మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి తీవ్రమైన నిధుల కొరత వెంటాడుతున్నది. 2024- 25 బడ్జెట్లో కేటాయించిన నిధులను విడుదల చేయటంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఒక వైపు గ్రామీణ ఉపాధి హామీ పనులకు నిధులు పెంచాలని డిమాండు ఉన్నప్పటికీ అదనంగా నిధులు కేటాయించకపోగా.. గత బడ్జెట్లో పెట్టిన నిధులను కూడా విడుదల చేయటంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి ఎలాంటి అదనపు కేటాయింపులు జరగలేదు. ఫలితంగా కార్మికులకు వేతనాల చెల్లింపులు అసాధారణ జాప్యం జరుగుతున్నది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఈ పథకం కింద వేతనాల కోసం రూ. 4315 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అందుకోసం నిధుల బదిలీ ఆదేశాలు (ఎఫ్‌టిఒ) జారీ చేశారు. ఉపాధి హామీ చట్టంలోని సెక్షన్ 3(3) ప్రకారం దినసరి వేతనాలను వారానికి ఒకసారి చొప్పున అందజేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆలస్యమైనా పని పూర్తయిన తర్వాత పక్షం రోజులు దాటకూడదు. ఉపాధి పథకానికి మెటీరియల్ రూపంలో కేంద్రం తన వాటాగా రూ. 5715 కోట్ల బకాయి పడింది. ఉపాధి పనులకోసం ఉపయోగించే సామగ్రి కొనుగోలుకు అయ్యే వ్యయంలో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం భరించాల్సి ఉంటుంది. కేంద్రం తన వాటాను విడుదల చేయడంలో జరుగుతున్న జాప్యం కారణంగా భవిష్యత్ ప్రాజెక్టులపై ప్రభావం పడుతుంది.
మెటీరియల్ ఖర్చును చెల్లించడంలో జరుగుతున్న నిరంతర జాప్యం ఫలితంగా ముడిసరుకును సరఫరా చేసే స్థానిక సరఫరాదారులు విముకుత చూపుతున్నారు. 2024 సంవత్సరం బడ్జెట్లో ఉపాధి పథకానికి ప్రభుత్వం రూ. 86 వేల కోట్లు కేటాయించింది. అదనంగా నిధులు కేటాయించాలని గ్రామీణాభివృద్ధి శాఖ నుండి పలు విజ్ఞాపనలు వచ్చినప్పటికీ ఆర్థిక శాఖ పట్టించుకోలేదు. పథకానికి తక్కువ నిధులు కేటాయించడం పై విమర్శలు చెలరేగడంతో ప్రభుత్వం స్పందిస్తూ ఇది డిమాండ్‌ను బట్టి నడిచే పథకమని అవసరమైనప్పుడు అదనపు కేటాయింపులు జరుపుతామని తెలిపింది. ఉదాహరణకు 2020- 21 ఆర్థిక సంవత్సరంలో.. అంటే కోవిడ్ సమయంలో కార్మికులు పెద్ద సంఖ్యలో నగరాల నుండి స్వస్థలాల బాటపట్టారు.
ఆ సమయంలో ప్రభుత్వం పథకానికి కేటాయింపును రూ. 61,500 కోట్ల నుండి రూ.1,11,500 కోట్లకు పెంచింది. ఆ తర్వాత తగ్గిస్తూ వస్తుంది. బడ్జెట్ కేటాయింపులు తక్కువగా ఉండటంతో కృత్రిమంగా డిమాండు తగ్గుతుందని పథకాన్ని నిశితంగా పరిశీలిస్తున్న నిపుణులు, హక్కుల కార్యకర్తలు, ప్రజా సంఘాలు పూర్తిస్థాయి నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో ఎన్నో ఏండ్లుగా పని చేస్తున్న ఉద్యోగులకు వేతనాలు పెంచడం లేదు. వేతనాలు పెంచాలని కోరుతూ విజ్ఞప్తులు, ఆందోళనలు చేస్తున్నప్పటికీ గత ప్రభుత్వంలో వేతనాలు పెంచాలని కోరుతూ సమ్మె చేసిన 7,500 మంది ఫీల్ అసిస్టెంట్‌లను ఉద్యోగాల నుంచి తొలగించింది. తిరిగి రెండున్నర సంవత్సరాల తర్వాత 2023 ఎన్నికల ముందు తిరిగి వారిని పనిలోనికి తీసుకున్నారు. కానీ వేతనాలు పెంచలేదు.
రాష్ట్రంలో ఉపాధి హామీ స్కీంలో రాష్ట్ర వ్యాప్తంగా 12,500 మంది టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్స్ మొదలగువారు పని చేయుచున్నారు. వీరికి నవంబర్ నెల నుంచి జీతాలు రావడం లేదు. ఈ స్కీమ్‌లో గత 18 సంవత్సరాల నుంచి పని చేస్తున్నప్పటికీ కనీస వేతన విధానం, పే స్కేలు లేదు. వీరిలో చాలామంది రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉన్నారు. ఈ మధ్యకాలంలో కొంతమంది చనిపోయారు. అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్నప్పటికీ మాకు గుర్తింపు లేదని, నెలకు జీతాలు రాక, అప్పులతో ఆత్మహత్యలు కూడా చేసుకున్న వారు ఉన్నారని సిబ్బంది ఆందోళన వెలిబుచ్చుతున్నారు. మొదటిసారిగా 2016 వేతనాలు పెంచినారని ప్రస్తుతం ఫీల్ అసిస్టెంట్స్‌కు రూ.12 వేలు మాత్రమే ఇస్తున్నారని.. అది గత మూడు నెలలుగా వేతనాలు అందలేదని తెలుపుతున్నారు.
మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను చెల్లించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా జాతీయ ఉపాధి హామీ ఉద్యోగులు 606 మండలాల్లోని ఎంపిడిఒలకు వినతి పత్రాలు సమర్పించారు. పెండింగ్ వేతనాలతో పాటు వేతన సవరణ, పే స్కేల్స్ ఇవ్వాలని కోరుతూ ఆందోళన కార్యక్రమం చేపడుతున్నట్లు ఉపాధి హామీ ఉద్యోగుల సంఘం ఐకాస ప్రకటించింది. ఉపాధి హామీ పనులలో మెటీరియల్ కాంపోనెంటుకు 40 శాతం, లేబర్ కాంపోనెంట్‌కు 60 శాతం కేటాయిస్తూ, మెటీరియల్ కాంపోనెంటులో 5 శాతం ఉద్యోగుల వేతనాలకు కేటాయిస్తున్నారు. 10 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సింది, కేంద్రం నుంచి వచ్చే నిధులు సకాలంలో విడుదల కాకపోవటంతో పనులు పూర్తిగా కాకపోవడం.. అందులో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలు సకాలంలో ఇవ్వలేకపోతున్నామని గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రకటిస్తుంది.
ఉజ్జిని రత్నాకర్ రావు, 94909 52646