భారత దేశం అనాదిగా నిచ్చెనమెట్ల కులవ్యవస్థలో కూరుకుపోయినది. ఇందులో షెడ్యూల్డ్ కులాలను అట్టడుగు స్థాయిలో ఉంచారు. వీరంతా వేల సంవత్సరాలనుంచి సామాజిక హక్కులు నిరాకరించబడి అస్పృశ్యత, అంటరానితనాన్ని అనుభవించారు. వీరి ఉన్నతకై డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆనాడు రాజ్యాంగంలో15 శాతం రిజర్వేషన్లు కల్పించారు. షెడ్యూల్డ్ కులాల్లో (ఎస్‌సి)59 ఉపకులాలు ఉన్నాయి. అయితే ఇందులో ప్రధానంగా ఉన్న కులాలు మాదిగ, మాలలు. వీరిలో జనాభాపరంగా అత్యధికంగా ఉండి వెనుకబడ్డ కులం మాదిగ వర్గం. మాదిగ కులాన్ని వివిధ రాష్ట్రాల్లో పలు రకాల పేర్లతో పిలుస్తారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మాలలతో పోలిస్తే మాదిగ జనాభా అధికం. మెజారిటీ జనాభా గల మాదిగ కులానికి రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లలో తగిన వాటా దక్కకపోవడమే దీనికి కారణంగా చెప్పవచ్చు.
ఈ విషయాన్నీ పలు కమిషన్లు కూడా చెప్పాయి. వీరి మధ్య అసమానతల నేపథ్యంలో మాల, మాదిగల మధ్య వైరుద్యం పెరిగింది. మంద కృష్ణ మాదిగ, కొందరు మాదిగ మేధావుల నేతృత్వంలో 1994న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడింది. దీని ఆధ్వర్యంలో ఎస్‌సి రిజర్వేషన్ వర్గీకరణ ఉద్యమం మొదలైంది. దీంతో అనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1996లో వర్గీకరణ అంశంపై జస్టిస్ పి.రామచంద్రరాజు కమిషన్ నియమించారు. ఈ కమిషన్ షెడ్యూల్డ్ కులాల్ని వెనకబాటుతనం ఆధారంగా ఎ, బి, సి, డిలుగా వర్గీకరణ చేయాలనీ సిఫార్సు చేసింది. ఎస్‌సి రిజర్వేషన్ వర్గీకరణను విద్య, ఉద్యోగాల్లో వర్తింపచేయాలని సూచించింది. ఈ కమిషన్ నివేదిక మేరకు 2000 నుంచి అమలు పరిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌సి ఉప వర్గీకరణను సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో 2004లో కొట్టివేశారు. దీంతో మాదిగ ఉప కులాలు నిరసన వ్యక్తం చేసి, వర్గీకరణ చట్టబద్ధతకై కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు.
ఈ నేపథ్యంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం 2007లో ఉషా మెహ్ర కమిషన్‌ను నియమించినది. ఈ కమిషన్ కూడా రిజర్వేషన్ల వర్గీకరణ అవసరమని నొక్కి చెప్పింది. కానీ ప్రభుత్వాలు ఓట్ల రాజకీయం కోసం ఇన్నాళ్లు దాటవేశారు. ఇటీవల స్టేట్ ఆఫ్ పంజాబ్ అండ్ అదర్స్ vs దేవీందర్ సింగ్ కేసులో గతంలోని తీర్పును పునః సమీక్షించి ఆగస్టు 1, 2024న ఎస్‌సి వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చని తీర్పునిచ్చింది. ఈ తీర్పు 20 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. సుప్రీం కోర్టు తీర్పులో ఎస్‌సి కులాల్లో ఎక్కువ, తక్కువలున్నాయని చెప్పింది. సామాజిక, ఆర్థిక స్థితిగతుల గణాంకాలు సేకరించి, వాటి ఆధారంగా ఉపవర్గీకరణ చేయాలనీ స్పష్టం చేసింది. వాస్తవంగా మాలలు ఎక్కువ ఆంధ్రలో ఉన్నారు. చారిత్రకంగా బ్రిటిష్ పరిపాలనలో ఉన్న ఆంధ్రలో వీరు విద్య, ఉద్యోగ అవకాశాలను అందిపుచుకున్నారు. నైజాం పరిపాలనలో ఉన్న మాదిగలు మాత్రం చర్మకార వృత్తికే పరిమితమై వెనుకబడ్డారు. ఇప్పటికీ వీరు గ్రామాల్లో పారిశుద్ధ్య వృత్తిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మాదిగలు కన్నా తక్కువ ఉన్న మాలల రిజర్వేషన్‌లలో మెజారిటీ వాటాను కోరుకోవడం ఎంత వరకు సబబు? సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సైతం అసెంబ్లీలో వర్గీకరణను అమలు చేస్తామనీ ప్రకటించారు. ఎస్‌సి వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పును అధ్యయనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిటీని నియమించింది.
ఈ కమిటీ వర్గీకరణ కోసం ఏకసభ్య కమిషన్‌ను నియమించాలని సూచించడంతో ఎస్‌సి వర్గీకరణపై సమగ్ర అధ్యయనం కోసం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. ఈ నివేదికను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. దీన్ని కేబినెట్ ఆమోదించడంతో అసెంబ్లీలో చర్చ జరిగింది. షమీమ్ అక్తర్ కమిషన్ నివేదిక ప్రకారం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎస్‌సిలు 52.5 లక్షలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో మాదిగలు 33 లక్షల కాగా, మాలలు 19 లక్షలు ఉన్నట్లు తెలుస్తుంది. కానీ వీరు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో వెనుకబడ్డారు. ప్రస్తుతం ఎస్‌సిలోని జనాభా ప్రాతిపదికన మాదిగలకు 10%, మాలలకు 4%, మిగతా ఉప కులాలకు ఒక శాతం కేటాయించాలని మాదిగ ఉపకులాలు ప్రతిపాదించాయి. ఎస్‌సి వర్గీకరణ కమిషన్ ఎస్‌సిలను మూడు గ్రూపులుగా విభజించారు. గ్రూపు -1 లో మొత్తం కులాలు 15 వీరికి రిజర్వేషన్ 1 శాతం, గ్రూపు- 2 లో మొత్తం కులాలు 18 వీరికి రిజర్వేషన్ 9 శాతం, గ్రూపు- 3 లో మొత్తం కులాలు 26 వీరికి రిజర్వేషన్ 5 శాతం కేటాయించారు.
గ్రూపు -1 లో సంచార జాతులు, గ్రూపు- 2 లో మాదిగ ఉపకులాలు, గ్రూపు- 3 లో మాల ఉపకులాలు ఉన్నట్టు కమిషన్ తెలుస్తోంది. ఆ దిశగా వర్గీకరణను అమలు చేయడం ఆహ్వానించదగ్గ విషయం. ఎస్‌సి రిజర్వేషన్ వర్గీకరణతోనే దళితుల్లో సామాజిక న్యాయం సాధ్యం కాదు. దీన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలి. అన్ని రంగాలలో వీరిని ముందుకు తీసుకువెళ్లాలి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన ఎస్‌సి వర్గీకరణను విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయాల్లో కూడా వీరికి ప్రాధాన్యం దక్కాలి. ప్రభుత్వ పథకాలలో, కార్పొరేషన్ లోన్లలో కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. జనాభా దామాషా, వెనుకబాటు ఆధారంగా జరుగుతున్న ఈ ఎస్‌సి వర్గీకరణను రాజకీయాల్లో కూడా దక్కాలి.
అప్పుడే సామాజిక న్యాయం చేకూరుతుంది. ప్రైవేటీకరణ పేరుతో రిజర్వేషన్లకు రోజురోజుకు గండిపడుతుంది. ఈ క్రమంలో రిజర్వేషన్ ఈ ఉపయోగం కూడా తగ్గిపోతా వున్నది. ఈ క్రమంలో ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఎస్‌సిలకు రిజర్వేషన్ శాతాన్ని కూడా పెంచాలి. అప్పుడే వారి సాధికారిక చర్యలు జరుగుతాయి. మరోవైపు వర్గీకరణ పోరుతో రాష్ట్రం లో మాల, మాదిగల మధ్య విమర్శలు కూడా తీవ్ర స్థాయికి చేరాయి. దీంతో ఈ రెండు కులాల మధ్య వైషమ్యాలు మరింత పెరిగిపోయాయి. రాజకీయ చైతన్యం కలిగి, రాజకీయాల్ని ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉన్న ఈ కులాలు విమర్శలు చేసుకోవడం ప్రమాదకరం. దీంతో దళిత చైతన్యం, విముక్తి పోరాటం నీరుగారిపోతుంది. ఈ అసంఘటితత్వం వలన బహుజన రాజ్యాధికార కల నెరవేరదు.
సంపతి రమేష్ మహారాజ్
9959556367