ఈ తోట నా నెలవు
ఇట మొక్కలను నాటాను,
నాటుతున్నాను, నాటుతాను
నాటుతూ, పాదుచేస్తూ, నీరుపోస్తూ, సవరిస్తూ, సంరక్షిస్తూ, సరిచేస్తూ కుదురుగా కత్తిరిస్తూ, ఎదుగును చూస్తూ, కాపలాకాస్తూ, నీడలలో ధ్యానిస్తూ, తీగలతో విస్తరిస్తూ, పూలతావి తోపులకిస్తూ ఉద్యాన హృదయులతో ముచ్చటిస్తూ, ఫలపుష్ప సంపదనూ, సారాన్నీ, స్వీకరిస్తూ హరితాంగుళులతో అతిథులకందిస్తూ -ఇదే పనిలో నేను..
నేనంటే ఈ తోట పనే.
దర్శించడానికో, స్పర్శించడానికో, శ్రమించడానికో, విశ్రమించడానికో, వికసించడానికో, అభ్యసించడానికో, శుభ్రపడడానికో, నిరపేక్షతోనాటడానికో, తోటను వినయ వీనులతో వినడానికో, సవ్వడి చేయక సంభాషించడానికో, కళ్ళను పండించుకోవడానికో, దిగుళ్ళను దించుకోవడానికో, ధ్యానించడానికో ఎవరైనా రావచ్చు.
ఒక షరతు..
రాతి చేతులతోనో, అహంభావ సింహాసనాలతోనో, భారీ భుజకీర్తులతోనో, ధగధగల ధనార్భాటాలతోనో, వందిమాగధులతోనో, మాదక పాత్రలతోనో, కృత్రిమ ద్రవ్యాలతోనో, నకిలీ చూపులతోనో, నకళ్ళ రాతలతోనో, నటనల నడకలతోనో, స్వోత్కర్షల వాయిద్యాలతోనో, అరువు గొంతుకలతోనో, అలవిమాలిన అతిశయోక్తులతోనో, అసంబద్ద సంగతులతోనో, అసంగత వాక్కులతోనో ఇక్కడికి రావద్దు. షరతుకు మినహాయింపుల్లేవు.
ఈ సృజన వాటిక ఇసుమంతైనా భగ్నపడొద్దు, వాడిపోవద్దు కాబట్టి.
దర్భశయనం శ్రీనివాసాచార్య