గద్దర్ వచన కవిత రాయడమే కాక తెలుగు వచన కవితా రచనపై కూడా ప్రభావాన్ని నెరిపి అందులో మౌలిక మార్పులు రావడానికి కారణమయ్యాడు. ఈ వ్యాసంలో రెండు భాగాలు ఉన్నాయి. ఆయన రాసి వచన కవితపై, ఆయన 1972 నుం చి నిర్మిస్తూ వచ్చిన సాంస్కృతికోద్యమం వచన కవి తా రచనలో మౌలిక మార్పులు రావడానికి కాణమైన పరిస్థితులపై చర్చ ఉన్నది. ఉత్తరాదిలో అజ్ఞాతవాసం (1987 1990) గడుపుతుండగా గద్దర్ రాసిన వచన కవిత విశిష్టమైంది. అనేక పనుల మధ్య తాను ఒంటరిగా ఉండవల్సిన సమయాలలో తన కుటుంబ సభ్యులు, అమరులైన ఉద్యమ సహచరులు గుర్తుకొచ్చినప్పుడు గద్దర్ ఈ వచన కవితా రచనకు పూనుకున్నాడు. తెలుగు వచన కవితా సంప్రదాయంలో ఆయన వెలువరించిన ‘అండర్ గ్రౌండ్’ సంకలనం తెలుగు ఆధునిక ప్రగతిశీల సాహిత్య సంప్రదాయంలో ప్రత్యేకమైంది. ఎంతటి తాత్వికమైందో అంతటి సామాజిక రాజకీయ నేపథ్యం కలిగినది.
ఇంతేకాదు శివసాగర్, కొన్ని కవితలలో వరవరరావు, చెరబండరాజు , విమల వంటి కవుల ఊహలకు పునాదైన కాల్పనీకతకు ఎంతో పేరుగాంచిన విషయం సాహిత్యలోకానికి విదితమే. అయితే గద్దర్ వచన కవితలలో కూడా కాల్పనీకత ఉన్నది. దీనికి పునాది ఆయన ప్రోది చేసుకున్న మార్క్సిస్టు, అంబేద్కరిస్టు దృక్ప థం. ఇందులో భాగంగా తనదే అయిన సోషలిస్టు వాస్తవికత పునాదిగా తాను వచన కవితా రచనకు పూనుకున్నాడు. దీనితో సరళత, సామాజిక వాస్తవికత నిత్యనూతనంగా పరిణమించింది. ఆయన కిష్టమైన తెలుగు కవులలో చెరబండరాజు ఒకరు కా గా, మరో ఇద్దరు అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన హోచిమిన్, మావోలు ఉన్నారు. చాలా కవితలకు ప్రేరణ మావో ‘కాంట్రడిక్షన్స్’ అన్న రచనే, 1990లలో గెరిల్లా లేఖలు పేరుతో ఆయన వె లువరించిన వచన కవితలకు ప్రేరణ మావో, హోచిమిన్‌ల కవితా రచన. గెరిల్లా లేఖలలో శైలి, అభివ్యక్తి, రూపం, నుడికారాన్ని చూస్తే తెలుగు వ చన కవిత సంప్రదాయానికి తలమానికంగా చెప్పవచ్చు. ‘చిగురించే విప్లవం’, ‘కొంగ జపం’ అన్న కవితలలో మావో,
హోచిమిన్ ప్రభావం కనిపిస్తుం ది. తోడు, ‘నేను అదే పాట పాడ్తా, ‘రేపటికాలం’ అన్న కవితలలో మానవ సంబంధాల ఉన్నతి వ్యక్తమైంది. ‘ఆకవి’ అన్న కవిత నైజీరియా దేశపు ని యంతల ఉరితీతకు గురై మరణించిన కెన్ సారోవివాపై రాసిన స్మృతి కవిత. అమెరికా సామ్రాజ్యవాదులు తమ నైజీరియా దేశంలో నెలకొల్పిన షల్ కంపెనీ పొల్యూషన్‌కు వ్యతిరేకంగా వీవా ఉద్యమించినందుకు నైజీరియా దేశ పాలకులు కన్నెర్ర చేశారు. గద్దర్‌కు ఆఫ్రికా సాహిత్యంపై ఉన్న అవగాహనకు ఈ కవిత గీటు రాయిగా నిలుస్తుంది. అ కవితకు భోపాల్ అన్న కవితకు కూడా సారూప్యత ఉన్నది. అమెరికా సామ్రాజ్యవాదులు నెలకొల్పిన బహుళ జాతి కంపెనీల నిజ స్వరూపాన్ని తెలియచేసింది. భోపాల్ విషవాయువు సంఘటనలో వేలా ది మంది స్త్రీలు, పిల్లల మరణాలకు నిరసన వ్యక్తంచేస్తూ ఆ ఉద్యమానికి కార్యకర్తగా పనిచేసిన గణేష్ అన్న అమరునికి అంకితమివ్వడమైంది. యుద్ధంలో గెలిచే వస్తారు అన్న కవిత ఒక ఆధునిక కావ్యం. ప్రజా పోరాటాలలో పాల్గొంటూ వస్తు న్న కాలాన గుర్తుకొచ్చిన సహచరి ఎడతెగని జీవిత పోరాటంపై బాధతో రాసినా చివరికి చాలా ఆవావహంతో రాసిన కావ్యమిది. అయితే ఇంతటి ఉన్నత స్థాయిలో వచన కవిత రాసినా గద్దర్ జననాట్య మండలిలో చేరిన నాటి నుంచి వచన కవితా ప్రక్రియలో రచనలు ఎందుకు చేయలేదన్నది ముఖ్యమైన ప్రశ్న. దీనికి కారణాలు ఉన్నాయి.
