Wednesday, February 5, 2025

పంట భూముల్లోకి పరిశ్రమలు వస్తే..

- Advertisement -
- Advertisement -

పాలనా పగ్గాలు చేపట్టగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 2024లో దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో మొదటిసారిగా పాల్గొన్నారు. ఆ సందర్భంగా రాష్ట్రానికి రూ. 40 వేల కోట్లకు పైగా పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి. ఆగస్టు 2024లో అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలతో మరో రూ. 36 వేల కోట్ల ఒప్పందాలు జరిగాయి. దీంతో తొలి ఏడాదిలోనే రాష్ట్ర ప్రభుత్వం రూ. 76,232 కోట్ల మేర పెట్టుబడులను సాధించుకోగలిగింది. మరోసారి రాష్ట్రంలో విదేశీ పెట్టుబడుల యాత్రలో భాగంగా గత నెల ముఖ్యమంత్రి, తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంతో కలిసి సింగపూర్‌లో మూడు రోజులు పర్యటించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీలో అత్యాధునిక ఎఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుకు ఎస్టీ టెలీ మీడియా గ్లోబల్ డేటా సెంటర్‌తో రూ. 3,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదిరింది. దాదాపు రూ. 450 కోట్లతో నగరంలో భారీ ఐటి పార్కు ఏర్పాటుకు క్యాపిటల్యాండ్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. సింగపూర్ నుంచి సిఎం బృందం దావోస్ పర్యటన చేపట్టింది.

దావోస్‌లో ఈ నెల 20 నుండి నాలుగు రోజులపాటు సాగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బృందంతో పాల్గొన్నారు. 21వ తేదీన అక్కడి తెలంగాణ పెవిలియన్‌లో రూ. 15 వేల కోట్లతో వివిధ ప్రాజెక్టుల కోసం ఒప్పందాలు కుదిరాయి. 22న ఒకే రోజు రూ. 56300 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి. ఇందులో సన్ పెట్రో కెమికల్స్ అనే సంస్థ తెలంగాణలో రూ. 45 వేల కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చింది. చివరి రోజైన 23 నాడు ఏకంగా రూ. 91500 కోట్ల పరిశ్రమ స్థాపనకు ఒప్పందాలు జరిగాయి. ఇవే కాకుండా మరెన్నో విదేశీ కంపెనీలతో కూడా ఆ వేదికగా ఒప్పందాలపై సంతకాలు అయ్యాయి. ఇలా దావోస్ వేదికపై ఈసారి మొత్తం రూ.179 వేల కోట్ల పెట్టుబడుల రాకకు దారి పడింది. అదే వేదికపై నుండి పెట్టుబడుల ఆకర్షణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి ప్రమాణాల నగరంగా అభివృద్ధి చేస్తామని అంటున్నారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో హైద్రాబాద్‌ను కాలుష్యరహితంగా నెట్‌జీరో సిటీగా తీర్చిదిద్దుతామంటున్నారు. నగరంలో మౌలిక సదుపాయాలు, నైపుణ్య మానవ వనరులు, అనువైన వాతావరణం అన్ని ఉన్నాయని పెట్టుబడిదారులకు హామీ ఇస్తున్నారు. ఇలా వేల కోట్ల పెట్టుబడుల, ముఖ్యమంత్రి హామీల వార్తలు పత్రికల్లో చూస్తుంటే హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందుతోంది అని ఆనందం పడాలా లేక ఈ పరిశ్రమలన్నీ నగరం చుట్టూ విస్తరించాక రాబోయే విపత్తులు గుర్తొచ్చి బెంగపడాలా అనే సందిగ్ధం మొదలైంది. నిజంగా రేవంత్ రెడ్డి అంటున్నట్లుగా తెలంగాణ అంత సిద్ధంగా ఉందా? హైదరాబాద్‌లో పరిశ్రమలు వస్తే తెలంగాణ మొత్తం అభివృద్ధి చెందుతుందా? అసలు అభివృద్ధి అంటే ఏమిటి? అనే మౌలిక ప్రశ్నలకు సమాధానం కావాలి. ఈ పెట్టుబడుల ఒప్పందాల ద్వారా వచ్చే పరిశ్రమల స్థాపనకు ప్రధానంగా తెలంగాణ నేలపై వేల ఎకరాల స్థలం కావాలి. ప్రభుత్వం దగ్గర అంత భూమి ఉన్నదా?.. మరో ప్రధాన సమస్య కాలుష్యం.

పరిశ్రమల ద్వారా వచ్చే కాలుష్యం వల్ల చుట్టూ ఉన్న గ్రామాలు, పంట భూములకు రక్షణ ఎవరు కల్పిస్తారు?. రెండు నెలల క్రితం హైదరాబాద్ కు 130 కి.మీ. దూరంలో ఉన్న లగచర్ల అనే గ్రామం ఫార్మా విలేజీకి మా భూములు ఇచ్చేదిలేదని అధికారులకు ఎదురు తిరిగి వార్తల్లోకి ఎక్కింది. ఆ ప్రతిపాదనను రద్దు చేసిన ప్రభుత్వం మందుల కంపనీ కాదు వేరేవి పెడతామని భూసేకరణ కోసం కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. దేనికీ భూములు ఇవ్వమని ఆ గ్రామస్థులు కరాఖండిగా చెప్పేస్తున్నారు. వద్దంటున్నా ఆగకుండా ఇంత తొందరగా మరో ప్రకటన ఇచ్చి ప్రభుత్వం ఎందుకు తొందర పడుతుందో అర్థం కాదు. ప్రజల అంగీకారం లేకుండా భూసేకరణ చట్టబద్ధం కాదు.  భూసేకరణ కోసం గ్రామసభలో తీర్మానం కావాలి, అందులో 80% యజమానుల అంగీకారం ఉండాలని చట్టంలో ఉంది. భూమికి బదులు భూమి లేదా తగిన నష్టపరిహారం, ఇంటి స్థలం, కంపెనీలో ఉద్యోగం అనే ఆశలు చూపినా వీటిలో ఏది సక్రమంగా అమలు కావడం లేదు. భూమికి మార్కెట్ ధర చెల్లించలేదని కోర్టుల చుట్టూ తిరుగుతున్న గ్రామీణులు ఎందరో ఉన్నారు. పదేళ్ల క్రితం సాగు ప్రాజెక్టుల కోసం చేసిన భూసేకరణ చిక్కులే ఇంకా తేలలేదు. ఈ నేపథ్యంలో కొత్త పెట్టుబడుల ఒప్పందాలతో ఎన్ని గ్రామాలు, ఎన్ని ఎకరాల భూములు మాయమవుతాయో తెలియదు. ఓ లెక్కా పత్రం లేకుండా ముఖ్యమంత్రి అక్కడ ఒప్పందాలపై సంతకాలు పెడుతుంటే ఇక్కడ భూములు వణుకుతున్నాయి. పంట భూములన్నీ పరిశ్రమలకు కట్టబెట్టి రైతు కుటుంబాలను రోడ్డున పడేయడం అభివృద్ధి కాదు. ఆ పరిశ్రమల్లో కుటుంబానికి ఒక ఉద్యోగం ఇచ్చినా.. అదేదో వాచ్‌మన్ లాంటిదే ఉంటుంది. ఎందుకంటే ఆ పరిశ్రమలకు అవసరమయ్యే నైపుణ్యాలు గలవాళ్ళు ఆ కుటుంబాల్లో ఉండరు.

ప్రయివేట్ రంగానికి ఎప్పుడు తమ ప్రయోజనాలే ప్రధానం. ఎప్పుడూ ఇచ్చిన మాట నిలుపుకోదు. అనంతపురంలోని కియా కార్ల ఫ్యాక్టరీ భూములు కోల్పోయిన వారికి పనులీయకుండా ఇప్పటికీ తిప్పుకుంటున్న వార్తలు వస్తున్నాయి. మరి ముఖ్యంగా కంపెనీ ఉద్యోగాల విషయానికొస్తే ఉద్యోగ భద్రత అసలే ఉండదు. పని గంటలు వారిష్టమే. మన కార్మిక చట్టాలు, ఉద్యోగ సంఘాలు అక్కడ చెల్లవు. కంపెనీ ఉద్యోగం అనగానే సంబరపడేంత సీనేమీ అక్కడ లేదు. ఒకప్పుడు నగరం చుట్టూ పళ్ళతోటలు, కూరగాయల, పూలసాగు ఉండేది. ఇప్పుడు వందల కి.మీ. దూరం నుండి అవి నగరానికి వస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ చుట్టూ ఉన్న ఎన్నో గ్రామాల వ్యవసాయ భూములు ఐటి పరిశ్రమలకు ధారాదత్తం అయ్యాయి. వాటి వల్ల గ్రామీణులకు దక్కింది కూలి బతుకే. ఆ రోజుల్లో లక్షలకే మురిసిపోయి కోల్పోయినవారి భూములు ఇప్పుడు కోట్ల ధరలు పలుకుతున్నాయి. గ్రామీణులు రెంటికీ చెడ్డారు. అందుకోసం పారిశ్రామిక అభివృద్ధి ఏ మేరకు జరగాలి, సాగు భూముల పరిస్థితి ఏమిటి, ఈ ఒప్పందాల వల్ల సామాన్యుడికి ఒరిగేదేమిటి అనే అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి.

బి. నర్సన్, 9440128169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News