ప్రస్తుత సాఫ్ట్‌వేర్ రంగాన్ని గమనిస్తే గత కాలంనాటి వెట్టిచాకిరీ వ్యవస్థ జ్ఞప్తికి రాకతప్పదు. ప్రభుత్వ రంగ సంస్థల్లో బాధ్యతారాహిత్యం ప్రైవేటు రంగానికి వరంలా మారింది. ప్రతీ రంగం యాంత్రీక రణ వైపు పరుగులు తీస్తున్నది. పది మంది మనుషులు చేసే పని ఒకరితో సాధ్యమైతే మానవ శక్తిని ఉపయోగించి, నష్టాల బాట పట్టడం కంటే యాంత్రికశక్తిని ఉపయోగం లోకి తీసుకు రావడం మంచిదన్న అభిప్రా యాలు ప్రబలడం సహజం. ఇలాంటి పరిస్థితులు తలెత్తితే భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు సన్నగిల్లే అవకాశాలు ఉన్నాయి.
భవిష్యత్‌ను శాసిస్తున్న కృత్రిమ మేధపై అనేక అనుమానాలు ప్రబలుతున్నాయి. వ్యక్తిగత భద్రతతో పాటు, ఆర్థిక భద్రత కూడా పెనుప్రమాదంలో పడింది. సైబర్ నేరాలు కూడా విపరీతం గా పెరిగిపోతున్నాయి. డేటా చౌర్యం యథేచ్ఛగా కొనసాగుతున్నట్టు అనేక వార్తా కథనాలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కృత్రిమ మేధలో ఉద్భవించిన మరో విప్లవం ‘డీప్‌సీక్’ రూపంలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అంటేనే ఒక మాయాజాలం. ఈ మాయజాలం లో అనేక మోసాలు జరుగుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని కృత్రిమ మేధతో పరుగులెత్తించే ఎఐ వలన లాభాలతోపాటు అనేక నష్టాలు కూడా పొంచి ఉన్నాయి.
ఎఐ ఇంకా పూర్తిగా కళ్ళుతెరవక ముందే చైనా అడ్వాన్స్‌డ్ ఎఐ ‘డీప్ సీక్’ సాఫ్ట్‌వేర్ దిగ్గజాలను బెంబేలెత్తిస్తున్నది. తక్కువ ఖర్చుతో వినియోగదారులకు దగ్గరగా రాబోతున్న డీప్‌సీక్ వలన మేధో సంపత్తి దొంగిలించబడుతుందని, డేటా చౌర్యానికి అడ్డుకట్ట లేకుండాపోతుందని అమెరికా చెబుతున్నది. చిప్ మేకింగ్ విషయంలోను, కృత్రిమ సంబంధించిన విషయంలోను అత్యంత నాణ్యతా ప్రమాణాలు నెలకొల్పుతున్నామని చైనా ప్రకటించింది. డీప్‌సీక్ వలన చైనా ఆర్థికంగా ఎంతో బలపడుతుందని అమెరికా భావిస్తున్నది. డీప్‌సీక్‌ను ఎదుర్కోవడంలో అమెరికా టెక్ దిగ్గజాలు ముందుకు రావాలని ట్రంప్ ఆదేశించడం జరిగింది.
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన ట్రంప్‌ను ‘డీప్ సీక్’ షేక్ చేయడం విశేషం. వలసవాదుల విషయంలో ట్రంప్ తన నిర్ణయాలతో ఇప్పటికే అనేక దేశాల ఆగ్రహాన్ని చవిచూస్తున్నారు. వలస వాదుల పేరుతో అమెరికాలో స్థిరపడ్డ విదేశీయులను బయటకు పంపించడానికి ట్రంప్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
అమెరికాలో జన్మించిన విదేశీయుల పిల్లలు సైతం అమెరికా పౌరసత్వానికి అనర్హులుగా పేర్కొంటూ ట్రంప్ జారీచేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను అమెరికాలోని అనేక రాష్ట్రాలు తిరస్కరించాయి. న్యాయస్థానం కూడా ట్రంప్ ఆదేశాలను నిలుపుదల చేసింది. హిట్లర్‌కు మించిన జాత్యహంకారంతో, తెంపరితనంతో ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి పైశాచికానందం పొందుతున్న ట్రంప్ భారత్‌పట్ల కూడా సానుకూలంగా లేరనే చెప్పాలి. మోడీని మిత్రుడిగా పేర్కొన్న ట్రంప్‌లో గతంలో భారత్ పట్ల ప్రదర్శించిన వైఖరి కూడా ప్రస్తుతం కానరావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాపై చైనా ‘డీప్‌సీక్’ అస్త్రాన్ని ప్రయోగిస్తూ, అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి ప్రయత్నించడం గమనార్హం.
