సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం బిసి కులగణనను విజయవంతంగా చేపట్టిందని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని తెలియచేస్తూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసిసి అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం వేర్వేరుగా లేఖలను రాశారు. రాష్ట్రంలో బిసిల హక్కులను పరిరక్షించేందుకు, వారికి మరింత న్యాయం జరిగేలా ఈ సర్వే ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి తన అభిప్రాయాన్ని ఈ లేఖలో వ్యక్తం చేశారు.
బిసి కులగణనను కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జీ దీపాదాస్ మున్షీ, కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టిపిసిసి చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కీలకంగా పనిచేశారని మంత్రి కొండా సురేఖ ఆ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కట్టుబడి ఉందని, కామారెడ్డి డిక్లరేషన్‌లో పొందుపరిచిన ప్రకటనల ప్రకారం ఈ బిసి సర్వేను విజయవంతంగా అమలు చేయడం ఇందుకు నిదర్శనమని మంత్రి కొండా తెలిపారు.
ఈ సర్వేతో దేశవ్యాప్తంగా గుర్తింపు
కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఈ మొత్తం ప్రక్రియలో ప్రభుత్వానికి పూర్తి మద్దతుగా నిలిచిందని, పార్టీ అధినేతలు అందించిన సహాయ, సహకారంతోనే ఈ భారీ సర్వే చేపట్టగలిగామని కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. బిసిలకు ఈ సర్వే ద్వారా మరింత న్యాయం చేయడానికి అవకాశం లభిస్తుందని, వారి సంక్షేమానికి ఇది ఓ కీలక ముందడుగుగా నిలుస్తుందని మంత్రి కొండా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి మంత్రి కొండా సురేఖ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సర్వే విజయవంతం చేయడంలో సహకరించిన ఏఐసిసి అగ్రనేతలకు వేర్వేరుగా లేఖలు రాశారు. రాష్ట్రంలో బిసి సంక్షేమానికి కాంగ్రెస్ తీసుకుంటున్న ఈ చర్యలు బలమైన ప్రజాస్వామ్య విలువలకు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొంటూ, భవిష్యత్‌లో మరిన్ని సంక్షేమ చర్యలు చేపడుతామని మంత్రి కొండా స్పష్టం చేశారు. ఈ మేరకు జాతీయ నాయకత్వానికి మంత్రి కొండా సురేఖ వేర్వేరుగా లేఖలు రాశారు.