11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
కులగణన నివేదిక, ఎస్సీ వర్గీకరణ అమలుపై చర్చ
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర కేబినెట్ నేడు ఉదయం 10 గంటలకు సమావేశం కానుంది. బిసి సబ్ కమిటీ కులగణన నివేదిక, ఎస్సీ వర్గీకరణ అమలు అంశాలపై కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనుంది. కేబినెట్ భేటీ తర్వాత 11 గంటలకు అసెంబ్లీలో వాటిపై చర్చించి ఆమోదించనున్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పంపించనుంది. శాసనమండలి, శాసనసభలో ఈ రెండు నివేదికలను ప్రవేశపెట్టి చర్చించనున్నారు.
కేంద్ర ప్రభుత్వానికి బిఆర్‌ఎస్ ప్రభుత్వం 2018లో పంచాయతీరాజ్ చట్టంలో పలు సవరణలు చేసింది. అందులో బిసి రిజర్వేషన్లను 34 శాతం నుంచి 23 శాతానికి తగ్గించింది. ఆ విధానంలోనే 2019లో స్థానిక ఎన్నికలను నిర్వహించింది. అయితే బిసిలకు రిజర్వేషన్లను తగ్గించడంపై రాష్ట్ర హైకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. వాటిని విచారించిన హైకోర్టు రిజర్వేషన్‌లను తగ్గించి ఎన్నికలు జరపాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పూర్తిగా ఉల్లంఘించడమేనని అభిప్రాయపడింది.
అంతేకాకుండా రిజర్వేషన్లను పాటించని ఎన్నికలను ఎందుకు రద్దు చేయకూడదని ప్రశ్నించింది. అయితే సుప్రీం మార్గదర్శకాల ప్రకారం చేయాలంటే అందుకు రాష్ట్రంలోని బిసిల జనాభాను తేల్చాలి. బిసి గణన జరిపి జనాభాలో వారి శాతాన్ని ఖరారు చేయాలి. ఈ నేపథ్యంలోనే డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా బిసిల రిజర్వేషన్‌లను ప్రభుత్వం ఖరారు చేయనుంది.