ఢిల్లీ పీఠం ఎవరికి దక్కుతుంది? రెండున్నర దశాబ్దాలుగా అధికారం అందని ద్రాక్షగా మారిన కమలనాథులను ఈసారైనా ఢిల్లీ ఓటర్లు కరుణిస్తారా? లేక వరుసగా మూడోసారి కూడా ఆమ్‌ఆద్మీ పార్టీనే అందలం ఎక్కిస్తారా? డబ్భయ్ సీట్ల ఢిల్లీ అసెంబ్లీకి బుధవారం జరిగే పోలింగ్‌లో ఓటర్లు ఎవరికి పట్టం కట్టారో తెలియాలంటే మరో నాలుగు రోజులు వేచి ఉండాల్సిందే. ఆమాటకొస్తే ఢిల్లీ ఓటరు మనోగతాన్ని అంచనా వేయడం అంత సులభం కాదు కూడా. వారి మనసులో ఏముందో కనిపెట్టడం కాకలుతీరిన రాజకీయ పరిశీలకులకు కూడా ఒక పట్టాన అర్థం కాదనేందుకు పదేళ్ల క్రితం జరిగిన ఎన్నికలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అప్పట్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కు పట్టం కట్టిన హస్తిన ఓటరు, అనూహ్యంగా లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని గెలిపించాడు.
ఐదేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 62 సీట్లలో ఆప్‌ను గెలిపించిన ఓటర్లు, గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం ఏడు పార్లమెంటరీ స్థానాలనూ కమలానికే కట్టబెట్టారు. అందుకనే ఢిల్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఉత్కంఠ రేకెత్తిస్తూ ఉంటాయి. మూడు ప్రధాన పార్టీలు బరిలో ఉన్నా పోటీమాత్రం ఆప్, బిజెపిల మధ్యేనన్న సంగతి ఢిల్లీలో ఎవరినడిగినా చెబుతారు. 2013కు ముందు వరుసగా పదిహేనేళ్లపాటు దేశ రాజధానిని ఏలిన కాంగ్రెస్, ఆప్ ఆవిర్భావంతో తెరమరుగైంది. పూర్వవైభవం కోసం పాకులాడుతున్న ఆ పార్టీ ఈసారి ఎన్నికల్లో సాధించే సీట్లకంటే, ఎవరి ఓట్లను చీలుస్తుందనే అంశమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జనాభాలో 67 శాతం మంది మధ్యతరగతివారే కావడంతో వారి ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టేందుకు ప్రధాన పార్టీలు రెండూ వీలైనన్ని ఉచిత హామీలను గుప్పిస్తూ ప్రచారాన్ని హోరెత్తించాయి.
బిజెపి తరఫున కేంద్ర మంత్రులతోపాటు ప్రధాని మోడీ సైతం పలు సందర్భాల్లో ఆప్ నేతల అవినీతి, కేజ్రీవాల్ నిర్మించుకున్న ‘అద్దాల మేడ’ వంటి అంశాలను ఎన్నికల ప్రచారంలో ప్రధానాస్త్రాలుగా మలచుకున్నారు. మొన్నటి కేంద్ర బడ్జెట్లో 12 లక్షల రూపాయల వరకు ఆదాయ పన్ను మినహాయింపు కల్పించడం ఢిల్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బిజెపి వేసిన ఎత్తుగడగా విపక్షాలు ఇప్పటికే దుమ్మెత్తిపోస్తున్నాయి. కేజ్రీవాల్ సైతం ఇడిని ఉసిగొల్పి తనను కేంద్రంలోని పెద్దలు జైలుపాలు చేశారంటూ ఓటర్ల సానుభూతిని పొందే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగకుండా, యమున నీటిని కలుషితం చేయడం ద్వారా ఎన్నికలల్లో ఆప్‌ను బద్నాం చేసేందుకు హర్యానా ముఖ్యమంత్రి కుట్ర పన్నారంటూ ధ్వజమెత్తి, బిజెపి నేతలను ఆత్మరక్షణలో పడవేసేందుకు ప్రయత్నించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గర్భిణులకు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం, అద్దె ఇళ్లలో నివసిస్తున్నవారితో సహా పేదలకు ఉచిత కరెంటు.. ఇలా ఒకటేమిటి, అమలు సాధ్యాసాధ్యాలను పట్టించుకోకుండా అన్ని పార్టీల నేతలూ హామీలను గుమ్మరించారు.
ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉంటూ, ఢిల్లీ బరిలో కత్తులు దూసుకుంటున్న ఆప్, కాంగ్రెస్‌ల వల్ల చివరికి కమలనాథులే లాభపడతారన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఆప్ నేతలను వెంటాడుతున్న అవినీతి ఆరోపణలు కూడా ఎన్నికల్లో ఆ పార్టీపై ప్రతికూల ప్రభావాన్ని చూపే ప్రమాదం లేకపోలేదు. బిజెపి విషయానికొస్తే, గతంతో పోలిస్తే ఢిల్లీలో ఆ పార్టీ బాగా పుంజుకున్న మాట వాస్తవం. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు పునరావృతమైన పక్షంలో కమలనాథుల విజయం నల్లేరుపై నడకేనని చెప్పవచ్చు. అయితే, కేజ్రీవాల్‌కు సరిసమానమైన నేత లేకపోవడం ఆ పార్టీకి పెద్ద లోటు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటూ గెలుచుకోలేకపోయిన కాంగ్రెస్ ఈసారి ఉనికి కోసం తాపత్రయపడుతోంది. అయినా ఉచిత హామీలు ఇవ్వడంలో మాత్రం వైరి పక్షాలకు ఏమాత్రం తీసిపోలేదు. ముల్లును ముల్లుతోనే తీయాలన్న నానుడి తరహాలో అవినీతి వ్యతిరేక పోరాటంతో వెలుగులోకి వచ్చి, అధికారాన్ని చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీపై అదే అవినీతి ముద్ర వేసి అధికారంనుంచి దింపేందుకు బిజెపి చేసిన ప్రచారం ఏమాత్రం ఫలించిందో చూడాలన్నా, తనతో సహా పలువురు పార్టీ నేతలను జైలుపాలు చేసి, అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కమలనాథులు కుట్రలు పన్నారన్న కేజ్రీవాల్ ప్రచారం ఎంతవరకూ పనిచేసిందో చూడాలన్నా ఈ నెల 8 వరకూ వేచి ఉండక తప్పదు మరి!