Thursday, February 6, 2025

బేడీలతో అక్రమ వలసదారుల తరలింపు శోచనీయం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అమెరికా నుంచి ‘బేడీలతో, అవమానకరరీతిలో భారతీయులను తరలిస్తున్న దృశ్యాలు’ విచారం కలిగించాయని కాంగ్రెస్ బుధవారం వ్యాఖ్యానించింది. 2013లో భారత దౌత్యవేత్త దేవయాని ఖొబ్రగడే పట్ల వ్యవహరించిన తీరుకు అప్పటి యుపిఎ ప్రభుత్వం తీవ్రంగా స్పందించిన తరువాత అమెరికా విచారం వెలిబుచ్చవలసి వచ్చిందని కాంగ్రెస్ గుర్తు చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌లో తన రెండవ హయాంలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపిన తరువాత భారత వలసవాదుల మొదటి బృందంతో యుఎస్ సైనిక రవాణా విమానం బుధవారం అమృత్‌సర్‌లో దిగిన విషయం విదితమే. యుఎస్ నుంచి తిరిగి పంపుతున్నప్పుడు భారతీయులకు బేడీలు వేసిన, అవమానించిన దృశ్యాలు ఒక
భారతీయునిగా నన్ను కలచివేశాయి’ అని కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం అధిపతి పవన్ ఖేరా ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలిపారు.

‘2013 డిసెంబర్‌లో అమెరికాలో ఒక భారతీయ దౌత్యవేత్త దేవయాని ఖొబ్రగడేకు బేడీలు వేసి, మొత్తం సోదా చేసినట్లు నాకు గుర్తు. విదేశాంగ శాఖ కార్యదర్శి సుజాతా సింగ్ అమెరికా రాయబారి నాన్సీ పోవెల్‌కు తీవ్ర నిరసన తెలియజేశారు’ అని ఖేరా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘యుపిఎ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. మీరా కుమార్, సుశీల్ కుమార్ షిండే, రాహుల్ గాంధీ వంటి నేతలు ఆ సమయంలో భారత్‌లో పర్యటిస్తున్న యుఎస్ కాంగ్రెస్ ప్రతినిధివర్గం (జార్జి హోల్డింగ్, పీట్ ఓల్సన్, డేవిడ్ ష్వెకెర్ఠ్, రాబ్ వుడాల్, మేడ్లైన్ బోర్డాల్లో)ను కలుసుకోవడానికి నిరాకరించారు’ అని ఆయన జ్ఞాపకం చేశారు.అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ యుఎస్ చర్యను ‘గర్హనీయం’గా పేర్కొన్నారని ఖేరా తెలియజేశారు.

యుఎస్ రాయబార కార్యాలయం సిబ్బంది రాయితీ ధరలకు ఆహారం, ఆల్కహాల్ దిగుమతులు సహా ఆ కార్యాలయానికి ఇచ్చిన అనేక భత్యాలను భారత్ ఉపసంహరించింది. అమెరికన్ ఎంబసీ స్కూల్‌పై ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు ప్రారంభించిందని ఖేరా తెలిపారు. ‘దేవయాని ఖొబ్రగడే పట్ల వ్యవహరించిన తీరుకు జాన్ కెర్రీ విచారం వెలిబుచ్చారు. యుఎస్‌ఎ విచారాన్ని తెలియజేయడానికి విదేశాంగ శాఖ కార్యదర్శి సుజాతా సింగ్‌ను యుఎస్ ప్రభుత్వం పిలిపించింది’ అని ఖేరా వివరించారు. 1999 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారి ఖొబ్రగడేను వీసా మోసం అభియోగాలపై న్యూయార్క్‌లో అరెస్టు చేశారు. ఇది రెండు దేశాల మధ్య వివాదానికి దారి తీసింది. భారత్ ప్రతీకారంగా కొన్ని కేటగరీల యుఎస్ దౌత్యాధికారులకు సౌకర్యాలను తగ్గించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News