ఖమ్మం జిల్లా, సత్తుపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో బ్రాయిలర్ కోళ్లతోపాటు నాటుకోళ్లను అంత చిక్కని వైరస్ పట్టిపీడిస్తోంది. గత నెల రోజులుగా బాయిలర్ కోళ్లు లక్షల సంఖ్యలో మరణించడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే వైరస్ ఇపుడు నాటుకోళ్లకు కూడా పాకింది. శుక్రవారం నాటుకోళ్ల ఫారంలో ఉన్న అత్యంత ఖరీదైన పందెం పుంజులు, జాతి పెట్టలు 300 వరకు మరణించాయి. క్షణాల్లోనే కుప్పలు కుప్పలుగా కోళ్లు మరణించడం వైరస్‌కు ఉన్న లక్షణంగా కనిపిస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా వివిధ గ్రామాల్లోని ఇళ్లలో పెంచుకునే నాటుకోళ్లు మరణించాయి. అయితే పూర్వంలా నాటుకోళ్లు విరివిగా లేకపోవడంతో ఈ విషయంపై బాహ్య ప్రపంచంలో చర్చ జరగలేదు. అయితే, బ్రాయిలర్ కోళ్లు మాత్రమే పెరుగుతున్న ఫారాల్లో కుప్పలు కుప్పలుగా మరణించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పశుసంవర్ధక శాఖ అధికారులు మరణించిన బ్రాయిలర్ కోళ్ల నమూనాలను సేకరించి ల్యాబ్‌లకు పంపించారు. అయితే, ఇప్పటివరకు మరణానికి కారణమైన వైరస్ నివారణకు మార్గాలను ఆ శాఖ వెల్లడించడం లేదు. సాధారణ వైద్యమే చేస్తున్నారు.
ఆంధ్ర నుండే కోళ్లకు వైరస్..
సంక్రాంతి పండగ సందర్భంగా తెలంగాణ ప్రాంతంలోని కోడి పుంజులు పందేల కోసం ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళాయి. కొన్ని రోజులు పాటు పుంజులు అటుఇటు తిరగడంతో వాటికి సోకిన వైరస్ గ్రామాల్లో ఉన్న నాటు కోళ్లకు సోకిందని పలువురు భావిస్తున్నారు. ఒక్క జనవరిలోనే జిల్లాలోని బ్రాయిలర్ ఫారాల్లో లక్షల సంఖ్యలో కోళ్లు మరణించాయని తెలిసింది. సత్తుపల్లి నియోజకవర్గం నుండి 5 మండలాలు ఆంధ్ర ప్రాంతానికి సరిహద్దుగా ఉండటంతో వైరస్ వేగంగా ఇక్కడి కోళ్లకు అంటుకున్నట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా ఫారం బ్రాయిలర్ కోళ్ల కంటే నాటుకోళ్లకు ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. అందువల్లే రేజర్ల ఫారంలోని కోళ్లు ఆలస్యంగా ఒకేసారి మరణించాయని కోళ్ల పెంపకంలో అనుభవం ఉన్నవారు అంటున్నారు.
పది లక్షల పైన నష్టం: దేశ్‌రెడ్డి వెంకట్ రెడ్డి
రేజర్లలో నాటుకోళ్ల ఫారంలో పుంజులను పెంచుతున్న దేశ్ రెడ్డి వెంకట్ రెడ్డి తాను ఒక్క రోజులోనే రూ.10 లక్షలు కోల్పోయానని అన్నారు. ఉదయం మొదలైన చావులు సాయంత్రానికల్లా షెడ్లు షెడ్డు మొత్తం ఖాళీ అయిందని, 300 నాటుకోళ్ల్లు మరణించాయని తెలిపారు. ఒక్కో కోడి విలువ రూ.6000 నుంచి 30 వేల వరకు ధర పలుకుతుందని అన్నారు. ఆంధ్రకు సరిహద్దుగా ఉండటంతో పందెం కోళ్లకు అంత గిరాకీ ఉంటుందని తెలిపారు. పందెం పుంజుల కోసం పెంచే పెట్టలకు మూడు నుంచి నాలుగు వేలు పలుకుతుందని అన్నారు. తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, వేంసూరు, సత్తుపల్లి మండలాల్లో పౌల్ట్రీ రైతులు కోలుకోని విధంగా నష్టపోయారని వాపోయారు.
కోవిడ్ సమయంలో జరిగిన నష్టం కంటే ఇప్పుడు జరిగిన నష్టం ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మరణించిన కోళ్ల అంచనాలను సేకరించి రైతులను ఆదుకుంటే తప్ప వారికి ఆత్మహత్యలు శరణ్యమని అన్నారు. మరణించిన కోడిని కోసి చూడగా గుండె ఒకటే పాడైపోయిందని, మిగతా అవయవాలన్నీ బాగానే ఉంటున్నాయని తెలిపారు. గుండె భాగం నుజ్జునుజ్జుగా అయినట్లు తెలుసుకొని ఆ భాగాలను ఖమ్మం వైద్యులకు పంపి అది ఏ వ్యాధో తెలుసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు.