Monday, February 3, 2025

ఢిల్లీ ఎన్నికల్లో బిజెపి విజయం తథ్యం: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

కేంద్ర బడ్జెట్ ప్రతి కుటుంబాన్ని ఆనందపరవశులను చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం వెల్లడించారు. ఇది భారత చరిత్రలో అత్యంత మధ్య తరగతి హిత బడ్జెట్ అని ఆయన అభివర్ణించారు. ఈ నెల 5నాటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నగరంలో ఒక ర్యాలీలో మాట్లాడిన మోడీ మధ్య తరగతికి ప్రయోజనకరమైన వివిధ అంశాల గురించి ప్రస్తావించారు. భారత్ స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి రూ. 12 లక్షల వరకు ఆర్జిస్తున్నవారు ఎన్నడూ అటువంటి ఉపశమనం పొందలేదని ప్రధాని మోడీ చెప్పారు. భారత చరిత్రలో తమకుఇది అత్యంత ప్రియతమ బడ్జెట్ అని మధ్య తరగతివారు చెబుతున్నారని ఆయన తెలిపారు. దేశ రాజధానిలోని ఆప్ ప్రభుత్వ తప్పుడు వాగ్దానాలు, అవినీతికి ప్రభుత్వాన్ని మోడీ తూర్పారపడుతూ, దాని విధానాలు ఫ్యాక్టరీల మూసివేతకు దారి తీశాయని ఆరోపించారు.

ప్రజలను దోచుకున్నవారు అందుకు జవాబు చెప్పుకోవలసి ఉంటుందని ఆయన అన్నారు. ఒక పక్క తప్పుడు వాగ్దానాలకు ప్రతీక అయిన ‘ఆప్‌దా’ ఉండగా, మరొక పక్క ‘మోడీ గ్యారంటీలు ఉన్నాయని ప్రధాని చెప్పారు. ఆదివారం వసంత పంచమి సందర్భంగా ప్రజలకు మోడీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ పర్వదినం సీజన్ మార్పును సూచిస్తుందని అన్నారు. బిజెపి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఢిల్లీ ప్రజలు దృఢ నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు. ‘ఆపద’ దేశ రాజధానిలో 11 సంవత్సరాలను నాశనం చేసిందని ప్రధాని విమర్శిస్తూ, నగర అభివృద్ధికి, వృద్ధికి అంకితమైన డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఎన్నిక కాగలదని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలోని తన ప్రభుత్వం పేదలు, రైతులు, యువత, మహిళలు అనే నాలుగు స్తంభాల పటిష్ఠతకు కట్టుబడి ఉందని, బడ్జెట్ మోడీ గ్యారంటీల సాఫల్యానికి గ్యారంటీ అని ఉద్ఘాటించారు.

పర్యాటకం, తయారీ వంటి ఉపాధి కల్పన రంగాలపై బడ్జెట్ దృష్టి కేంద్రీకరించడం యువతకులాభదాయం అని ఆయన పేర్కొన్నారు. ఆప్ ఆరోపణలను ప్రధాని తోసిపుచ్చుతూ, ఢిల్లీలో బిజెపి అధికారంలోకి వచ్చినట్లయితే ఏ మురికివాడనూ నిర్మూలించదని, ఏ సంక్షేమ పథకాన్నీ ఆపివేయదని భరోసా ఇచ్చారు. మోడీ పూర్వాంచల్ వాసులను ఆకట్టుకునే యత్నం చేస్తూ, తాను ఆ ప్రాంతం నుంచి ఎంపిని అని చెప్పారు. వారణాసిని దృష్టిలో పెట్టుకుని ఆయన ఆ వ్యాఖ్య చేశారు. ‘ఢిల్లీలో ఈ నెల 8న బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని మీరు రాసిపెట్టుకోండి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయిన 8 నుంచి మహిళలు రూ. 2500 అందుకుంటారు ’ అని మోడీ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News