Thursday, February 6, 2025

ఢిల్లీలో 57.70 శాతం పోలింగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బుధవారం సాయంత్రం 5 గంటల వరకు 57.70 శాతం వోట్లు పోలైనట్లు అధికార గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఢిల్లీలోని మొత్తం 70 నియోజకవర్గాల్లో పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలైంది. సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం, సాయంత్రం 5 గంటల వరకు 57.70 శాతం మంది వోటర్లు తమ వోటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీలో అర్హులైన వోటర్లు సుమార కోటి 56 లక్షల మంది ఉన్నారు. అత్యధికంగా ఈశాన్య జిల్లాలో 63.83 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా న్యూఢిల్లీ జిల్లాలో 54.37 శాతం నమోదైంది. ఇతర నియోజకవర్గాల్లో ముస్తఫాబాద్‌లో అత్యధికంగా 66.68 శాతం, కరోల్ బాగ్‌లో అత్యల్పంగా 47.40 శాతం నమోదైంది.

షాహ్‌దారాలో 61.35 శాతం, నైరుతి ఢిల్లీలో 58.05 శాతం, ఉత్తర ఢిల్లీలో 57.24 శాతం, మధ్య ఢిల్లీలో 55.24 శాతం, ఆగ్నేయ ఢిల్లీలో 53.77 శాతం వోట్లు పోలయ్యాయని ఇసి డేటా తెలియజేసింది. ఢిల్లీలోని 70 నియోజకవర్గాల్లో 13766 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం అభ్యర్థుల సంఖ్య 699. క్రితం సారి 2020లో నిర్వహించిన ఎన్నికల్లో ఢిల్లీలో 62.59 శాతం మంది వోటర్లు తమ వోటు హక్కు వినియోగించుకున్నారు. అయితే, 2024 లోక్‌సభ ఎన్నికల్లో 56 శాతం మంది మాత్రమే వోట్లు వేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, కేంద్ర మంత్రులు ఎస్ జైశంకర్, హర్దీప్ సింగ్ పురి, కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ, ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ ఉదయమే వోటు వేసినవారిలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News