ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. అంతే జోరుగా నాయకుల ఆరోపణల స్థాయి, భాషా దిగజారింది. సరే, అది వేరే చర్చ. అదలా ఉంచితే, అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు, లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి జై కొడుతూ వస్తున్న ఢిల్లీ ఓటర్లు ఈసారి కూడా అదే వరవడిని కొనసాగిస్తారా? లేక అందుకు భిన్నంగా ఓటేస్తారా? అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవంక ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అంశాలపై వివిధ కోణాల్లో చర్చలు జరుగుతున్నాయి. విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందులోనూ ప్రధానంగా మూడు అంశాలు చర్చకు వస్తున్నాయి. అందులో మొదటిది ఆప్ అవినీతి, రెండవది ఉచిత వరాలు, మూడవది సామాజిక సమీకరణల (అంటే హిందుత్వ, కుల గణన) ప్రభావంపై ఇటు మీడియాలో, అటు రాజకీయ పార్టీలు, ప్రజల్లోనూ చర్చ జరుగుతోంది. మూడు ప్రధాన పార్టీలు, ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్), అలాగే బిజెపి, కాంగ్రెస్ ఉచిత వరాలు అందలం ఎక్కిస్తాయని కొంతలో కొంత ఆశపడుతున్నాయి. ముఖ్యంగా, అధికార ఆప్ వరసగా మూడు పర్యాయాలు తమను అధికార పీఠం ఎక్కించిన ఢిల్లీ ఓటర్లు తమ పదేళ్ళ ప్లస్ పాలనలో అమలు చేసిన సంక్షేమ (ఉచిత) పథకాలకు, కొత్తగా ప్రకటించిన తాజా ఉచిత వరాలకు ఓటేసి మరోమారు అధికార అప్పగిస్తారని ఆశపడుతోంది.
అలాగే, కాంగ్రెస్ కూడా ఆప్‌కు పోటీగా ఉచిత హామీలను కురిపించి ఓట్ల పంట పండించుకోవాలని చూస్తోంది. చివరకు, బిజెపి కూడా, నలుగురితో నారాయణ గుంపులో గోవింద అన్నట్లు, మేము సైతం.. అంటూ ఉచిత గళం ఎత్తుకుంది. అయితే, ఉచితం ఒక్కటి గట్టెక్కిస్తుందనే భరోసా లేకనో ఏమో, అన్ని పార్టీలు, ముఖ్యంగా ప్రధాన ప్రత్యర్ధులుగా భావిస్తున్న ఆప్, బిజెపి కొత్త కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇటు ఆప్, అటు బిజెపి నాయకులు అలవికాని హామీలతోపాటుగా, అదుపుతప్పి పరస్పర ఆరోపణలకు దిగుతున్నారు. చివరకు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బిజెపి పాలిత పొరుగు రాష్ట్రం హర్యానా ప్రభుత్వం ఢిల్లీకి వచ్చే యమునా నదీ జలాలో విషం కలిపిందని ఆరోపిచారు. నిజానికి ఇది చాలా తీవ్రమైన ఆరోపణ. ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం, ఒక మాజీ ముఖ్యమంత్రి ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణ చేస్తారని అనుకోలేం.అందుకే, ఈ ఆరోపణకు సంబంధించి ఆయన వద్ద ఏవైనా ఆధారాలు ఉంటే కోర్టుకు సమర్పించాలని హర్యానా హైకోర్టు ఆదేశించింది. నిజానికి, ఆయన వద్ద ఆధారాలు ఉంటే, ఆయన కేంద్ర ప్రభుత్వ దృష్టికి, కాదంటే సర్వోన్నత న్యాయస్థానం దృష్టికో తీసుకు వెళ్ళవలసినది. కానీ, ఆయన రాజకీయ ఆరోపణగా వినియోగించుకున్నారు. దీని బట్టి చూస్తే ఢిల్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాయో (ఏ స్థాయికి దిగజారుతున్నాయో అనలేమో) అర్థం చేసుకోవచ్చును. అంతేకాదు, రాజకీయ పార్టీల ఆలోచనలు ఎంతలా దిగాజారుతున్నాయో, ఎంతలా కలుషితం అవుతున్నాయో ఈ ఉదంతం మరో మారు ధ్రువీకరించింది.
అదొకటి అయితే అధికార ఆప్ అవినీతిని అటు బిజెపి, ఇటు కాంగ్రెస్ టార్గెట్ చేస్తున్నాయి. ముఖ్యంగా, లిక్కర్ కుంభకోణం మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుచేసి తమ కోసం నిర్మించుకున్న అధికార నివాసం శేషమహల్ లోపల దాగున్న వైభోగాలు, వాటికి తోడు మొహల్లా దవాఖానాలు, ఇతర ప్రజాపద్దులకు సంబంధించి కాగ్ నివేదిక ఎత్తిచూపిన అవకతవకలు, అక్రమాల లక్ష్యంగా ప్రతిపక్ష బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఆరోపణ అస్త్రాలను సంధిస్తున్నాయి. అయితే, ఈ ఆరోపణలను ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తున్నారు అనేది ఫిబ్రవరి 8 గానీ తెలియదు. అయితే అన్నా హజారే సారథ్యంలో జరిగిన అవినీతి వ్యతిరేక ఆందోళన ద్వారా రాజకీయ అవతార ఎత్తిన అరవింద్ కేజ్రీవాల్ కడుపున పురుడు పోసుకున్న ఆప్, పదేళ్ళ పైబడిన పాలనలో చోటుచేసుకున్న అవినీతి ఆరోపణలను ప్రజలు ఏ విధంగా తీసుకుంటున్నారు? అవినీతి ఆరోపణలు ఓటర్లను ఏ మేరకు ప్రభావితం చేస్తాయి? అనేది, ప్రస్తుతం వెయ్యి డాలర్ల ప్రశ్నగా పరిశీలకులు భావిస్తున్నారు.
అయితే, గత అనుభవాల ఆధారంగా చూస్తే మినహాయింపులు లేకుండా రాజకీయ వ్యవస్థ అంతటా వ్యాపించిన అవినీతిని ఓటర్లు అన్ని సందర్భాలో ఒకేలా చూస్తారని అనుకోలేం. అలాగే అవినీతి అంశం అందరినీ ఒకేలా ప్రభావితం చేస్తుందని అనుకోలేమని సెప్రాలజిస్టులు, రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అలాగే, హద్దులు దాటిన అవినీతిని, ముఖ్యంగా ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన పార్టీలు, నాయకుల అవినీతిని ప్రజలు అసలు అంగీకరించరని చరిత్ర చెపుతోంది. అందుకు తెలంగాణలో బిఆర్‌ఎస్ ఓటమి సహా చాలా చాలా ఉదాహరణలే ఉన్నాయి. అందుకే అవినీతి వ్యతిరేక పోరాటం ద్వారా పురుడుపోసుకున్న ఆప్ ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ ఓటర్లు చీపురు తిరగేస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వస్తున్న ఊహాగానాలు ఢిల్లీలోనే కాదు, దేశ వ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. ఢిల్లీ ఓటర్లు అవినీతికి ఓటేస్తారా? ఓడిస్తారా? అనే ప్రశ్న ప్రధానంగా వినవస్తోంది. అవినీతి ఆరోపణలకు భయపడవలసిన అవసరమే లేదని, ఇటు కాంగ్రెస్ నాయకులకు, అటు అధికార గణాలకు ఒక విధమైన భరోసా ఇచ్చారు.
ఇందిరమ్మ ఇచ్చిన భరోసా కారణంగానో ఏమో కాంగ్రెస్ నాయకులు (అందరూ కాదు) అదే బాటలో ఉత్సాహంగా ముందుకు సాగారు. ఆకాశమే హద్దుగా ఆస్తులు సంపాదించుకున్నారు. అవినీతి సౌధాలను నిర్మించుకున్నారు. ఇది రాజకీయ ప్రత్యర్ధులు చేసిన ఆరోపణ కాదు. సమయ సందర్భాలు వేరైనా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కర్ణాటక మాజీ స్పీకర్ కెఆర్ రమేష్ కుమార్ ‘గాంధీ, నెహ్రూల పుణ్యాన కాంగ్రెస్ నాయకులుగా మనం తరతరాలకు సరిపడా సంపదను కూడా బెట్టుకున్నామని బహిరంగంగానే అంగీకరించారు. అవును, మనీలాండరింగ్ ఆరోపణలపై తమ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించిన సమయంలో రమేష్ కుమార్, నెహ్రూ మొదలు సోనియా గాంధీ వరకు నాలుగు తరాల గాంధీ, నెహ్రూల పేరున మూడు నాలుగు తరాలకు సరిపడ సంపాదించుకున్నామని, అందుకు ప్రతిగా ఇప్పుడు సోనియా గాంధీకి అండగా నిలిచి రుణం తీర్చుకోవాలని కాంగ్రెస్ నాయకులకు పిలుపునిచ్చారు. అంటే, గాంధీ, -నెహ్రూల కుటుంబ అండదండలతో కాంగ్రెస్ నాయకులు కుబేరులు అయ్యారని కాంగ్రెస్ నాయకుడే అంగీరించారు. నిజానికి, రమేష్ కుమార్‌కు చాలా ముందుగా, కాంగ్రెస్ అగ్రనేత, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పాలనలో అవినీతి అందనంత ఎత్తుకు ఎదిగిపోయిందని ఆందోళన వ్యక్తపరిచారు.
పేద ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ప్రతి రూపాయిలో కేవలం 15 పైసలు, అంతకంటే తక్కువ మాత్రమే నిజమైన లబ్ధిదారులకు చేరుతోందని, మిగిలిన మొత్తం మధ్య దళారీలు/ కాంగ్రెస్ నాయకుల జేబుల్లోకి పోతోందని పార్టీ వేదిక నుంచే ప్రకటించారు. ఆఫ్ కోర్స్, రాజీవ్ గాంధీ చెప్పింది అక్షర సత్యం కాకపోవచ్చును. కానీ, కాంగ్రెస్ పార్టీ అవినీతికి పర్యాయపదంగా మారిపోయిందనే అభిప్రాయానికి బలాన్ని చేకూర్చింది. అలాగే, రాహుల్ గాంధీకి మిస్టర్ క్లీన్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. అయితే, ఆ తర్వాత కాలంలో బోఫోర్స్ కుంభకోణం వెలుగు చూసింది. రాజీవ్ గాంధీ మిస్టర్ క్లీన్ ఇమేజ్ మసకబారిపోయింది. రాజీవ్ గాంధీ వ్యక్తిగత ఇమేజ్‌తో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ కూడా మసకబారి పోయింది. 1984లో రాజీవ్ గాంధీ నేతృత్వంలో 404 సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ, ఐదేళ్ళ తర్వాత 1989లో అదే రాజీవ్ గాంధీ సారథ్యంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అందులో సగం సీట్లు కూడా గెలవలేదు. కేవలం 197 స్థానాలకే పరిమితం అయింది. ఒక విధంగా చూస్తే బోఫోర్స్ కుంభకోణం రాజీవ్ గాంధీ ‘క్లీన్ ఇమేజ్’ ని చెరిపేయడమే కాకుండా, కాంగ్రెస్ మళ్ళీ కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. ఇక ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్నికల్లోనూ సంపూర్ణ మెజారిటీ సాధించలేకపోయింది. అలాగే, 2004 నుంచి 2014 వరకు సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ సారథ్యంలో ఏర్పడిన ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పదేళ్ళ కాలంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంది.
పర్యవసానంగా కాంగ్రెస్ పార్టీ ఓటమి వెంట ఓటమిని ఎదుర్కొంటోంది. రాజీవ్ గాంధీ బోఫోర్సు కుంభకోణం కాంగ్రెస్ పార్టీని 200 సీట్లకు పరిమితం చేస్తే, సోనియా మన్మోహన్ ప్రభుత్వ అవినీతి చిట్టా, మూడంకెలకు దూరం చేసింది. వరసగా 2014, 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం వంద స్థానాలను గెలవలేకపోయింది. 2024 లో అనేక పార్టీలతో జట్టుకట్టి ‘ఇండియా’ కూటమిగా ఏర్పడిన కూడా కాంగ్రెస్ పార్టీ స్కోర్ వందకు ఒక్కటి తక్కువ దగ్గరే ఆగిపోయింది. అంతేకాదు, అరడజనుకు పైగా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యమే లేదు. ఒకటి రెండు రాష్ట్రాలు మినహా మరే రాష్ట్రంలోనూ హస్తం పార్టీ స్కోర్, ఐదు అంకెను చేరలేదు. అలాగే, రాష్ట్రాలలోనూ… మూడంటే మూడే రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుంది. అంటే రాజీవ్ గాంధీ బోఫోర్సు కుంభకోణం మొదలైన కాంగ్రెస్ పతన ప్రయాణం… సోనియా, మన్మోహన్ ఏలుబడిలో వెలుగు చూసిన అవినీతి భాగోతం మీదగా సాగుతోంది. సో… రేపటి ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ గెలుపు ఓటముల్లో ‘అవినీతి’ ఒక ప్రధాన కొలమానం కానుంది. అవినీతి వ్యతిరేక పోరాటం ద్వారా పురుడు పోసుకున్న పార్టీ చివరకు అవినీతి పరీక్షకు నిలవవలసి రావడం.. ‘ఆప్’ గెలుపు ఓటములను మించిన విషాదం.
రాజనాల బాలకృష్ణ, 9985229722
- Advertisement -