Thursday, February 6, 2025

ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా..

- Advertisement -
- Advertisement -

నాగ్‌పూర్: భారత్‌ ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు గురువారం తెరలేవనుంది. త్వరలో జరిగే ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా ఈ సిరీస్‌ను అభివర్ణిస్తున్నారు. ఇటు భారత్ అటు ఇంగ్లండ్‌కు ఇది కీలకంగా మారింది. రానున్న మెగా టోర్నీకి ముందు లోపాలను సరిదిద్దుకునేందుకు దీన్ని ఉపయోగించుకోవాలనే పట్టుదలతో ఇరు జట్లు ఉన్నాయి. ఇటీవల ముగిసిన ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో టీమిండియా 41తో సొంతం చేసుకుంది. అయితే ఇందులో ఆడిన చాలా మంది ఆటగాళ్లు వన్డే టీమ్‌లో లేరు.

దీనికి భిన్నంగా ఇంగ్లండ్ టీమ్‌లో టి సిరీస్ ఆడిన ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. మాజీ కెప్టెన్ జో రూట్ 15 నెలల సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారి వన్డేల్లో ఆడనున్నాడు. కీలక ఆటగాడు జో రూట్ చేరికతో ఇంగ్లండ్ మరింత బలోపేతంగా మారింది. భారత్‌కు కూడా సిరీస్ సవాల్‌గా మారింది. కొంతకాలంగా భారత సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ తదితరులు వరుస వైఫల్యాలు చవిచూస్తున్నారు. ఇటీవల వీరు రంజీ ట్రోఫీలో ఆడినా పెద్దగా ప్రభావం చూపలేక పోయారు. ఇలాంటి స్థితిలో వీరు వన్డేల్లో ఎలా ఆడతారనేది ఆసక్తిగా మారింది. ఇరు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో సిరీస్‌లో హోరాహోరీ ఖాయమనే చెప్పాలి.

రోహిత్, కోహ్లీలకు పరీక్ష

ఇటీవల కాలంలో వరుస వైఫల్యాలు చవిచూస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ సారధి విరాట్ కోహ్లిలకు సిరీస్ పరీగా తయారైంది. రానున్న ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో వీరిద్దరూ ఫామ్‌ను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. వీరు గాడిలో పడితేనే మెగా టోర్నమెంట్‌లో భారత్‌కు గెలుపు అవకాశాలు అధికంగా ఉంటాయి. రోహిత్ కూడా సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నాడు. కోహ్లి కూడా మెరుపులు మెరిపించేందుకు సిద్ధమయ్యాడు. వన్డేల్లో అసాధారణ రికార్డులు కలిగిన వీరిద్దరూ తమ మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే టీమిండియా బ్యాటింగ్ సమస్య చాలా వరకు తీరిపోతోంది. ఇక యువ సంచలనం యశస్వి జైస్వాల్ కూడా తన మార్క్‌తో బ్యాటింగ్‌ను కనబరచాలనే పట్టుదలతో ఉన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ పలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన యశస్వి జట్టుకు కీలకంగా మారాడు. మరోవైపు వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన శుభ్‌మన్ గిల్‌పై కూడా జట్టు భారీ ఆశలు పెట్టుకుంది.

గిల్ కూడా బ్యాట్‌ను ఝులిపించాల్సి ఉంది. గిల్ ఇటీవల కాలంలో ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నాడు. కానీ అతనిపై జట్టు భారీ ఆశలతో ఉంది. శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య, కెఎల్ రాహుల్ తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, హర్షిత్ రాణా, జడేజా, కుల్దీప్ యాదవ్, అక్షర్, సుందర్, వరుణ్ చక్రవర్తి వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా జట్టులో ఉన్నారు. ఇటీవల ముగిసిన టి20 సిరీస్‌లో వరుణ్ చక్రవర్తి అసాధారణ బౌలింగ్‌తో అలరించిన సంగతి తెలిసిందే. దీంతో అతనికి అనూహ్యంగా వన్డే జట్టులోనూ చోటు దక్కింది.

తక్కువ అంచనా వేయలేం..

ఇక ఇంగ్లండ్ కూడా సిరీస్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు బలంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. తొలి వన్డే కోసం ఇంగ్లండ్ ఇప్పటికే తుది జట్టును ప్రకటించింది. అందరి కళ్లు కెప్టెన్ బట్లర్‌పైనే నిలిచాయి. అతనితో పాటు స్టార్ ఆటగాడు జో రూట్ కూడా జట్టుకు కీలకంగా మారాడు. కొంతకాలంగా రూట్ టెస్టుల్లో అద్భుత బ్యాటింగ్‌ను కనబరుస్తున్న సంగతి తెలిసిందే. వన్డేల్లోనూ చెలరేగాలనే పట్టుదలతో ఉన్నాడు. బౌలింగ్‌లో కూడా సమతూకంగా కనిపిస్తోంది. జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, కార్స్, సాఖిబ్ మహమూద్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టులో ఉన్నారు. దీంతో ఇంగ్లండ్‌కు కూడా గెలుపు అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News