హైదరాబాద్ లో రెండు వేర్వేరు అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. పాతబస్తీ లోని కిషన్‌బాగ్, బాలానగర్‌లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. బాలానగర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. దాసరి సంజీవయ్య కాలనీలో ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో మంటల్లో చిక్కుకొని సాయి సత్య శ్రీనివాస్(30) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మూడు అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలను ఆర్పేశారు. మృతుడు రాజమహేంద్రవరానికి చెందిన సాయి సత్యశ్రీనివాస్‌గా గుర్తించారు. పటాన్ చెరు రుద్రారంలోని రసాయన పరిశ్రమలో సాయి పని చేస్తున్నాడు.
కిషన్‌బాగ్‌లోని షార్ట్ సర్కూట్‌తో నాలుగంతస్తుల భవనం సెల్లార్‌లో మంటలు చెలరేగాయి. భవనం సెల్లార్ నుంచి నాలుగో అంతస్తు వరకు మంటలు వ్యాపించాయి. భవనంలో ఉన్నవారు అప్రమత్తం కావడంతో అందరూ బయటకు వచ్చేశారు. ఐదు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి.