తలుపు తట్టు (వేకప్ కాల్) కార్యక్రమానికి శ్రీకారం..
విద్యార్థి చదువు కోసం ప్రతి నెల తన సొంత నిధులతో ఐదు వేల ఆర్థిక సహాయం అందించిన కలెక్టర్ హనుమంతరావు
మనతెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాలని భావించారు. హాస్టల్ నిద్ర కార్యక్రమంలో భాగంగా బుధవారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలోని ఎస్సి హాస్టల్ లో ఆయన నిద్రించారు. తెల్లవారుజామున ఐదున్నర గంటలకు ఎలాంటి సమాచారం లేకుండా జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంస్థాన్ నారాయణపురం మండలంలోని శేరి గూడెం గ్రామంలో పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఇంటి తలుపును తట్టి నిద్ర లేపారు. ఇంటి తలుపులు తీసిన విద్యార్థితో భరత్ చంద్ర చారి అంటూ తాను జిల్లా కలెక్టర్ నని పరిచయం చేసుకున్నాడు. దీంతో ఆ విద్యార్థి కలెక్టర్ ను చూసి అవాక్కయ్యాడు. భరత్ చంద్రచారికి తండ్రి లేకపోవడంతో తల్లి కష్టపడి చదివిస్తోంది.
కుటుంబ ఆర్థిక స్థితిగతులతో పాటు పదవ తరగతి పరీక్షల కోసం ఎలా చదువుతున్నావని కలెక్టర్ విద్యార్థిని అడిగి తెలుసుకున్నారు. పదవ తరగతి అనేది విద్యార్థికి మైలు రాయి లాంటిదని, కష్టపడి చదువుకోవాలని విద్యార్థికి కలెక్టర్ సూచించారు. పదవ తరగతి పరీక్షలు పూర్తయ్యే వరకు ప్రతినెల ఐదు వేల రూపాయల సొంత డబ్బులను ఇస్తానని హామీ ఇచ్చారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి ఐదువేల రూపాయలను విద్యార్థి భరత్ చంద్ర చారికి కలెక్టర్ అందించారు. అంతేకాకుండా చదువుకునేందుకు స్టడీచైర్ తో పాటు రైటింగ్ ప్యాడ్ ను సైతం కలెక్టర్ అందించారు.
విద్యార్థులకు పదవ తరగతి మైలురాయి
విద్యార్థులు చదువు కోసం తల్లిదండ్రులు కష్టపడుతుంటారని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. ‘మీ అమ్మ.. నిన్ను కష్టపడి చదివిస్తున్నందుకు పదో తరగతిలో మంచి మార్కులు సాధించి వారికి సంతోషం ఇవ్వాలి’ అని విద్యార్థి భరత్ చంద్ర చారికి కలెక్టర్ తెలిపారు. పదవ తరగతిలో కష్టపడి చదివి పాస్ అయితే జీవితంలో విజయానికి తొలి మెట్టు అవుతుందని, కష్టపడి చదివి తల్లిదండ్రులు, గురువులకు యాదాద్రి భువనగిరి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆయన సూచించారు. భరత్ జీవితంలో స్థిరపడేవరకు సహకారం అందిస్తానని కలెక్టర్ స్పష్టం చేశారు.
పోలీస్ ఆఫీసర్ కావాలని ఉంది: విద్యార్థి భరత్..
జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెల్లవారుజామున మా ఇంటి తలుపు తట్టడం (వేకప్ కాల్)అవాక్కయ్యానని, కలెక్టరే స్వయంగా ఇంటికి రావడాన్ని నమ్మలేక పోతున్నానని విద్యార్థి భరత్ చంద్ర చారి చెప్పారు. తనకు పోలీస్ ఆఫీసర్ కావాలని ఉందని కష్టపడి సాధిస్తానని, తన ఇంటికి కలెక్టర్ రాకతో తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. బాగా చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తానని పేర్కొన్నాడు. తన ఇంటి తలుపు తట్టి తన కొడుకును ప్రోత్సహించడం పట్ల జిల్లా కలెక్టర్ కు విద్యార్థి తల్లి విజయలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు.