ఎంఎల్‌ఎలపై అనర్హత వేటు వేయాలంటూ
కెటిఆర్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
మన తెలంగాణ/హైదరాబాద్ : గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ నుంచి గెలుపొంది ఆ తర్వాత అధికార కాంగ్రెస్‌లో చేరిన ఎంఎల్‌ఎలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. బిఆర్‌ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్య రామసుందరం వాదనలు వినిపించారు. ఇదే అంశానికి సంబంధించి గతంలో దాఖలైన పిటిషన్‌కు కెటిఆర్ వేసిన పిటిషన్‌ను ధర్మాసనం జత చేసింది.
కెటిఆర్ వేసిన పిటిషన్‌ను దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల అనర్హత పిటిషన్‌తో కలిపి విచారిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను సుప్రీం కోర్టు ఈ నెల 10కి వాయిదా వేసింది. పార్టీ ఫిరాయించిన ఎంఎల్‌ఎలపై అనర్హత వేటు వేయాల ంటూ బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పాడి కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్‌పై రెండ్రోజుల క్రితం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
పార్టీ మారిన ఎంఎల్‌ఎలపై నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఎంత సమయం కావాలని సుప్రీంకోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ను ప్రశ్నించింది. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసేదాకనా అని ప్రశ్నించింది. స్పీకర్‌కు ఎంత సమయం కావాలో మీరే కనుక్కుని చెప్పాలంటూ న్యాయవాది ముకుల్ రోహత్గీని ఆదేశించింది. ఆపై తదుపరి విచారణను వాయిదా వేసింది. పార్టీ ఫిరాయించిన బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకటరావుపై అనర్హత వేటు వేయాలని పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద పిటిషన్ వేసిన సంగతి విదితమే.
బిఆర్‌ఎస్ నేతలు ఉప ఎన్నికలకు సిద్ధం కావాలి..! కెటిఆర్
బిఆర్‌ఎస్ శ్రేణులు, కార్యకర్తలు ఉప ఎన్నికలకు రెడీగా ఉండాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ఎక్స్(ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు చూస్తుంటే పార్టీ మారిన బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలపైనా వేటు పడుతుందన్నారు. అలాగే, ఫిరాయింపు దారులను కాంగ్రెస్ పార్టీ కాపాడడం అసాధ్యమన్నారు. అయితే, బిఆర్‌ఎస్ పార్టీ మీద గెలిచిన ఎంఎల్‌ఎలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకటరావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాష్ గౌడ్ , అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్‌లు కాంగ్రెస్‌లోకి పార్టీలో చేరారు. వీళ్లపై అనర్హత వేటు వేయాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ డిమాండ్ చేస్తున్నారు.