సాంకేతిక విప్లవ ఫలితాల వలన భారత్‌తో పాటు మిగిలిన ప్రపంచ దేశాలన్నీ మానవ శక్తిపై ఆధారపడే పరిస్థితులు క్రమంగా తగ్గిపోయే అవకాశాలున్నాయి. భారతదేశం వంటి వ్యవసాయ ప్రధానమైన దేశాల్లో యాంత్రీకరణకు ఇప్పట్లో సాధ్యపడే పరిస్థితులు లేవు. అయితే ప్రతీ రంగాన్ని శాసించాలనే కార్పొరేట్ శక్తులు అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలవనడంలో సందేహం లేదు. ఇప్పటికే బహుళజాతి కంపెనీల ఆధ్వర్యంలో నడుస్తున్న సాఫ్ట్‌వేర్ వ్యవస్థలో కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్), రోబోటిక్స్ వంటి విధానాల వలన భవిష్యత్తులో చాలా మంది ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కలదు. పూర్తిగా యాంత్రీకరణపై ఆధారపడే రోజులు రావచ్చు. జనాభా విపరీతంగా పెరిగిపోతున్నది. పెరిగిన జనాభాకు తగ్గట్టుగా మెరుగైన ఉపాధి అవకాశాలు లభించడం లేదు.
స్వల్ప వేతనాలకు బహుళ జాతి కంపెనీల్లో అనేక మంది విద్యాధికులు విసుగు, విరామం లేక పనిచేస్తున్నారు. ప్రస్తుత సాఫ్ట్‌వేర్ రంగాన్ని గమనిస్తే గత కాలంనాటి వెట్టిచాకిరీ వ్యవస్థ జ్ఞప్తికి రాకతప్పదు. ప్రభుత్వ రంగ సంస్థల్లో బాధ్యతారాహిత్యం ప్రైవేటు రంగానికి వరంలా మారింది. ప్రతీ రంగం యాంత్రీకరణ వైపు పరుగులు తీస్తున్నది. పది మంది మనుషులు చేసే పని ఒకరితో సాధ్యమైతే మానవ శక్తిని ఉపయోగించి, నష్టాల బాటపట్టడం కంటే యాంత్రికశక్తిని ఉపయోగం లోకి తీసుకురావడం మంచిదన్న అభిప్రాయాలు ప్రబలడం సహజం. ఇలాంటి పరిస్థితులు తలెత్తితే భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు సన్నగిల్లే అవకాశాలు ఉన్నాయి. అధిక జనాభా గల పేద, వర్ధమాన దేశాల్లో కార్మిక, కర్షక జీవుల బ్రతుకులు ఛిన్నాభిన్నమయ్యే పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయి. మధ్య తరగతి బతుకులు మరింత దుర్భరం కావచ్చు. ఇలాంటి పరిస్థితులను నిలువరించాలి. పనిలో బాధ్యతారాహిత్యం విడనాడాలి.కరోనా కారణంగా సుమారు రెండు సంవత్సరాల పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. యుద్ధాల వలన ప్రపంచంలో ఆర్థిక మాంద్యం ఏర్పడింది. నూతన సాంకేతిక పోకడలు యువత ఉపాధి అవకాశాలను దెబ్బతీసే అవకాశం ఏర్పడింది.
