Friday, February 7, 2025

భారత్‌దే తొలి వన్డే

- Advertisement -
- Advertisement -

ఇంగ్లండ్‌తో గురువారం నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమష్టిగా రాణించిన భారత్ చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. తర్వాత లక్షఛేదనకు దిగిన భారత్ 38.4 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఆరంగేట్రం మ్యాచ్ ఆడిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 15 పరుగులు చేసి జోఫ్రా ఆర్చర్ వేసిన బంతికి పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఔటయ్యాడు. రోహిత్ రెండు పరుగులు మాత్రమే చేశాడు.

ఆదుకున్న శ్రేయస్, గిల్
ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ తమపై వేసుకున్నారు. గిల్ సమన్వయంతో బ్యాటింగ్ చేయగా శ్రేయస్ దూకుడును ప్రదర్శించాడు. ఇద్దరు అద్భుత బ్యాటింగ్‌తో జట్టును కష్టాల్లో నుంచి గట్టెక్కించారు. ఈ జోడీని విడగొట్టేందుకు ఇంగ్లండ్ బౌలర్లు చాలా సేపటి వరకు నిరీక్షించాల్సి వచ్చింది. శ్రేయస్ దూకుడుగా ఆడుతూ స్కోరును పరిగెత్తించాడు. చెలరేగి ఆడిన అయ్యర్ 36 బంతుల్లోనే 9 ఫోర్లు, రెండు సిక్సర్లతో 59 పరుగులు చేశాడు. ఇదే క్రమంలో మూడో వికెట్‌కు కీలకమైన 113 పరుగులు జోడించాడు. అయ్యర్ ఔటైనా గిల్ తన పోరాటాన్ని కొనసాగించాడు. అతనికి అక్షర్ పటేల్ అండగా నిలిచాడు.

ఇద్దరు కుదురుగా ఆడి మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిని ఔట్ చేసేందుకు ఇంగ్లండ్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. అయితే విజయానికి మరో 28 పరుగులు అవసరం ఉన్న సమయంలో అక్షర్ పటేల్ ఔటయ్యాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన అక్షర్ 47 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 52 పరుగులు చేశాడు. మరోవైపు అద్భుత బ్యాటింగ్‌తో అలరించిన శుభ్‌మన్ గిల్ 96 బంతుల్లో 14 బౌండరీలతో 87 పరుగులు సాధించాడు. ఓ వైపు కండరాల నొప్పి బాధిస్తున్నా గిల్ అద్భుత పోరాటం చేశాడు. అసాధారణ బ్యాటింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక రవీంద్ర జడేజా 12 (నాటౌట్), హార్దిక్ పాండ్య 9 (నాటౌట్) మిగిలిన లాంఛనాన్ని పూర్తి చేశారు.

తక్కువ స్కోరుకే..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. ఇంగ్లండ్ 248 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. కెప్టెన్ జోస్ బట్లర్, బెతెల్ మాత్రమే భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన బట్లర్ 4 ఫోర్లతో 52 పరుగులు చేశాడు. బెతెల్ 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 51 పరుగులు సాధించాడు. ఇక ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్‌లు జట్టుకు శుభారంభం అందించారు. చెలరేగి ఆడిన సాల్ట్ 26 బంతుల్లోనూ 3 సిక్స్‌లు, ఐదు ఫోర్లతో 43 పరుగులు చేశాడు. డకెట్ ఆరు ఫోర్లతో 32 పరుగులు సాధించాడు. భారత బౌలర్లలో జడేజా 9 ఓవర్లలో 26 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టారు. ఇక తొలి వన్డే ఆడిన హర్షిత్ రాణా కూడా మూడు వికెట్లను తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News