సుదీర్ఘ కాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్.. ప్రజల కళ్లకు గంతలు కట్టి తమ అధికారాన్ని కాపాడుకున్నారని ప్రధాని మోడీ అన్నారు. ఆ కాలంలో మరో విధానం గురించి ఆలోచించిన పరిస్థితి లేదని.. బుజ్జగింపు రాజకీయాలకే కాంగ్రెస్ నాయకులు ప్రాధాన్యం ఇచ్చారని మండిపడ్డారు. గురువారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా రాజ్యసభలో ప్రధాని ప్రసంగింస్తూ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్‌లో కాంగ్రెస్‌కు ఇబ్బంది ఏంటో అర్థంకావడం లేదన్నారు. దేశ ప్రజలందరికి సేవ చేసేందుకు మనం ఇక్కడున్నామని.. కానీ, ఫ్యామిలీ ఫస్ట్ అన్నదే కాంగ్రెస్ విధానమని.. నేషన్ ఫస్ట్ అనేది మా విధానమని చెప్పారు.
“మూడోసారి దేశ ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. ఇంతపెద్ద దేశంలో మాకు మూడోసారి అవకశం దక్కిదంటే మా అభివృద్ధిని ప్రజలు అర్థం చేసుకున్నారు. మా డెవలప్‌మెంట్ మోడల్‌ను సమర్థించారు. మా హయాంలో సమయమంతా దేశ ప్రజల ప్రగతి కోసం వినియోగిస్తున్నాం.కేవలం అర్హులకే లబ్ధి చేకూరేలా పథకాలను రూపొందించి అమలు చేస్తున్నాం. పదేళ్లలో సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ మార్పును గమనిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీలను బలోపేతం చేస్తున్నాం. ఓబీసీలకు కాంగ్రెస్ రిజర్వేషన్లు ఇవ్వలేదు. మేం వచ్చాక ఓబీసీల డిమాండ్‌ను నెరవేర్చాం. దేశంలో దివ్యాంగుల గురించి మిషన్ మోడ్‌లో పనిచేస్తున్నాం. దివ్యాంగుల కోసం ఎన్నో రకాల పథకాలు చేపట్టాం. ట్రాన్స్‌జండర్స్ గౌరవంతో బతికేలా చర్యలు తీసుకున్నాం” అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.