ఆధునిక జీవనశైలి, క్రమరహిత ఆహారపు అలవాట్లు, ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్ వినియోగం, కాలుష్యం తదితర కారణంగా కేన్సర్ కేసులు గత దశాబ్దంలో మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పెరిగాయి. ప్రతి సంవత్సరం లక్షల మంది ఈ వ్యాధితో మరణిస్తున్నారు. పెరుగుతున్న కేన్సర్ ప్రభావంపై దృష్టిని ఆకర్షించడానికి, ఎదుర్కొనే చర్యలను ప్రోత్సహించడానికి, అవగాహన కల్పించడం, గుర్తింపు, నివారణ, చికిత్సను మెరుగుపరచడానికి ప్రతీ ఏడాది ఫిబ్రవరి 4న ప్రపంచ కేన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2025 థీమ్ యునైటెడ్ బై యూనిక్. ఈ దినోత్సవం 4 ఫిబ్రవరి 2000న పారిస్‌లో జరిగిన ప్రపంచ కేన్సర్ సదస్సులో నిర్ణయించబడింది. కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధి ఎలా వ్యాపిస్తుంది, కేన్సర్ గురించి అపోహలను తొలగించడం, కేన్సర్ సంబంధిత ప్రచారాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, సకాలంలో కేన్సర్‌ను గుర్తిస్తే నూటికి నూరు శాతం నయం చేయొచ్చని అవగాహన కల్పించడమే ఈ రోజు లక్ష్యం.
కేన్సర్ అనేది శరీరంలోని ఏదైనా అవయవం లేదా కణజాలాన్ని ప్రభావితం చేసే వ్యాధుల పెద్ద సమూహం. ఇది అనియంత్రితంగా విభజించే కణాల అసాధారణ పెరుగుదలను సూచిస్తుంది. ఇది శరీర భాగం లేదా అవయవం లేదా కణజాలం నుండి మరొక దానికి వ్యాపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.మానవ శరీరంలోని కణాల పెరుగుదలను ఎప్పుడు ప్రారంభించాలి? ఎప్పుడు ఆపాలి? లాంటి సూచనలను కణాలకు వాటిలోని జన్యువులు సమాచారాన్ని పంపుతాయి. ఆరోగ్యవంతమైన కణాలు ఈ సూచనలను పాటిస్తాయి. కానీ కేన్సర్ కణాలు వాటిని విస్మరిస్తాయి. సాధారణ కణాలు కేన్సర్ కణాలుగా మారినప్పుడు అవి అసాధారణంగా అనేక రెట్లుగా వ్యాప్తి చెందుతాయి. కేన్సర్లలలో సుమారుగా వందకు పైగా రకాలు ఉన్నాయి. ఇవి మూడు విస్తృత కేన్సర్లుగా వర్గీకరించబడ్డాయి. అవి ఘన (సాలిడ్) కేన్సర్లు, రక్త కేన్సర్లు, మిశ్రమ కేన్సర్లు.
కేన్సర్ లక్షణాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉంటాయి. ఇవి ఒక వ్యక్తికి ఏ రకమైన కేన్సర్ ఉంది? అది ఎంత అభివృద్ధి చెందింది? అనే దానిపై ఆధారపడి ఉంటాయి. కేన్సర్ రావడానికి ఒకే ఒక్క కారణం లేదు. కానీ కొన్ని కారకాలు అభివృద్ధి చేసే అవకాశాన్ని పెంచుతాయి. అవి జన్యుకారకాలు, పొగాకు వినియోగం, అనారోగ్యకరమైన ఆహారం, శారీరక నిష్క్రియాత్మకత, పర్యావరణ కారకాలు, పోషకాహార లోపం, కొన్ని రకాల రేడియేషన్లు, కాలుష్యం లాంటివి ప్రధానమైనవి. ప్రపంచ వ్యాప్త మరణాలకు కేన్సర్ రెండవ అతి ప్రధాన కారణం. అంతర్జాతీయ కేన్సర్ పరిశోధనా ఏజెన్సీ గణాంకాల ప్రకారం 2022లో రెండు కోట్లు కొత్త కేన్సర్ కేసులు, 97 లక్షల మరణాలు సంభవించాయి. ఊపిరితిత్తుల కేన్సర్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణంగా సంభవించే క్యాన్సర్. ఇవి 25 లక్షలు కేసులుతో (12.4%) ప్రథమ స్థానంలోనూ, స్త్రీలలో రొమ్ము క్యాన్సర్లు 23 లక్షల (11.6%) కేసులుతో రెండవ స్థానంలో ఉన్నాయి.
