ఐసిసి ర్యాంకింగ్స్
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన ఐసిసి ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లు సత్తా చాటారు. పురుషుల టి20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ సంచలనం అభిషేక్ శర్మ ఏకంగా రెండో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో అభిషేక్ అద్భుతంగా రాణించాడు. దీంతో తాజా ర్యాంకింగ్స్‌లో ఏకంగా 38 స్థానాలు ఎగబాకి రెండో ర్యాంక్‌ను దూసుకెళ్లాడు. ప్రస్తుతం అభిషేక్ 829 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇక అభిషేక్ సన్‌రైజర్స్ సహచరుడు, ఆస్ట్రేలియా స్టార్ ట్రావిస్ హెడ్ అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. హెడ్ 855 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.
ఇక భారత యువ ఆటగాడు, హైదరాబాదీ స్టార్ తిలక్‌వర్మ మూడో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో తిలక్ వర్మ అత్యంత నిలకడైన బ్యాటింగ్‌ను కనబరిచిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ నాలుగో, టీమిండియా టి20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఐదో ర్యాంక్‌ను దక్కించుకున్నారు. బౌలింగ్ విభాగంలో భారత స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మూడో ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో వరుణ్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. పలు మ్యాచుల్లో భారత్‌కు ఒంటిచేత్తో విజయం సాధించి పెట్టాడు.
అంతేగాక ప్రతిష్ఠాత్మకమైన ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డును సయితం దక్కించుకున్నాడు. తాజాగా ఐసిసి బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో మూడో ర్యాంక్‌ను దక్కించుకుని సత్తా చాటాడు. ఇంతకుముందు వరుణ్ ఆరో ర్యాంక్‌లో కొనసాగాడు. విండీస్ బౌలర్ అకీల్ హుస్సేన్ (707) పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్) రెండో ర్యాంక్‌లో నిలిచాడు. భారత బౌలర్ రవి బిష్ణోయ్ నాలుగు ర్యాంక్‌లు మెరుగుపరుచుకుని ఆరో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక టెస్టు బౌలింగ్ విభాగంలో భారత స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు.