Thursday, February 6, 2025

గాజాను స్వాధీనం చేసుకుంటాం : ట్రంప్ సంచలన ప్రకటన

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో భేటీ అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ , గాజా యుద్ధం నేపథ్యంలో తాజా పరిస్థితిపై నెతన్యాహుతో ట్రంప్ చర్చించారు. ‘ గాజాను అమెరికా స్వాధీనం చేసుకుంటుంది. అక్కడ ధ్వంసమైన భవనాలను పునరుద్ధరిస్తాం. ఆ ప్రాంతాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తే , అక్కడి ప్రజలకు అపరిమిత సంఖ్యలో ఉద్యోగాలు కల్పించవచ్చు. ఇళ్లు నిర్మించవచ్చు. ” అని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ ప్రకటన చరిత్రను మారుస్తుందని నెతన్యాహు అభిప్రాయపడ్డారు. గాజాలో ఉద్రిక్తతల కారణంగా నిరాశ్రయులుగా మారిన పాలస్తీనీయులకు అరబ్ దేశాలు ఆశ్రయం కల్పించాలని ఇటీవల ట్రంప్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ ప్రతిపాదనను ఆయా దేశాలు ఖండించాయి. అలా చేస్తే తమ ప్రాంతం లోని స్థిరత్వం దెబ్బతింటుందని ఈజిప్టు, జోర్డాన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, పాలస్తీనా అథారిటీ, అరబ్ లీగ్‌లు సంయుక్తంగా ప్రకటన చేశాయి. ఈ క్రమం లోనే గాజాను స్వాధీనం చేసుకొని అభివృద్ధి చేస్తామని ట్రంప్ ప్రకటించడం గమనార్హం. ఖండించిన హమాస్ గాజాను స్వాధీనం చేసుకుంటానంటూ ట్రంప్ ప్రకటించడాన్ని హమాస్ ఖండించింది. ఆయన గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని, మిలిటెంట్ సంస్థకు చెందిన ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. మా ప్రజలు దీన్ని ఆమోదించరు. వారి భూమి నుంచి వారిని తరలించడమే కాకుండా , ఈ దురాక్రమణను అడ్డుకోవాల్సి ఉందని సమీఅబు జుహ్రీ ఓ ప్రకటనలో తెలిపారు.

గాజాలో నిర్దేశించుకున్న మూడు లక్షాలు ఇవే : నెతన్యాహు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ హమాస్‌తో పోరాటం తర్వాత ఇజ్రాయెల్ మరింత బలంగా మారిందన్నారు. చర్చల్లో భాగంగా యుద్ధాన్ని ముగించి, తమ దేశంలో శాంతిని నెలకొల్పడానికి ప్రజలకు సురక్షిత భవిష్యత్తును అందించడానికి తాము మూడు ముఖ్యమైన లక్షాలను నిర్దేశించుకున్నామని అన్నారు. అవి 1 . బందీలందరినీ విడుదల చేయడం 2.హమాస్ సైన్యాన్ని నాశనం చేయడం 3 . ఇజ్రాయెల్‌కు గాజా మరోసారి ముప్పు కలిగించకుండా చూసుకోవడం. ట్రంప్ తన పరిధిని దాటి యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, ఇజ్రాయెల్ తమ లక్షాన్ని చేరుకోడానికి అవి ఎంతో ఉపయోగ పడతాయన్నారు. అమెరికాకు ఇప్పటివరకు ఉన్న అధ్యక్షుల్లో ట్రంప్ తనకు గొప్ప మిత్రుడని కొనియాడారు. అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతర ం వైట్‌హౌస్‌కు మొదటి విదేశీ నేతగా తనను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఇరు దేశాల మధ్య స్నేహానికి నిదర్శనమని పేర్కొన్నారు. అందుకే తమ దేశ ప్రజలు ట్రంప్‌ను ఎంతగానో గౌరవిస్తారని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News