సాంకేతికత పుణ్యమా అని ఇప్పటికే కోట్లాది మంది వ్యక్తుల వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ళ చేతికిచిక్కింది. భారతదేశంలో సుమారు సగం మంది ప్రజల వ్యక్తిగత డేటా చోరీ జరిగినట్టు అంచనా. కోట్లాది మంది ప్రజల గోప్యత అమ్మకానికి పెట్టడం అత్యంత దారుణం. వ్యక్తుల ఇ మెయిల్, ఫోన్ నెంబర్లను, వారి కార్యకలాపాలను, ఆధార్ నెంబర్లను, పాన్‌కార్డు వివరాలను, బ్యాంకు అక్కౌంట్లను సేకరించి, అమ్మకానికి పెట్టినట్లు వార్తలు వెలువడ్డాయి. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై స్పందించి మొబైల్, కంప్యూటర్లు వినియోగిన్తున్నవారు మాల్వేర్, బోట్నెట్ ఇన్‌ఫెక్షన్ల బారినపడకుండా యాంటీ వైరస్‌ను ఏక్టివేట్ చేసుకోవాలని గతంలో మొబైల్ సందేశాలు పంపించింది. ఏదిఏమైనా మనకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం బహిర్గతం కావడానికి బాధ్యులెవరు? ఇబ్బడిముబ్బడిగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలపై రుద్దుతున్న టెక్ కంపెనీలు ఇందుకు బాధ్యత వహించి, బాధితులకు న్యాయం చేయాలి. మన మొబైల్ నెంబర్లు, వాట్సప్ నెంబర్లు ఎలా హ్యాకర్ల చేతికి చిక్కుతున్నాయో అర్థం కావడం లేదు. ఎన్నో లింకులు మన మొబైల్, ఇ మెయిల్స్‌కు వస్తున్నాయి.
ఈ లింకులను క్లిక్ చేయడం అత్యంత ప్రమాదకరం. వీటి విషయంలో అప్రమత్తత అవసరం. సాంకేతిక రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పుల కారణంగా నేడు సమస్త భూగోళం సాంకేతికంగా మన అరచేతిలో ఇమిడిపోయిన మాట వాస్తవం. దీనివలన కలుగుతున్న ప్రయోజనాలను కాదనలేం. ప్రపంచంలో టెక్నాలజీ వలన కలిగిన సౌకర్యాన్ని విస్మరించలేం. నెలల తరబడి, సంవత్సరాల తరబడి సముద్ర ప్రయాణాలు చేస్తే గాని విదేశాలకు వెళ్లలేని పరిస్థితులనుండి గంటల్లో, రోజుల్లో విదేశాలను చుట్టేసి రాగలగడం విజ్ఞానం అందించిన అద్భుతం. సాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా పరుగులు తీస్తున్నది. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో మానవ జీవితం అత్యంత సౌకర్యవంతంగా మారింది.
ఇదే సందర్భంలో నిర్మాణాత్మకమైన పాత్ర పోషించవలసిన సాంకేతిక రంగం నేరాలకు దారితీయడం భావ్యంకాదు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లో మరో వేగవంతమైన పరిణామం చైనా దేశపు ‘డీప్ సీక్’. దీని వలన అనేక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. కృత్రిమ మేధ భవిష్యత్తును నిర్మించాలి కాని, భవిష్యత్తును శాసించకూడదు. ప్రజల స్వేచ్ఛను హరించకూడదు. అమెరికా, చైనా వంటి దేశాలు ఆయుధాలతో, సాంకేతిక పరిజ్ఞానం పేరుతో ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. తమ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసుకోవడానికి ఇతర దేశాలపై పన్నుల భారం మోపుతున్నాయి. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం కృత్రిమ మేధకు దారితీసింది. డీప్‌సీక్ వలన భవిష్యత్తులో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో, అమెరికా దీనికి విరుగుడుగా ఎలాంటి నూతన టెక్నాలజీని ప్రపంచంపై గుమ్మరిస్తుందో వేచిచూడాలి.
సుంకవల్లి సత్తిరాజు 9704903463