేక నిధులు ఎందుకు కేటాయించరని కేంద్రాన్ని సీతక్క ప్రశ్నించారు. రాష్ట్రంలో 1059 గ్రామాలు, ఆవాసాల్లో మిషన్ భగీరథ వ్యవస్థ ఏర్పాటు కాకున్నా మిషన్ భగీరథ వంద శాతం పూర్తయినట్లు తప్పుడు నివేదికలు కేంద్రానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం సమర్పించడం వల్లే గ్రామీణ తాగు నీటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే అవకాశాన్ని రాష్ట్రం కొల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 60 ఏళ్లు దాటిన రైతులకు నెలవారీ పించన్లు అందిస్తామని, ఆరు ఏండ్ల కింద హమీ ఇచ్చిన కేంద్రం ఈ ఏడాది బడ్జెట్‌లో కూడా పించన్ల ప్రస్తావన చేయలేదని విచారం వ్యక్తం చేశారు. తెలంగాణకే కాదు, యావత్ దేశ ప్రజలను కేంద్ర బడ్జెట్ నిరాశపరిచిందని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు.