వాషింగ్టన్ : గాజాను స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం సర్వత్రా సంచలనం సృష్టించింది. దీనికి తోడు అక్కడి పాలస్తీనా వాసులను శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తామని బాంబు పేల్చారు. దీనిని పలు వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా మిత్రదేశాలైన సౌదీ, జోర్డాన్‌లు కూడా దీనిని వ్యతిరేకించాయి. దీంతో అమెరికా ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. తాజాగా శ్వేతసౌధం ప్రతినిధి కారోలైన్ లెవెట్టి దీనిపై స్పందిస్తూ ట్రంప్ వ్యాఖ్యల అర్ధాన్ని వివరించారు. తాత్కాలికంగా మాత్రమే వారిని ఇతర ప్రాంతాలకు మారుస్తామని చెప్పారు. “ట్రంప్ దీనిని చాలా స్పష్టంగా చెప్పారు.పాలస్తీనా శరణార్థులకు ఈ ప్రాంతంలో మా మిత్రదేశాలైన ఈజిప్ట్, జోర్డాన్‌లు ఆశ్రయం ఇస్తాయని ఆశిస్తున్నాను. అప్పుడే వారి ఇళ్లను మేము పునర్నిర్మించగలం.
ఈ విషయంలో ఇప్పటికే అధ్యక్షుడు ఓ స్పష్టత ఇచ్చారు. వారిని తాత్కాలికంగా మాత్రమే గాజా నుంచి బయటకు తరలిస్తారు. ఆ ప్రదేశం మొత్తం శిథిల భవనాలతో నిండిపోయింది. ప్రస్తుతం ఆ ప్రదేశం మనుషులకు నివాస యోగ్యం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో వారిని అక్కడే ఉండాలనడం దారుణం. అదే సమయంలో అమెరికా దళాలు అక్కడికి వెళ్లకూడదన్న దానికి ట్రంప్ కట్టుబడి లేరు. గాజా పునర్నిర్మాణంలో అమెరికా భాగం కావాలని బలంగా కోరుకుంటున్నారు. ఈ ప్రాంతంలో స్థిరత్వాన్ని కొనసాగించాలనుకుంటున్నారు. అలాగని అమెరికా ప్రజల సొమ్మును ఇక్కడ పెట్టుబడిగా పెడతారని అర్థం కాదు. ట్రంప్ ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ డీల్ మేకర్. ఈ ప్రాంతం లోని మా భాగస్వాములతో ఆయన ఓ ఒప్పందం చేసుకొంటారు” అని ఆమె వెల్లడించారు. బందీలు మొత్తాన్ని విడిపించడానికి అమెరికా కట్టుబడి ఉందని ఆమె పునరుద్ఘాటించారు. గాజా నియంత్రణను మరోసారి హమాస్ చేతికి వెళ్లనీయమని తేల్చి చెప్పారు.