న్యూఢిల్లీ : దేశంలో నిరుద్యోగ సమస్యకు యూపీఏ ఎన్డీయే ప్రభుత్వాలు సరైన పరిష్కారం చూపించలేకపోయాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఉత్పత్తి ఆధారిత దేశంగా మనం విఫలమై, దానిని చై నాకు అప్పగించామన్నారు. ఇకనైనా మనం ఉత్పత్తి పైనే పూర్తిగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ‘ మేకిన్ ఇండియా ’ మంచి ఆలోచనే అయినప్పటికీ దానిని అమలు చేయడంలో మోడీ విఫలమయ్యారని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై లోక్‌సభలో చర్చ సందర్భంగా మాట్లాడిన రాహుల్, ఆ ప్రసంగంలోని అంశాలు ఏటా ఒకేలా ఉంటున్నాయని వ్యాఖ్యానించారు.
“ యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉంది. మనం మాట్లాడేది ఏదైనా వారి గురించే అయి ఉండాలి. మనదేశం అభివృద్ధి చెందుతున్నప్పటికీ, నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేక పోయాం. గతంలో ఉన్న యూపీఎ ప్రభుత్వం, ప్రస్తుత ఎన్డీయేలు ఉపాధి , ఉపాధి కల్పన గురించి దేశ యువతకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేక పోయాయి. ‘ మేకిన్ ఇండియా ’ ఆలోచన మంచిదే , కానీ దీనిలో ప్రధాని మోడీ విఫలమయ్యారు. ఉత్పత్తి రంగంలో భారత్ నిలదొక్కుకోకపోవడం వల్ల చైనా ఇక్కడ మకాం వేసింది. తయారీలో మనం విఫలమై, చైనాకు అప్పగించాం. ఇప్పటికైనా తయారీపైనే పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సి ఉంది. దేశంలో సామాజిక ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి ” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.