కొలొరెక్టల్ కేన్సర్ 19 లక్షల (9.6%) కేసులతోను, ప్రొస్టేట్ కేన్సర్ 15 లక్షల (7.3%) కేసులు, పొట్ట కేన్సర్ 9.7 లక్షల (4.9%) కేసులతో తరువాత స్థానాలలో ఉన్నాయి. పురుషులలో ప్రొస్టేట్, కొలొరెక్టల్ కేన్సర్లు సాధారణంగా సంభవించే కేన్సర్లలో రెండవ, మూడవ స్థానంలో ఉన్నాయి. 18 లక్షల (18.7%) మరణాలతో ఊపిరితిత్తుల క్యేన్సర్, కొలొరెక్టల్ కేన్సర్లతో 9 లక్షలు (9.3%), కాలేయ కేన్సర్లతో 7.6 లక్షలు (7.8%), బ్రెస్ట్ కేన్సర్లతో 6.7 లక్షలు (6.9%), పొట్ట కేన్సర్లతో 6.6 లక్షలు (6.8%) చనిపోయారు. మహిళలలో ప్రధాన కారణం రొమ్ము కేన్సర్ అయితే పురుషులలో ఊపిరితిత్తుల కేన్సరుగా ఉంది. 2023లో మన దేశంలో 14,96,972 కేన్సర్ కేసులు నమోదయ్యాయని నేషనల్ కేన్సర్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. 2040 నాటికి భారతదేశంలో ఈ కేసులు రెట్టింపు అవుతాయని అంచనా. ప్రతి ఏడాది ఎనిమిది లక్షల కొత్త కేన్సర్ కేసులు నమోదవుతున్నాయి.
వీటిలో నోరు, ఊపిరితిత్తులు, తల, మెడ కేన్సర్లతో సహా పొగాకు సంబంధిత కేన్సర్లు ప్రబలంగా ఉన్నాయి. ఈ కేన్సర్లు చాలా వరకు నివారించదగినవి. కేన్సర్ కేసుల పెరుగుదలకు చాలా మంది రోగులు స్టేజ్ 4 లో ఉండటం పేలవమైన ఫలితాలకు దారితీస్తుంది. వైవిధ్యమైన జనాభా, ఆరోగ్య సంరక్షణ అసమానతలు ఉన్న మన దేశంలో ప్రారంభ రోగ నిర్ధారణ, చికిత్సకు సమాన ప్రాప్యతను అందించడంలో సవాళ్లను ఎదుర్కొంటోంది. సాధారణ స్క్రీనింగ్‌లు, ముందస్తుగా గుర్తించడం అనేది మనుగడ రేటును మెరుగుపరచడంలో సహాయపడే రెండు ప్రధాన అంశాలు. ప్రస్తుతం శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, హార్మోన్ థెరపీ, స్టెమ్‌సెల్ ట్రాన్స్ప్లాంట్లు, ఎమ్‌ఆర్‌ఎన్‌ఎ టీకాలు లాంటి అధునాతన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఏదేమైనా వివిధ రకాల కేన్సర్లను నివారించవచ్చు. విస్తృతమైన అవగాహన, సకాలంలో జోక్యం చేసుకోవడం ద్వారా కేన్సర్ భారాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. అన్నింటి కంటే ప్రధానమైంది కేన్సర్‌ను ముందుగా గుర్తించడం.
జనకమోహన రావు దుంగ
82470 45230
(నేడు ప్రపంచ కేన్సర్ దినోత్సవం)