ఆర్ట్ లవర్స్ సంస్థలో చేరిన కాలంనుంచి విప్లవ రచయితల వచన కవిత్వాన్ని అధ్యయనం చేసినప్పటికీ ఆయన ఒక ప్రక్రియగా వచన కవితను రాయడానికి పూనుకోలేదు. సాంస్కృతికోద్యమ నిర్మాణం లో తలమునకలైనందు వల్ల పాటలు, కళారూపా లు రాయడానికి, వాటి బాణీలను అధ్యయనం చే యడానికి. వాటిపై భిన్నకోణాలలో పరిశోధన చే యడానికే సమయం సరిపోయేదికాదు. దీనితో వ చన కవితా రచనపై దృష్టి పెట్టలేదు. అయితే ఇదే కాలాన జననాట్య మండలి సాంస్కృతికోద్యమం లో భాగంగా వెలువడిన రచనలను హిందీ తర్జుమా చేస్తూ వియత్నాం విప్లవకవి హోచిమిన్, చైనా రచయితలు లూషన్, మావో రచనలను, ఆఫ్రికా, ఆంగ్ల ప్రగతిశీల కవితను, ప్రగతిశీల హిందీ, మ రాఠీ కవితను అధ్యయనం చేయడం కొనసాగేది. ఇంతేకాకుండా ఆయన అజ్ఞాత జీవితంలో ఉండ గా ఒకసారి అరెస్టయి స్వల్పకాలం జైలులో ఉండవలిసి వచ్చింది. ఈ పరిస్థితులలోనే అడపాదడపా సమయం దొరికినప్పుడు ఆయన వచన కవితల రచనకు పూనుకున్నాడు. ఇదే కాలాన మావో తా త్విక రచనలను అధ్యయనం చేశాడు. ఇందులో ఆ యనకు ఇష్టమైన రచన కాం ట్రడిక్షన్ (వైరుధ్యాలు పేరుతో తెలుగులో అనువాదమైంది ).
1977లో ఎమర్జెన్సీని ఎత్తివేయడంతో ఆయన ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాలు, విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు వెళ్లి జననాట్య మండలి పక్షాన పాటలు, కళారూపాలతో సాంస్కృతికోద్యమాన్ని నిర్మించిన చరిత్ర ఆయనది. ఇదే కాలాన జరిగిన అంటే 1978లో జగిత్యా ల జైత్ర యాత్ర దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశంలోని మేధావులను ఆ పరిణామం ఆకర్షించింది. జగిత్యాల జైత్రయాత్ర మరోవైపు గద్దర్ విస్తారంగా నిర్మించిన సాహిత్య సాంస్కృతికోద్య మం మరోవైపు రేకెత్తించిన ఆలోచనల వల్ల ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక, సాంస్కృతిక, ప్రగతిశీల రాజకీయ రంగాలలో కొత్త గాలులు వీచడం మొదలయ్యాయి. వచన కవితలోకి ఆయా ప్రాంతాల మాండలికం, తెలంగాణ నుడికారం ప్రవేశించడం అందులో భాగమే.
