లక్నో: అయోధ్యలోని రామ జన్మభూమి మందిరం ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్(85)కు ఆదివారం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. సత్యేంద్ర దాస్‌ను సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎస్‌జిపిజిఐ)కి తరలించారు. ‘శ్రీ సత్యేంద్ర దాస్‌కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆయన డయబెటిక్, హైపర్‌టెన్సివ్‌తో బాధపడుతున్నారు. ఎస్‌జిపిజిఐలో ఆదివారం చేరారు. ప్రస్తుతం న్యూరాలజీ వార్డ్ హెచ్‌డియూలో ఉన్నారు’ అని హాస్పిటల్ తన ప్రకటనలో పేర్కొంది.
ఆయన పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ ఆయన వింటున్నారని, పరిస్థితి కాస్త నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. నిర్వాణి అఖాడకు చెందిన మహంత్ సత్యేంద్ర దాస్ చాలా కాలం రామ మందిర పూజారిగా ఉన్నారు. ఆయనకు 20 ఏళ్లున్నప్పుడే ఆధ్యాత్మిక మార్గానికి మళ్లారు. సత్యేంద్ర దాస్ మీడియా వ్యక్తులు సహా అందరికీ అందుబాటులో ఉండేవారు. అయోధ్య ఉద్యమం నుంచే అందరికీ గౌరవనీయుడిగా మారారు. సత్యేంద్ర దాస్ త్వరగా కోలుకోవాలని అయోధ్యలోని విహెచ్‌పి ప్రతినిధి శరద్ శర్మ ప్రార్థిస్తున్నారు.