Monday, April 28, 2025

అక్రమ వలసదారులను పంపివేస్తున్నాం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : యునైటెడ్ స్టేట్స్ (యుఎస్) వలస చట్టాలను కట్టుదిట్టం చేస్తోందని భారత్‌లోని అమెరికన్ రాయబార కార్యాలయం మంగళవారం తెలియజేసింది. యుఎస్ సైనిక విమానం ఒకటి కొంత మంది అక్రమ వలసదారులను భారత్‌కు తీసుకువస్తున్నదన్న వార్తల నడుమ దౌత్య కార్యాలయం ఆ వ్యాఖ్య చేసింది. డొనాల్డ్ ట్రంప్ రెండవ విడత యుఎస్ అధ్యక్షుడు అయిన తరువాత సుమారు రెండు వారాలకు యుఎస్ నుంచి అక్రమ భారతీయుల తరలింపు మొదటి రౌండ్ మొదలైంది. యుఎస్‌లో నివసిస్తున్న అక్రమ వలసదారుల విషయంలో కఠిన విధానాన్ని అనుసరిస్తామని ట్రంప్ వాగ్దానం చేశారు. తదనుగుణంగానే ఆయన అక్రమ వలసదారులకు సంబంధించిన కొన్ని కార్యనిర్వాహక ఉత్తర్వులపై ఇప్పటికే సంతకం చేశారు.

భారత్‌కు అక్రమ వలసదారులు కొందరిని వెనుకకు తీసుకువస్తున్న విమానం గురించిన ప్రశ్నకు యుఎస్ ఎంబసీ అధికార ప్రతినిధి వివరాలు వెల్లడించలేదు, కానీ వాషింగ్టన్ అక్రమ వలసదారులను పంపివేస్తున్నదని ఆయన స్పష్టం చేశారు. ‘ఆ ప్రశ్నలకు ఎటువంటి వివరాలనూ ఇవ్వలేను, యుఎస్ తన సరిహద్దును గట్టిగా కాపాడుకుంటున్నది, వలస చట్టాలను కట్టుదిట్టం చేస్తున్నది, అక్రమ వలసదారులను తొలగిస్తున్నది అన్న సమాచారాన్ని ఇవ్వగలను’ అని ఆ అధికారి తెలిపారు. ‘అక్రమ వలస రిస్క్ తీసుకునేంతది కాదనే విస్పష్ట సందేశాన్ని ఈ చర్యలు పంపుతున్నాయి’ అని ఆయన చెప్పారు. జనవరి 27న ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్ సంభాషణ అనంతరం యుఎస్ నుంచి అక్రమ వలసదారులను వెనుకకు రప్పించడంపై భారత్ ‘ఏది సరైనదో అదే చేస్తుంది’ అని ట్రంప్ ప్రకటించారు.

అక్రమ వలసకు తాము వ్యతిరేకమని, యుఎస్‌లో అక్రమంగా బస చేస్తున్న భారతీయుల జాతీయతను ధ్రువీకరించినట్లయితే వారిని వెనుకకు రప్పించడానికి తాము సిద్ధమని విదేశాంగ మంత్రిత్వశాఖ (ఎంఇఎ) క్రితం నెల వెల్లడించింది. అక్రమ వలసదారులకు రకరకాల సంఘటిత నేరాలతో సంబంధం ఉన్న కారణంగా అక్రమ వలసను భారత్ వ్యతిరేకిస్తున్నదని ఎంఇఎ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ జనవరి 24న తెలిపారు. ‘వారు నిజానికి భారతీయులు అని వారి జాతీయతను మేము ధ్రువీకరించడానికి వీలుగా పత్రాలను మాతో పంచుకున్నట్లయితే వారిని వెనుకకు తీసుకుంటాం’ అని ఆయన తెలిపారు. అయితే, యుఎస్‌లో బస చేస్తున్న అక్రమ భారతీయ వలసదారుల సంఖ్య గురించి మాట్లాడడం ‘తొందరపాటు’ అవుతుందని జైశ్వాల్ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News