సాహిత్య రంగాన్ని 1972 నుంచి ఇది తాకుతూ రావడంతో 1978 నాటికి విప్లవ సాహిత్యంలో భాగంగా వచ్చిన వచన కవిత మౌలిక మార్పులకు గురైంది. అరసం వచన కవితలో ప్రవేశపెట్టిన పడికట్టు పదజాలం, సాధారణీకరణ కనుమరుగైపోయింది. ఒక దశలో ఇది ప్రగతిశీల కవులను ప్రభావితం చేసింది. మచ్చుకు చెప్పుకోవాలంటే విరసం ఏర్పడిన తర్వాత సార్వజనీన భావాలతో వరవరరావు వెలువరించిన ‘ఊరేగింపు’, ‘స్వేచ్ఛ’ వంటి కవితా సంపుటాలు, శివారెడ్డి వెలువరించిన ‘చ ర్య’, ‘ఆసుపత్రి గీతం’ వంటి కవితా సంపుటాలు సార్వజనీన భావాలకు పట్టం కట్టినవే. అప్పటివరకు వాటిలో కొనసాగుతూ వచ్చిన ఆ భావాలు, ప్రామాణిక భాషా దృక్పథం కొత్త మార్పునకు గు రైంది. ఈ కవులు కూడా 1980ల తర్వాత క్రమంగా తమ కవితా రచన లో నిర్దిష్టతను, స్థానికతను భూమికగా చేసుకుని వ చన కవిత వెలువరించారు. జగిత్యాల జైత్ర యాత్ర తర్వాత వచన కవితలోకి స్థానికత, నిర్దిష్టత ప్రవేశించి బలపడింది.
ఆనాటికి యువకవులైన సలం ద్ర, అల్లం నారాయణ, నందిని సిధారెడ్డి, ఎన్ వేణుగోపాల్, గుడిహాళం రఘునాథం, సుంకిరెడ్డి వంటివారి కవితా రచనలో ఇది చూడవచ్చు. తెలంగాణ లో రాజుకున్న ప్రజాపోరాటాలు. నిర్బంధం పెరగ డం దానిని ప్రతిఘటిస్తూ పౌరహక్కుల ఉద్యమం బలపడడం వంటి పరిణామాలు వెల్లువెత్తడంతో క వి స్వతంత్రంగా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. గ ద్దర్ ప్రజాజీవితం కేంద్రంగా 1972 నుంచి పా టలు, కళారూపాలు రాసి సాంస్కృతికోద్యమంలో భాగంగా ప్రచారంలో పెట్టడం వల్ల వాటి ప్రభావంతో వచన కవితలో సార్వజనీనత తగ్గుతూ వచ్చి 1987 నాటికి నిర్దిష్టత, స్థానికత స్థిరపడింది. ఇం దుకు ఉదాహరణ 1987 తర్వాత వరవరరావు వె లువరించిన భవిష్యత్తు చిత్రపటం, ముక్తకంఠం కవితా సంపుటాలు. శివారెడ్డి వెలువరించిన అజే యం, విమల వెలువరించిన అడివి ఉప్పొంగిన రాత్రి అన్న కవితా సంపుటాలే. 1990లలో గద్దర్ వెలువరించిన గెరిల్లా లేఖలు ఈ కాలంలో వెలువరించిందే. 1987 1990ల మధ్య కాలాన అజ్ఞాత వాసంలో ఉన్న గద్దర్ వచన కవితా రచనకు పూనుకున్నాడు. అంటే ఏమిటి కాలంతో పయనించి తెలుగు సాహిత్యంలోకి కొత్త రుతువు వచ్చిన విషయాన్ని
పసిగట్టి గద్దర్ చారిత్రాత్మక పాత్ర నిర్వహించాడని చెప్పాలి. ఇంతేకాకుండా ఆయన రెండు కర్తవ్యాలను నిర్వహించాడు. ఒకటి అప్పటికి చెలామణిలో ఉన్న వచన కవితా రూపం, భాషపై పోరాటం చేస్తూ తాను వచన కవితను రాసి ప్రచారంలో పెట్టాడు. అట్లా వెలువడిందే గెరిల్లా లేఖలు అన్న కవిత. ఇది ఒక కొత్త నుడికారాన్ని, రూపాన్ని వచనకవితలోకి ప్రవేశపెట్టింది. అభివ్యక్తి, శైలి శిల్పం. పేరుతో చేరా వంటి విమర్శకులు ప్రచారంలో పెట్టిన కుహనా ప్రమాణాలను గద్దర్ నిర్వహించిన సాంస్కృతికోద్యమం తుత్తునియలు చేసి వచన కవితా రచనను మధ్యతరగతి, అగ్రకుల కేంద్రం నుంచి స్త్రీలు, అణగారిన వర్గాల కేంద్రంలోకి మారేలా చేసింది.
సామిడి జగన్ రెడ్డి
(జనవరి 31న గద్దర్ వర్ధంతి సందర్భంగా)