Tuesday, February 4, 2025

రాష్ట్రంలో కులగణన ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేశాం

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో 96 శాతం ఆర్థిక, సామాజిక సర్వే నిర్వహించాం
కులగణన సర్వేలో పాల్గొనని కుటుంబాలు అధికారులకు మళ్లీ వివరాలు ఇవ్వొచ్చు
కులగణనపై తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తే
అది బలహీన వర్గాలపై దాడి చేసినట్లే
రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
మనతెలంగాణ/హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కులగణన ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేశామని రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్రంలో 96 శాతం ఆర్థిక, సామాజిక సర్వే చేశామని ఆయన చెప్పారు. కులగణన సర్వేలో పాల్గొనని వారు అధికారులకు మళ్లీ వివరాలు ఇవ్వొచ్చని ఆయన అన్నారు. బిసి రిజర్వేషన్లపై అన్ని పార్టీల స్టాండ్ ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కులగణనపై తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తే అది బలహీన వర్గాలపై దాడి చేసినట్లేనని ఆయన పేర్కొన్నారు. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న కులగణనను తాము పూర్తి చేశామని ఆయన తెలిపారు.

పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కులగణణ చేయని వాళ్లు ఇప్పుడు మమ్మల్ని విమర్శించడమేమిటని ఆయన మండిపడ్డారు. కులగణనపై ప్రతి పక్షాల విమర్శలను బిసిలపై దాడిగా చూస్తామన్నారు. కులగణనపై ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కొంటామని మంత్రి పొన్నం తెలిపారు. అన్ని వర్గాలకు ఫలితాలు అందేవరకు పోరాటం ఆగదన్నారు. అధికారంలో ఉండగా బలహీనవర్గాలకు న్యాయం చేయని బిఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు విమర్శలు చేస్తే తాము చూస్తూ ఊరుకోబోమని మంత్రి పొన్నం హెచ్చరించారు. బిసిల మేలు కోసం చేసే ప్రయత్నాలను అడ్డుకోవద్దని మంత్రి సూచించారు. బిసి సోదరులందరూ నేడు ఉత్సవాలు జరుపుకోవాలని మంత్రి పొన్నం పిలుపునిచ్చారు.

కెసిఆర్ ఫ్యామిలీలో కవిత ఒక్కరే వివరాలు ఇచ్చారు….

కులగణన సర్వేలో భాగంగా కెసిఆర్ ఫ్యామిలీలో ఎమ్మెల్సీ కవిత ఒక్కరే అధికారులకు వివరాలు ఇచ్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కొన్నిచోట్ల కులగణన కోసం అధికారులు వస్తే కుక్కలను వదిలారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కులగణనకు కొన్ని కుటుంబాలు సహకరించలేదని మంత్రి వెల్లడించారు. కెసిఆర్ కుటుంబసభ్యులు వివరాలు ఎందుకివ్వలేదో కవిత ప్రశ్నించాలని ఆయన డిమాండ్ చేశారు.

సర్వేలో తప్పులు జరిగినట్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కులగణన విషయంలో ఏదైనా సలహాలు సూచనలు ఇస్తే ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ వినడానికి సిద్ధంగా ఉందన్నారు. ఎక్కడైనా పొరపాట్లు జరిగాయని అనిపిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని మంత్రి సూచించారు. ఇది పార్టీ పరంగా జరిగిన సర్వే కాదనీ, ప్రభుత్వ పరంగా జరిగిందని ఆయన స్పష్టంచేశారు.

సర్వే వివరాలు పబ్లిక్ డొమైన్‌లో పెడతాం

నిర్ణీత గడువులో కులగణన చేసిన యంత్రాంగాన్ని మంత్రి పొన్నం ప్రశంసించారు. కులగణనకు స్ఫూర్తినిచ్చిన రాహుల్ గాంధీకి మంత్రి పొన్నం ధన్యవాదాలు తెలిపారు. ఈ విప్లవాత్మక మార్పును స్వాగతిస్తూ అన్ని జిల్లాల్లోని బలహీన వర్గాల నాయకులు, మేధావులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సర్వేను నేడు కేబినెట్, ఆ తర్వాత అసెంబ్లీలో ఉంచుతామన్నారు. గత ప్రభుత్వంలో మాదిరిగా సర్వేలు జరిపి ఆ లెక్కలు బీరువాలకే పరిమితం చేయడం లేదని, కులగణన సర్వే వివరాలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచుతామని ఆయన వెల్లడించారు. గుడ్డుపై ఈకలు పీకిన చందంగా బిసిల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయంలో రాజకీయపరమైన దాడి చేయవద్దని ఆయన చురకలంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News