సిఎం రేవంత్ రెడ్డి పాలనలో మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ హోం మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి మహముద్ అలీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చిందని, కానీ ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు కాలేదని పేర్కొన్నారు. మైనారిటీ డిక్లరేషన్ ప్రకటించి మర్చిపోయారని, మైనార్టీల ఓట్లు వేసుకోని మోసం చేశారని అన్నారు. కెసిఆర్ మైనారిటీలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, అమలు చేశారని తెలిపారు. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశారని, మైనారిటీలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని ఇవ్వడం లేదని, మైనారిటీ విద్యార్థులకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరుతో ప్రోత్సాహకాలు ఇస్తామని అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో కాంగ్రెస్, టిడిపి రాష్ట్రాన్ని పాలించినా కెసిఆర్ సిఎం అయ్యాక మైనారిటీలకు మేలు జరిగిందని చెప్పారు. కెసిఆర్ గంగా, జమునా తెహజీబ్‌లా పరిపాలన చేశారని మహముద్ అలీ పేర్కొన్నారు. కెసిఆర్ మైనారిటీలకు సబ్సిడీ ఇచ్చారని, రేవంత్ రెడ్డి వచ్చాక ఒక్క రూపాయి మైనారిటీలకు సబ్సిడీ ఇవ్వలేదని, ఉర్దూ డిఎస్‌సి నిర్వహించడం లేదని పేర్కొన్నారు. కెసిఆర్ ఉర్దూను తెలంగాణ రెండవ అధికార భాషగా ప్రకటించారని, సెట్విన్ ద్వారా ముస్లింలకు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చేవారని, కెసిఆర్ హయాంలో పాతబస్తీ అభివృద్ధి జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ముస్లిం, మైనారిటీలపై దాడులు పెరిగాయని, రేవంత్ రెడ్డి పాలనలో రైతులు, ప్రజలు పరేషాన్‌లో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కెసిఆర్ సెక్యూలర్ లీడర్ అని, కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీనా లేదా అనేది రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చెప్పాలని అడిగారు. ఇది రేవంత్ రెడ్డి పాలనలాగా లేదు అని, మోదీ పాలనలా ఉందని విమర్శించారు. రేవంత్ రెడ్డి మోడీ,అమిత్ షా ను అనుసరిస్తున్నారని మహముద్ అలీ పేర్కొన్నారు.