Thursday, February 6, 2025

ఆగని ఆకలి కేకలు

- Advertisement -
- Advertisement -

ప్రపంచ ఆహార దినోత్సవ సందర్భంగా 15 -అక్టోబర్, -2024న ప్రచురించిన ఆక్స్‌ఫామ్ కొత్త నివేదిక ప్రపంచ దేశాల్లో కరువు, ఆహార కొరత, యుద్ధ ఘర్షణల వల్ల సంభవించిన ఆకలి మరణాల గురించిన వివరాలు తెలియచేసింది. దాని నివేదిక ప్రకారం వెనకబడిన దేశాల్లో ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఆకలి మరణాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ దేశాల సహజ సంపదలను సామ్రాజ్యవాదులు, బహుళ జాతి సంస్థలు దోచుకుపోవటమే అందుకు కారణంగా ఉంది. 2024-25 లో ప్రపంచంలో ఆకలి వివరాలు ప్రకారం ప్రతి రోజు 73 కోట్ల, 30 లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నారు.

280 కోట్ల మంది ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారం పొందలేకపోతున్నారు. వీరు ప్రపంచ జనాభాలో 35 శాతంగా ఉన్నారు. తక్కువ ఆదాయ దేశాల్లో 71.5% మంది ప్రజలకు పుష్టికరమైన ఆహారం అందటం లేదు. అధిక ఆదాయ దేశాల్లో వీరి సంఖ్య 6.3 శాతం మాత్రమే. 2024లో గ్లోబల్ హ్యాంగర్ ఇండెక్స్ ప్రకారం 36 దేశాల్లో ఆకలి రేటు తీవ్ర స్థాయిలో ఉంది. పిల్లల మరణాలలో సగం పోషకాహార లోపం కారణంగా ఉంది. ప్రతి సంవత్సరం 90 లక్షల మంది పిల్లలు ఆకలి సంబంధిత కారణాలతో మరణిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది 5 సంవత్సరాల లోపు పిల్లలే.

అనేక దేశాల్లో ఆకలి మరణాలు పెరుగుతూ ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నాలుగు సెకన్లకు ఒకరు ఆకలితో మరణిస్తున్నారు. 2021లో ఆహార సంక్షోభంలో 15.5 కోట్ల మంది చిక్కుకున్నారు. తినటానికి తిండిలేక, ఆకలికి తట్టుకోలేక ప్రతి నిమిషం 11 మంది చనిపోయారు. కరోనా వైరస్ కంటే అత్యంత ప్రమాదకరంగా ఆకలి బాధ ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్నది. 2020లో కరవు పరిస్థితులు ఎదుర్కొన్న వారి సంఖ్య కంటే నేడు ఆరు రెట్లు పెరిగిందని ఆక్స్‌ఫామ్ నివేదిక వెల్లడించింది. కరోనా సంక్షోభం, ఆర్థిక పతనం, ప్రకృతి వైపరీత్యాలు కలిపి 5 లక్షల 20 వేల మందికి పైగా ప్రజల ఆకలి చావులకు కారణమైందని ఆక్స్‌ఫామ్ నివేదిక తెలిపింది. ప్రజలు ఆకలి చావుల బారినపడుతున్నా, ఇదే సమయంలో ప్రపంచ సైనిక వ్యయం 51 బిలియన్ డాలర్లకు పెరిగిందని పేర్కొంది.

2022 ఏప్రిల్‌లో ఆక్స్‌ఫామ్ ఫస్ట్ క్రైసిస్, ఆ తర్వాత విపత్తు అనే నివేదికను ప్రచురించింది. కోవిడ్ వల్ల పెరుగుతున్న ప్రపంచ అసమానతల కారణంగా 50 లక్షల మందికి పైగా ప్రజలు తీవ్ర పేదరికంలో కూరుకుపోయారు. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆహార ధరలు పెరిగాయి. ఇది ప్రజలపై తీవ్ర ప్రభావం చూపింది. ఇదే సమయంలో 2019 నుండి ప్రపంచంలోని 12 వందల అతిపెద్ద కంపెనీల ఆస్తులు 56% పెరిగాయి.

