వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిసి)పై ఆంక్షలు విధించారు. ఈమేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డరుపై ట్రంప్ సంతకం చేశారు. ఐసీసీ అధికారులు అమెరికాలో ప్రవేశించకుండా వారిపై నిషేధాజ్ఞలు అమలవుతాయి. ఐసీసీ అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతోపాటు కోర్టు దర్యాప్తులకు సహకరించారని తేలితే వారి ఆస్తుల్ని స్తంభింప చేయడంతోపాటు వారి ప్రయాణాలపై నిషేధం విధించే అధికారం ఉంది. అమెరికా, దాని మిత్రదేశం ఇజ్రాయెల్ లక్షంగా ఐసీసీ నిరాధార దర్యాప్తులు చేపడుతోందని, ట్రంప్ ఆరోపించారు.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై అరెస్టు వారంట్ జారీ చేసి ఐసీసీ , తన అధికారాలను దుర్వినియోగం చేసిందని ట్రంప్ మండిపడ్డారు. అందుకే ఈ చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు.ఈ సందర్భంగా అఫ్గనిస్థాన్‌లో అమెరికా సర్వీస్ సభ్యులపై , గాజాలో ఇజ్రాయెల్ దళాలు చేసిన యుద్ధ నేరాలపై ఐసీసీ దర్యాప్తుల్ని ప్రస్తావించారు. మాపై , మా మిత్రదేశం ఇజ్రాయెల్‌పై ఐసీసీ చట్టవిరుద్ధమైన, నిరాధారమైన చర్యలకు పాల్పడిందని ఉత్తర్వుల్లో వెల్లడించారు. అమెరికా లేదా ఇజ్రాయెల్ ఐసిసికి న్యాయపరిధిలో లేవని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో భేటీ జరిగిన రెండు రోజుల వ్యవధి లోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. గాజాలో యుద్ధ నేరాలు, అమానుష చర్యలకు సంబంధించి ఇజ్రాయెల్ ప్రధానిపై గత ఏడాది అంతర్జాతీయ న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసింది.
మానవహక్కుల కార్యకర్తల విమర్శలు
అంతర్జాతీయ న్యాయస్థానంపై ఆంక్షలు విధించడాన్ని మానవహక్కుల కార్యకర్తలు ఆక్షేపించారు. ఇతర జోన్లలో ఎక్కడైతే కోర్టు దర్యాప్తు సాగిస్తోందో దానికి విరుద్ధంగా అమెరికా తన ప్రయోజనాలను నెరవేర్చుకుంటోందని వ్యాఖ్యానించారు. మానవహక్కులకు అన్యాయం జరిగితే బాధితులు న్యాయం కోసం కోర్టును ఆశ్రయించడానికి వీలులేకుండా అధ్యక్షుడు ట్రంప్ ఉత్తర్వులు అడ్డుకుంటాయని అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ నేషనల్ సెక్యూరిటీ ప్రాజెక్టు స్టాఫ్ అటార్నీ చార్లె హోగ్లే విమర్శించారు. అమెరికాలో ఎక్కడైనా, ఎవరైనా ఘోరాలకు పాల్పడితే వారిని గుర్తించడానికి కోర్టుకు సహకరిస్తే కఠినమైన జరిమానాలు విధిస్తామని ఉత్తర్వులో హెచ్చరించడం ప్రజలను రిస్కులో నెట్టడమేనని ఆరోపించారు.
జవాబుదారీతనానికి, స్వేచ్ఛా ప్రసంగానికి ఇదో దాడిగా వ్యాఖ్యానించారు. కోర్టుతోను, దాని నిర్వహణ తోను మీరు అంగీకారం కాకపోవచ్చు. కానీ ఈ ఉత్తర్వు పరిమితి దాటినట్టేనని వాషింగ్టన్ డైరెక్టర్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వాచ్ సరాయాగెర్ పేర్కొన్నారు. ఏ నిషేధమైనా కోర్టును ఇబ్బంది చేయడమే కాకుండా దర్యాప్తు చేయడానికి ఎక్కడికైనా ప్రయాణించేందుకు కష్టనష్టాలు ఎదురవుతాయి. గత ఏడాది కోర్టు సైబర్‌దాడులతో సతమతమైంది. ఉద్యోగులు కొన్ని వారాల పాటు ఫైళ్లకు అనుసంధానం కాలేకపోయారు.
ట్రంప్ ఆంక్షలను ఖండించిన ఐసీసీ
ది హేగ్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఆంక్షలను సభ్య దేశాలు ప్రతిఘటించాలని అంతర్జాతీయ నేర న్యాయస్థానం శుక్రవారం పిలుపునిచ్చింది. ఇది కోర్టు స్వతంత్రతకు, న్యాయపరమైన విధులకు హాని కలిగించే ప్రయత్నంగా ధ్వజమెత్తింది. ప్రపంచం మొత్తం మీద ఘోరాలకు అక్రమాలకు బలైపోతున్న కోట్లాది మంది అమాయకులకు న్యాయం, ఆశాభావం కల్పించడానికి కోర్టు అంకితమైందని స్పష్టం చేసింది. “ మా 125 దేశాల పార్టీలు, సివిల్ సొసైటీ, ప్రపంచం లోని అన్ని దేశాలు న్యాయం కోసం, ప్రాథమిక మానవ హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా నిలబడాలి ” అని విజ్ఞప్తి చేసింది.