ఉరి వేసుకొని పదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో గురువారం జరిగింది. వివరాల ప్రకారం జనరల్ పరీక్షలకు సిద్ద్ధమవుతున్న తరుణంలో నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చొక్కన్నపల్లి గ్రామానికి చెందిన కొమ్ము రమేష్, రజితల కూతురు ఆరాధ్య (15) పదవ తరగతి చదువుకుంటుంది. ఆరాధ్య పాఠశాలలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన ఉపాధ్యాయులు విద్యార్థిని బాలానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం షాద్‌నగర్ తరలించగా అప్పటికే ఆరాధ్య మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటన తెలుసుకున్న విద్యార్ధి సంఘాలు పాఠశాల ఎదుట ధర్నా చేపట్టారు.
పాఠశాలలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జడ్చర్ల సిఐ ఆదిరెడ్డి ఆధ్వర్యంలో… పోలీసులు పాఠశాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ విజయేందిర బోయి పాఠశాలను సందర్శించి విద్యార్థి మృతికి గల కారణాలు పాఠశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రోధిస్తున్న తల్లిదండ్రులను ఓదార్చారు. విద్యార్థి కుటుంబంలో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాన్ని కల్పిస్తామని, విద్యార్ధి మృతికి కారణమైన వ్యక్తులపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ 50వేలు ఆర్ధికసాయం కుటుంబ సభ్యులకు అందజేశారు.