ఆఫ్రికాలోని కొన్ని దేశాలు, ప్రాంతాలు తీవ్రమైన కరువు, ఆకలి సమస్యను ఎదుర్కొంటున్నాయి. కెన్యా, నైజీరియా, ఇథియోపియా, సోమాలియా తదితర ఆఫ్రికా దేశాల అంతటా 40 ఏళ్లలో చూడని అత్యంత ఘోరమైన ఆహార సంక్షోభంలో ఉన్నాయి. కుటుంబాలు ఆహారం కోసం వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను వదలలేక వదలి వలసపోతున్నారు. పిల్లలను పాఠశాలలకు పంపకుండా కుటుంబ అవసరాల రీత్యా పనులకు పంపుతున్నారు లేదా భిక్షాటన చేయిస్తున్నారు. పాలకుల ప్రజా వ్యతిరేక విధానాల వలన సంపద కొద్ది మంది వద్ద పోగుపడటం, పేదరికం పెరగటం, సంవత్సరాల తరబడి వర్షాభావ పరిస్థితులు, పంటలు విఫలం కావటం, పశువులు చనిపోవటం, ఆఫ్రికాలో కరువు, ఆహార సమస్య ఆకలి మరణాలకు కారణం అయ్యాయి.
ఆఫ్రికాలో 1.4 (100 కోట్ల, 40 లక్షలు) బిలియన్లకు పైగా ప్రజలు ఉన్నారు. వీరిలో 22 కోట్ల, 60 లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నారు. ప్రపంచంలోని 30 పేద దేశాల్లో 27 దేశాలు ఆఫ్రికాలోనే ఉన్నాయి.

ఆఫ్రికాలో అత్యంత పేదరికం, ఆకలితో ప్రభావితమైన దేశాలు సహారాకు దక్షిణాన ఉన్నాయి. ఇక్కడ ప్రతి నలుగురిలో ఒకరు ఆకలితో అలమటిస్తున్నారు. ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్లుఎఫ్‌పి) గుర్తించిన 10 దేశాల్లో అత్యధిక సంఖ్యలో ప్రజలు ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారు. ఇందులో 5 దేశాలు ఆఫ్రికాలోనే ఉన్నాయి. 2022 గ్లోబల్ హ్యాంగర్ ఇండెక్స్ ప్రకారం తీవ్రమైన కరువు ఉన్న 54 దేశాల్లో 37 దేశాలు ఆఫ్రికాలోనే ఉన్నాయి. మధ్య, దక్షిణ ఆఫ్రికాలోని 12 దేశాల్లో 45.5 మిలియన్ల ప్రజలు, తూర్పు ఆఫ్రికాలోని 9 దేశాల్లో 43 6 మిలియన్ల ప్రజలు, పశ్చిమ ఆఫ్రికా, సాహెల్‌లోని 16 దేశాల్లో 30.4 మిలియన్ల ప్రజలు కరవు పరిస్థితుల్లో ఉన్నారు. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, చాడ్, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, మడగాస్కర్ దేశాలు ప్రపంచ ఆరోగ్య సర్వే ప్రకారం ఆందోళన కరమైన ఆకలి స్థాయిలో ఉన్నాయి. నైజీరియాలో 24.5 మిలియన్ల మందికి తినటానికి సరిపడా ఆహారం లేదు. కెన్యాలో 5 లక్షల, 20 వేల మంది కరువు వాతపడ్డారు. డిసెంబర్ 2023 నాటికి సోమాలియా కరువు అంచున ఉంది. 80 లక్షల, 30 వేల మంది ఆహార అభద్రత అధ్వాన స్థాయికి చేరింది.

పేదరికం, కరువు, ఆహార కొరత వల్ల పోషకాహారం లభించక పిల్లలు అనేక సమస్యలు గురిఅవుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన కనీస అవసరమైన ఆహారం కూడా ఆఫ్రికాలోని 10 మంది పిల్లల్లో 9 మంది అందటం లేదు. రోజు ఐదుగురిలో ఇద్దరు భోజనానికి దూరంగా ఉన్నారు. వయస్సుకు అనుగుణంగా ఎదుగుదల లేకపోవటంతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఆహార లేమి కారణంగా ప్రతి 3 సెకన్లకు ఒక పిల్ల వాడు, రోజుకి 10 వేల మంది చనిపోతున్నారు. ఆఫ్రికా దేశాలు కరువుకి, ఆకలికి నిలయంగా ఉన్నా, ఆసియాలోనే ఎక్కువ మంది ఆకలితో, పోషకాహార లోపంతో ఉన్నారు. ప్రపంచంలో పోషకాహార లోపం ఉన్న పిల్లల్లో 64% మంది ఆసియాలోనే ఉన్నారు. ఆసియాలోని 519.6 మిలియన్ల పెద్దలు, పిల్లలు చాలా తక్కువ ఖర్చుతో జీవిస్తున్నారు.

వీరు ఆసియా మొత్తం జనాభాలో 12 శాతం. దక్షిణాసియాలో పోషక ఆహార లోపం గ్లోబల్ హ్యాంగర్ ఇండెక్స్ (జిహెచ్‌ఐ) స్కోరు ప్రకారం 30.9% ఉంది. ఇది తీవ్రమైన ఆకలిని సూచిస్తుంది. అత్యధిక మంది పోషకాహార లోపం, ఆకలితో ఉన్నారు. ప్రపంచంలో 15 కోట్ల, 80 లక్షల మంది కుంగిపోయిన పిల్లలు ఉంటే, వీరిలో 8,30,60,000 (55%) మంది ఆసియాలోనే ఉన్నారు. (యూనిసెఫ్, వరల్డ్ బ్యాంకు గ్రూపు 2018). దక్షిణ ఆసియా అంతట తీవ్రమైన రక్తహీనత కారణంగా ప్రసవ సమయంలో ప్రతి రోజు 25 వేల మంది మహిళలు చనిపోతున్నారు. అఫ్ఘానిస్తాన్, గాజాలో (పాలిస్తీనియా) దురాక్రమణ యుద్ధాలకు, ఘర్షణలకు, ఆహార కొరతకు లక్షలాది ప్రజలు చనిపోయారు.

ఆకలి సూచిలో భారత దేశం పరిస్థితి దారుణంగా ఉంది. 2022లో 121 దేశాల్లో భారత్ 107 స్థానంలో ఉంది. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లు భారతదేశం కన్నా మెరుగ్గా ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక సంఖ్య లో కుంగిపోయిన పిల్లలు ఉన్న దేశం భారత్. దేశంలోని మొత్తం పిల్లల్లో 46.8 మిలియన్లు కుంగుబాటుతో బాధ పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కుంగిపోయిన పిల్లల్లో వీరు మూడవ వంతుగా ఉన్నారు. దేశంలో కౌమార దశలో (15-19 సంవత్సరాల వయస్సు) బాలికలలో రక్తహీనత 56% ఉంది.

భారత్‌లో చైల్డ్ వేస్టింగ్ రేటు 19.3%తో ప్రపంచంలోనే అత్యంత తీవ్ర సమస్యగా ఉంది. దేశంలో ఆకలి, పోషక ఆహారం లోపం వల్ల ప్రతి రోజు 4,500 మంది పిల్లలు చనిపోతున్నారు. ఆకలితో ప్రతి సంవత్సరం 3 లక్షల మందికి పైగా ప్రజలు మరణిస్తున్నారు. ప్రపంచ దేశాల్లోని పేద, సామాన్య ప్రజలు దేశ సంపదలకు దక్కక పోవటం, భూములు, ఫ్యాక్టరీలపై హక్కులు లేకపోవటం, పాలక ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలు, సంపద కేంద్రీకరణ, వెనుకబడ్డ దేశాల్లో సామ్రాజ్యవాదుల దోపిడీ, ఆధిపత్య విధానాలు, యుద్ధ ఘర్షణలు, పర్యావరణ కాలుష్యం, ప్రకృతి వైపరీత్యాల వల్ల పేదరికం, ఆకలి మరణాలకు కారణం. పాలకుల విధానాలకు, యుద్ధ ఘర్షణలకు వ్యతిరేకంగా ఆయా దేశాల ప్రజలు ఉద్యమించాలి.

బొల్లిముంత
సాంబశివరావు
9885983526

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News