ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బహుశా తొలిసారిగా ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రతిష్ఠాత్మకం కాబోతున్నాయి. పార్టీ నేతలు జైలుకు వెళ్లి రావడం, కేజ్రీవాల్ సిఎంగా తప్పుకోవడం వంటి పరిణామాల మధ్య ఎన్నికలు ఈ నెల 5న జరుగబోతున్నాయి. అయితే బిజెపి కూడా ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎప్పుడూ లేని విధం గా వరాల జల్లుతో మేనిఫెస్టో విడుదల చేసింది. ఉచిత పథకాలకు తానేమీ తీసిపోనని చెప్పుకుంది. కానీ ఏ ఒక్కరూ ఢిల్లీ కాలుష్యంపై మాట్లాడడం లేదు. కేవలం ఉచిత పథకాలకే పరిమితం కావడం గమనార్హం. అయితే దేశ రాజధాని కావడంతో మోడీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ముక్కోణపు పోటీ జరుగుతోంది.
ఢిల్లీలో అధికారానికి దూరంగా ఉంటూ వస్తున్న బిజెపి ఈసారి ఎట్లాగైనా అధికారం చేపట్టాలని పట్టుదలగా ఉంది. పదేళ్ల ఆప్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న ప్రభుత్వ వ్యతిరేకత అందుకు అనుకూలం కాగలదని ఆశిస్తున్నది. మొహల్లా క్లినిక్‌లు, కార్పొరేట్ స్థాయిలో మున్సిపల్ పాఠశాలలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలలో కొంతమేరకు కేజ్రీవాల్‌కు దేశంలో మరే ఇతర ముఖ్యమంత్రి సాధింపలేని పాలనా విజయాలు సాధించినా గెలుపుకోసం అవి మాత్రమే సరిపోవు. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన, అపరిశుభ్రమైన దేశ రాజధానిగా నేడు ఢిల్లీ అప్రతిష్ఠకు గురవుతున్నది. ప్రధాని నరేంద్ర మోడీ చెబుతున్నట్లు మరో మూడేళ్లలో భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినా, 2047 నాటికి ‘వికసిత్ భారత్’గా అభివృద్ధి చెందినా, ఇటువంటి రాజధాని నగరంతో అంతర్జాతీయంగా భారత్ సగర్వంగా నిలబడలేదు. ఒక వంక మురికి కాలువగా మారిపోయిన యమునా నది, ఇంకోవైపు ఎటు చూసినా కనిపించే వ్యర్థ పదార్థాలు. ఇవి కాకుండా కాలుష్యానికి కారణం అవుతున్నాయి. ఇవన్నీ కలిసి రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత, వైఫల్యాలు ప్రజల ముందు నిలుస్తున్నాయి.
అవినీతి వ్యతిరేక ఉద్యమం నుండి ప్రజాజీవనం ప్రారంభించిన కేజ్రీవాల్ స్వయంగా అవినీతి కేసులో జైలుకు వెళ్లిరావడం, ఆయన సహచరులు అనేక మంది వెళ్లడం కూడా ఆ పార్టీని ఆత్మరక్షణలో పడేస్తున్నాయి. ఆ కేసులు అన్ని రాజకీయ కక్ష సాధింపుగా నమోదు చేసినవి అని చెబుతున్నా, ఆ కేసులు ఏవీ న్యాయస్థానాల ముందు నిలబడే అవకాశాలు ఉన్నా, లేకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందుకనే తన రాజకీయ జీవనంలో పెను సవాల్‌ను ఇప్పుడు ఆయన ఎదుర్కొంటున్నారు. మరోవంక బలమైన స్థానిక నాయకత్వం లేకపోవడంతో 2014 నుండి వరుసగా మొత్తం 7 లోక్‌సభ సీట్లను గెల్చుకుంటున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపికు పరాజయం తప్పడం లేదు. మీడియాలో సంచలనాలు సృష్టించే నాయకులపై ఆధారపడుతుంది. కానీ ఇతర పార్టీల మాదిరిగా క్షేత్రస్థాయిలో జనం మధ్యలో పనిచేసే నాయకులను ప్రోత్సహించడం లేదు. దానితో మొదటిసారిగా ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో సైతం పరాజయం తప్పలేదు.
‘శేష్ మహల్’ గురించి కొంతమేరకు కేజ్రీవాల్‌ను ఇరకాటంలో పడవేసినా, బంగారు పూత పూసిన టాయిలెట్ ఫిట్టింగ్‌లు, స్విమ్మింగ్ పూల్ వంటి అద్భుతమైన ప్రచారాల వివరాలు అవాస్తవమని వెల్లడి కావడంతో వెంటనే బిజెపి తమ ప్రచారాన్ని మార్చివేశారు. ఒక్కసారి అధికారం ఇస్తే ఢిల్లీ రూపురేఖలను తాము మాత్రమే మార్చగలము అని చెప్తున్నారు. ఢిల్లీ తీవ్రమైన నీటి సమస్య ఎదుర్కొంటున్న సమయంలో పొరుగునున్న హర్యానాలోని బిజెపి ప్రభుత్వం సహకరించే విధంగా కేంద్రం ఎటువంటి చొరవ తీసుకోలేక పోయింది. ఢిల్లీలోని దళితుల మద్దతు పొందటం బిజెపికి ఓ సవాల్‌గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి కేజ్రీవాల్‌తో సమానంగా ప్రజాదరణ గల నాయకులు ఎవ్వరూ బిజెపిలో లేరు. అందుకనే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించేందుకు బిజెపి వెనకాడుతుంది.
పైగా పలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే గెలుపొంది ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం, ప్రజాదరణతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రులను ఎంపిక చేస్తున్న బిజెపి ఢిల్లీలో సైతం కేవలం ప్రధాని మోడీ ప్రజాకర్షణపైననే ఆధారపడుతుంది. అయితే గత ఏడాది లోక్‌సభ ఎన్నికల సమయం నుండి ఓటర్లను ఆకర్షించడంతో మోడీకి సైతం పరిమితులున్నాయని స్పష్టం కావడం బిజెపికి ప్రమాద సంకేతాలను సూచిస్తున్నది. అందుకనే ఢిల్లీ ఎన్నికలు బిజెపి నాయకత్వంపై అగ్నిపరీక్షగా మారాయి. ఈ ఎన్నికలలో గెలుపొందితే జాతీయ స్థాయిలో బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా కేజ్రీవాల్, అఖిలేశ్, మమతా బెనర్జీ వంటి వారు కలిసి బలమైన ప్రత్యామ్నాయం అందించే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. బిజెపికి సైతం జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ కాకుండా మరో నాయకుడు మోడీకి పోటీగా ఎదగడం ఇష్టం లేదు. అందుకనే కేజ్రీవాల్‌ను ఓడించడం ఆ పార్టీకి చాలా అవసరంగా ఉంది. ఢిల్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఓ రకంగా ఏకాకిగా పోటీ చేస్తున్నది. ప్రతిపక్షాలు ఆప్ పట్ల సానుకూలత వ్యక్తంచేయడం రాబోయే రోజులలో జాతీయ స్థాయిలో ఆ పార్టీ మరింత ఏకాకిగా మారే సంకేతాలను అందిస్తున్నది. దేశ రాజధాని అసెంబ్లీ ఎన్నికలలో ఏపార్టీ కూడా కాలుష్యంపై హామీ ఇవ్వకపోవడం, ఏ పార్టీ చూసినా కానీ ఉచితాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు గాని కాలుష్యం లేని ఢిల్లీగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తామని చెప్పడం లేదు.
సభావట్ కళ్యాణ్
90143 22572